గట్టిగా ‘ఎవడూ’ అడగలేదు | MLA Balakrishna Fires on Chiranjeevi | Sakshi
Sakshi News home page

గట్టిగా ‘ఎవడూ’ అడగలేదు

Sep 26 2025 6:24 AM | Updated on Sep 26 2025 6:26 AM

MLA Balakrishna Fires on Chiranjeevi

అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ ఫైర్‌

జగన్‌ను కలవడానికి వెళితే అవమానించారని చిత్రీకరణ

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పైనా పరుష వ్యాఖ్యలు 

సాక్షి, అమరావతి: మెగాస్టార్‌ చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ శాసన సభలో గురువారం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని ఏకవచనంతో సంబోధిస్తూ ‘ఎవడు’ అంటూ మాట్లాడారు. శాసనసభలో గురువారం శాంతిభద్రతల అంశంపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్‌ మాట్లాడిన విషయాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవిని అవమానించారని, ఆయన్ను కలవడానికి వెళితే కలవకుండా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారని శ్రీనివాస్‌ చెప్పారు.

దీనిపై జోక్యం చేసుకున్న బాలకృష్ణ.. కామినేని శ్రీనివాస్‌ చెప్పినదంతా అబద్ధమని కొట్టిపడేశారు. చిరంజీవి గట్టిగా అడిగితే సీఎం వచ్చాడనేది అబద్ధమని, అక్కడ గట్టిగా ఎవడూ అడగలేదని బాలకృష్ణ అన్నారు. గట్టిగా అడిగితేనే ఆయన కలవడానికి వచ్చాడని, లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారనేది అసత్యమని, ఆయన గట్టిగా చెబితే దిగొచ్చాడంట.. అని వ్యంగ్యంగా అన్నారు. ‘గట్టిగా అడిగారా.. ఎవడు అడిగాడు గట్టిగా, అడిగితే వచ్చాడా వీడు కలవడానికి. నాన్సెన్స్‌’ అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు. 

జగన్‌పైనా పరుష పదజాలం 
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి బాలకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘ఇండస్ట్రీ వాళ్లు సైకో గాడిని కలవడానికి వెళ్లినప్పుడు..’ అంటూ పరుష పదజాలాన్ని వాడటమేకాక వాడు, వీడు అంటూ సభ్యత లేకుండా మాట్లాడారు. ఆయన మాట్లాడిన తీరును బట్టి ఆయన మామూలుగా లేరనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.  

కూటమి పాలనలోనూ అవామనం అంటూ ఆగ్రహం
కూటమి ప్రభుత్వంలోనూ తనకు అవమానం జరిగినట్టు బాలకృష్ణ ఫైర్‌ అయ్యారు. ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కి లిస్ట్‌ తయారు చేయమని ఈ ప్రభుత్వంలోనూ తనకు ఆహా్వనపత్రం వచ్చిందని, అందులో తనది తొమ్మిదో పేరు వేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అది వేసింది ఎవడని సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్‌ని అడిగానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement