టీడీపీలో చిచ్చు రేపిన లోకేష్ పర్యటన

MLC Shamanthakamani Fires On Nara Lokesh - Sakshi

సాక్షి, అనంతపురం : గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతిపక్ష టీడీపీలో విభేదాలు మరింత ముదురుతున్నాయి. నేతల మధ్య బేధాభిప్రాయాలు తారా స్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఆ పార్టీ ముఖ్యనేత నారాలోకేష్‌ అనంతపురం పర్యటన టీడీపీలో చిచ్చుపెట్టింది. జేసీ కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోకేష్‌ అనంత పర్యటనలో భాగంగా జేసీ పవన్ రెడ్డి హైదరాబాద్ నుంచి లోకేష్ వెంట కారులో వచ్చారు. జేసీ పవన్, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కనుసన్నల్లోనే లోకేష్ పర్యటన అంతా సాగుతోంది. (లోకేష్‌ పర్యటనపై శ్రావణి తీవ్ర అసంతృప్తి)

దీంతో మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్, ఉన్నం హనుమంత రాయచౌదరి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే బాటలో మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2014 దాకా టీడీపీని అణచివేసిన జేసీ ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వడంపై టీడీపీ నేతల్లో తీవ్ర చర్చసాగుతోంది. జేసీ ఫ్యామిలీని అందలమెక్కిస్తే పార్టీని వీడేందుకు సిద్ధమంటూ సీనియర్లు గుసగుసలాడుతున్నారు. మరోవైపు బండారు శ్రావణి వర్గం సైతం లోకేష్‌ తీరుపై గుర్రుగా ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్ద తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

నారా లోకేష్ రాజకీయ అజ్ఞాని..
టీడీపీ నేత నారా లోకేష్‌పై ఎమ్మెల్సీ శమంతకమణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు లోకేష్‌కు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. రైతుభరోసా పథకం, వైఎస్సార్ జలకళ కింద ఉచిత బోరు బావులు వేస్తున్న సంగతి తెలియదా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను సీఎం జగన్ ఆదుకున్న విషయం గుర్తులేదా అని ధ్వజమెత్తారు.

నారా లోకేష్‌ అనంతపురం పర్యటన నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన శామంతకమణి.. ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల పక్షపాతని వర్ణించారు. వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభత్వుం సిద్ధంగా ఉందని, ఈ మేరకు చర్యలు సైతం చేపట్టిందని గుర్తుచేశారు. లోకేష్‌ ఓ రాజకీయ అజ‍్క్షాని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం జిల్లాలోని కరడికొండ, ధర్మాపురం, మిడుతూరు, రాందాస్ పేట, ,కామారుపల్లి గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన లోకేష్‌.. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆరోపణలు చేశారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అయితే వరద నష్టంపై కలెక్టర్‌ గంధం చంద్రుడు వాస్తవాలు బహిర్గతం చేశారు. అనంతలో భారీ వర్షాలకు 38.53 కోట్ల పంట నష్టం జరిగిందని తెలిపారు. 13861 హెక్టార్లలో పంటలు నష్టపోయాయని వివరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top