
మూడు రోజులు మోస్తరు వర్షాలు
మెరుపులు, పిడుగులకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడుపై సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అలాగే దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. వీటి ఫలితంగా రానున్న మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి.
శని, ఆదివారాల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడ పిడుగులకు ఆస్కారం ఉందని, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆదివారం నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వివరించింది.