లక్ష్మీ, రిషికుమార్ (ఫైల్)
హిందూపురం: వ్యాపారం కలిసిరాక.. సర్కారు ఆదుకోక.. ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. వ్యాపారం కోసం అప్పు తీసుకున్న పాపానికి మైక్రోఫైనాన్స్ ప్రతినిధులు నరకం చూపారు. అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం లేకపోవడంతో ఆ తల్లి బలవన్మరణానికి తెగించింది. విషగుళికలు కలుపుకున్న కూల్‌డ్రింక్‌ను తాను తాగి కొడుకూ, కూతురికీ తాగించింది. తల్లీకొడుకు మృతిచెందగా, కూతురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం బీరేపల్లిలో మంగళవారం జరిగిన ఈ ఘటన గుండెలను పిండేసింది.
వ్యాపారం సాగక.. సర్కార్ సాయం అందక
బీరేపల్లికి చెందిన ముద్దప్పకు భార్య లక్ష్మి (35), కుమారుడు రిషికుమార్ (13), కుమార్తె శ్రీనిధి ఉన్నారు. ముద్దప్ప భార్యతో కలిసి చిరుధాన్యాలను సంతల్లో విక్రయించి కుటుంబాన్ని పోషించుకునేవాడు. వైఎస్సార్ సీపీ హయాంలో వివిధ పథకాల కింద ఆర్థిక సాయం అందేది. అలాగే ముద్దప్ప భార్య లక్ష్మి డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు సంఘం సాయంగా నిలిచేది. రెండేళ్లుగా ముద్దప్ప కుటుంబానికి సర్కారు నుంచి సాయం అందడంలేదు.
మరోవైపు వ్యాపారమూ జరగడం లేదు. దీంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఇబ్బంది కావడంతో ముద్దప్ప తొలుత ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు చేశాడు. అయితే రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో మైక్రో ఫైనాన్స్ సంస్థను ఆశ్రయించాడు. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడక అప్పులు వడ్డీతో కలిపి భారంగా మారాయి. ఈ క్రమంలోనే కుటుంబంలోనూ మనశ్సాంతి కరువైంది. మైక్రో ఫైనాన్స్ సంస్థకు చెల్లించాల్సిన అప్పు తలచుకుని ముద్దప్ప నిత్యం ఆందోళన చెందేవాడు.
ఇది చూసి భార్య లక్ష్మి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అయితే తాను చనిపోతే పిల్లలు దిక్కులేని వారవుతారని భావించిన ఆమె మంగళవారం కూల్‌డ్రింక్ తీసుకురావాలని భర్తను కోరింది. ముద్దప్ప తెచ్చిన కూల్‌డ్రింక్‌లో అప్పటికే తెచ్చిపెట్టుకున్న విషపు గుళికలను కలిసి తాను తాగడంతోపాటు కుమారుడు రిషికుమార్, కుమార్తె శ్రీనిధికీ తాగించింది. శ్రీనిధి వాంతులు చేసుకోగా, తల్లీకుమారుడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు.
కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న ముద్దప్పకు భార్యాకుమారుడు విగతజీవులుగా కనిపించారు. కుమార్తె శ్రీనిధిని గ్రామస్తుల సాయంతో ఆసుపత్రికి తరలించాడు. ప్రసుత్తం ఆ చిన్నారి చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది. విషయం తెలుసుకున్న హిందూపురం వైఎస్సార్సీపీ నియోజకవర్గ ముఖ్యనేతలు గుడ్డంపల్లి వేణురెడ్డి, పార్టీ నాయకులు వెళ్లి ముద్దప్పకు ధైర్యం చెప్పారు. హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


