అక్రమ రిజిస్ట్రేషన్ల కేసు నేపథ్యం... ‘మీసేవ’తో పాటు ఇంటర్‌నెట్ నిర్వాహకుల పాత్రపైనా విచారణ
సాక్షి, యాదాద్రి: ధరణి, భూభారతి పోర్టళ్ల ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్ అక్రమాల్లో మీసేవ కేంద్రాలు, ఇంటర్‌నెట్ కేంద్రాల నిర్వాహకుల పాత్రపై విచారణ జరుగుతోంది. యాదగిరిగుట్ట కేంద్రంగా జరిగిన ఈ అక్రమాల కేసులో పలువురు మీసేవ కేంద్రాల నిర్వాహకులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. యాదాద్రి జిల్లా వలిగొండ మీసేవ కేంద్రం నిర్వాహకుడిపై రెండు రోజుల క్రితం వర్కట్‌పల్లికి చెందిన సిర్పంగి స్వామి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
వలిగొండలో మీసేవ నడుపుతున్న బలికే రాకేష్ భూభారతి అక్రమాల కేసులో పోలీస్ కేసు నమోదై అరెస్టు అయ్యారు. అయితే తహసీల్దార్ కార్యాలయంలోని అధికారులు సహకరించడం వల్లే మోసం జరిగిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర ప్రైవేట్ సిబ్బంది, మీసేవ కేంద్రాల నిర్వాహకుల మధ్య సహకారం కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మీసేవ, డాక్యుమెంట్ రైటర్లు, ఇంటర్‌నెట్ కేంద్రాల నిర్వాహకులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఆపరేటర్లదే హవా!: రెవెన్యూ అధికారులు సైతం కంçప్యూటర్ ఆపరేటర్ల మీద ఆధారపడి.. ఫైళ్లు క్రాస్ చెక్ చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా నెట్ సెంటర్లకు ట్రేడ్ లైసెన్స్‌లు లేకపోవడం గమనార్హం. ఇలావుండగా సీసీఎల్‌ఏ లాగిన్‌లోకి ఎంటర్ అయి.. అక్రమాలకు పాల్పడిన 85 మందిపై పోలీస్ కేసులు నమోదు కాగా ఇందులో ఇద్దరు మీసేవ కేంద్రాల నిర్వాహకులు, 83 మంది సిటిజన్ లాగిన్ ద్వారా నెట్ సెంటర్‌ల నిర్వాహకులు లావాదేవీలు నడిపినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఒక్కో వ్యక్తి వందల కొద్దీ లావాదేవీలకు లాగిన్ అవుతున్నా పట్టించుకోలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.


