కదిరి ఎమ్మెల్యేపై కందికుంట అనుచరుల అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు

MLA PV Sidda Reddy Complains About Obscene Posts - Sakshi

శాంతిభద్రతలకు విఘాతం కల్గించడమే టీడీపీ లక్ష్యం 

కందికుంట అనుచరులపై చర్యలు తీసుకోవాలని సిద్దారెడ్డి వినతి 

సాక్షి, కదిరి: ‘టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పలు కేసుల్లో నేరస్తుడు, 12 ఏళ్లు శిక్ష పడిన ఖైదీ. డీడీల దొంగ. ఆయన ఇకపై వార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయడానికి అర్హుడు కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది’ అని కదిరి ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కందికుంట అనుచరులు ఫేస్‌బుక్‌లో పెట్టిన అసభ్యకర పోస్టులపై గురువారం పట్టణ సీఐ సత్యబాబుకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

కందికుంట అనుచరులు పోరెడ్డి ఓబుళరెడ్డి, మారుతీకుమార్, కళ్యాణ్‌చిన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన అసభ్యకర పోస్టులను చదివి వినిపించారు. ఉగాండాలో బోరుబండి దగ్గర పైపులు మోసుకునే పోరెడ్డి ఓబుళరెడ్డికి పెద్దగా చదువు రాదని, మాజీ సీఎం చంద్రబాబు ఎలాగైతే పట్టాభి చేత సీఎం వైఎస్‌ జగన్‌ను తిట్టించారో, అలాగే ఇక్కడ కూడా కందికుంట తన అనుచరుల ద్వారా తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించాలని కుట్ర చేస్తున్నారని చెప్పారు. 

విచారణకు పిలిపిస్తే తప్పేంటి?.. 
ఉగాండాలో ఉన్న వ్యక్తి తనపై అసభ్యంగా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడితే విచారణలో భాగంగా పోలీసులు ఆయన తండ్రిని పోలీసుస్టేషన్‌కు పిలిపిస్తే తప్పేంటని ఎమ్మెల్యే సిద్దారెడ్డి ప్రశ్నించారు. ఇదేదో పెద్ద నేరమైనట్లు ఎల్లో మీడియా తమ ఛానళ్లలో డిబేట్‌లు పెట్టి ప్రసారం చేశాయని, అదే మీడియా తనపై, తన కుటుంబ సభ్యులపై పెట్టిన అసభ్యకర పోస్టులపై ఎందుకు కథనాలు ప్రసారం చేయలేదో చెప్పాలన్నారు. ఇదే అవమానం మీ ఇంట్లో ఆడవాళ్లకు జరిగితే ఇలాగే వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు. అసభ్యకర  పోస్టులు పెట్టిన వారికి మద్దతుగా మాజీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్‌ తన ట్విట్టర్‌లో స్పందించడం సరికాదన్నారు. అలాగే కదిరి ‘సాక్షి’ విలేకరిపై అసభ్యకర పోస్టులు పెట్టినా.. జర్నలిస్టు యూనియన్‌ నాయకులు ఎందుకు స్పందించ లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చదవండి: (చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్‌ నాయుడు అరెస్ట్‌)

డీఎస్పీకి భయమెందుకు?.. 
కదిరి డీఎస్పీ భవ్యకిషోర్‌ నేరస్తుడైన కందికుంటకు ఎందుకు భయపడుతున్నారని ఎమ్మెల్యే సిద్దారెడ్డి ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారులే నేరస్తులకు భయపడితే ఇక సామాన్యులు పరిస్థితి ఏం కావాలన్నారు. మహిళలను దూషిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన వారిపై సాటి మహిళగా ఆమె ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దామన్నారు. కాగా.. ఎమ్మెల్యే పీఏ అబూబాకర్‌ సైతం తనపై పెట్టిన అసభ్యకర పోస్టులపై మరో ఫిర్యాదు చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top