మిథున్‌రెడ్డికి బెయిల్‌.. నిరూపించే ఆధారాల్లేవ్‌ | Mithun Reddy granted bail in liquor smuggling case | Sakshi
Sakshi News home page

మిథున్‌రెడ్డికి బెయిల్‌.. నిరూపించే ఆధారాల్లేవ్‌

Sep 30 2025 5:31 AM | Updated on Sep 30 2025 5:31 AM

Mithun Reddy granted bail in liquor smuggling case

ఎంపీ మిథున్‌రెడ్డితో ఆయన తండ్రి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు

మద్యం కేసులో ఆయన పాత్రను నిరూపించే ఆధారాల్లేవ్‌: ఏసీబీ కోర్టు 

ఆరోపణల ఆధారంగా అమూల్యమైన బెయిల్‌ హక్కును తిరస్కరించలేం

నిందితుడి పాత్ర, ఆధారాలు కాకుండా కేవలం తీవ్రమైన కేసు అనే కారణంతో బెయిల్‌ను నిరాకరించలేం 

మాస్టర్‌ మైండ్‌ అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు

సహ నిందితుల వాంగ్మూలాల ఆధారంగానే ఆరోపణలు 

ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు 

మా ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు 

ముడుపులు వసూలు చేశారన్న ఆరోపణలు నిరాధారం 

నేరపూరిత కుట్రకు సైతం ఆధారాలు 

చూపలేకపోయారు.. సాక్ష్యాలు తారుమారు చేసినట్లు కూడా ఆరోపణలేవీ లేవు 

అనుమానాలతో నిరవధికంగా కస్టడీలో ఉంచలేమంటూ బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం 

రాజమహేంద్రవరం జైలు నుంచి మిథున్‌రెడ్డి విడుదల   

కేవలం కేసు తీవ్రత, పరిమాణం మాత్రమే కాక నిందితుని పాత్ర, దర్యాప్తు అధికారులు సేకరించిన ఆధారాలను బట్టే బెయిల్‌ మంజూరుపై నిర్ణయం ఉంటుంది. ప్రస్తుత కేసులో పిటిషనర్‌ పాత్రను నిర్ధారించేందుకు సరైన, బలమైన ఆధారాలేవీ లేవు.  

ఈ కేసులో మిథున్‌రెడ్డి మాస్టర్‌ మైండ్‌ అని, కీలక పాత్ర పోషించారని, ఇందుకు ప్రాసిక్యూషన్‌.. సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలంపై ఆధార పడుతోంది. కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. సహ నిందితుల వాంగ్మూలాలు, కొందరు సాక్షులు ఇచ్చిన 164, 161 స్టేట్‌మెంట్లు  తప్ప ఇతర ఆధారాలను సమర్పించలేదు. ఇవి బెయిల్‌ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు.

నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను చూపలేకపోయారు. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు ఆధారాలేవీ చూపలేదు. కోర్టు ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. అందువల్ల బెయిల్‌ను తిరస్కరించలేము.     
– ఏసీబీ కోర్టు

సాక్షి, అమరావతి/గాందీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌) :  మద్యం అక్రమ కేసులో నిందితునిగా ఉన్న రాజంపేట పార్లమెంట్‌ సభ్యుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను చూపలేకపోయారని కోర్టు స్పష్టం చేసింది. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు సైతం ఆధారాలేవీ చూపలేదని పేర్కొంది. కోర్టు ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావని, అందువల్ల బెయిల్‌ను తిరస్కరించలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో మిథున్‌రెడ్డి మాస్టర్‌ మైండ్‌ అని, కీలక పాత్ర పోషించారనడానికి కూడా ఎలాంటి ఆధారం చూపలేదని తప్పు పట్టింది. 

ప్రాసిక్యూషన్‌.. ఆధారపడుతున్న సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదని చెప్పింది. 164, 161 స్టేట్‌మెంట్లు బెయిల్‌ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవని చెబుతూ న్యాయాధికారి పి.భాస్కరరావు బెయిల్‌ మంజూరు చేశారు. ఈ కేసులో నాల్గవ నిందితునిగా ఉన్న మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు ఈ ఏడాది జూలై 19న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన 72 రోజులుగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల ఆయన ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తీర్పులోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.   

ఆరోపణల ఆధారంగా బెయిల్‌ హక్కును నిరాకరించలేం 
‘కేవలం కేసు తీవ్రత, పరిమాణం మాత్రమే కాక నిందితుని పాత్ర, దర్యాప్తు అధికారులు సేకరించిన ఆధా­రాలను బట్టే బెయిల్‌ మంజూరుపై నిర్ణయం ఉంటుంది. ప్రస్తుత కేసులో పిటిషనర్‌ పాత్రను నిర్ధారించేందుకు సరైన, బలమైన ఆధారాలేవీ లేవు. కేవలం ఆరోపణల ఆధారంగా ఆయన అమూల్యమైన బెయిల్‌ హక్కు­ను తిరస్కరించలేం. నిందితుడిపై ఆరోపణలు తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించినవన్న కారణంతో మాత్రమే బెయిల్‌ నిరాకరించడానికి వీల్లేదని సుప్రీం­కోర్టు స్పష్టంగా చెప్పింది. ఇందుకు సంబంధించి చట్టాలలో, బెయిల్‌ సంబంధిత న్యాయ సూత్రాలలో అలాంటి నిషేధం లేదు. 

మిథున్‌రెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణ ఏమిటంటే, ఈ కేసులో ఆయన మాస్టర్‌ మైండ్‌ అని, కీలక పాత్ర పోషించారని. ఇందుకు ప్రాసిక్యూషన్‌ సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలంపై ఆధార పడుతోంది. కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. సహ నిందితు­ల వాంగ్మూలాలు, కొందరు సాక్షులు ఇచ్చిన 161 స్టేట్‌మెంట్లు తప్ప ఇతర ఆధారాలను సమర్పించలేదు. కోర్టు ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. వాటికి ఎంత విలువ ఉందనే విషయం క్రా‹స్‌ ఎగ్జామినేషన్‌ తర్వాతే తెలుస్తుంది’ అని ఏసీబీ కోర్టు తన తీర్పులో పేర్కొంది. 

ఆరోపణలు నిరాధారం 
‘మిథున్‌రెడ్డి ఈ కేసులో మాస్టర్‌ మైండ్‌గా ఉంటూ, ఒక సిండికేట్‌ ద్వారా ముడుపులు వసూలు చేశారని సిట్‌ ఆరోపించింది. అలాగే, డీకార్ట్‌ లాజిస్టిక్స్‌ నుంచి రూ.5 కోట్లు అందుకున్నారని, అది మద్యం విక్రయాలకు సంబంధించిన మొత్తమని కూడా ఆరోపించింది. అయితే ఆ ఆరోపణలు నిరాధారమైనవి. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. మాస్టర్‌ మైండ్‌ అనడంతో పాటు 2019–24 మద్యం విధానం రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించారన్నది కూడా మిథున్‌రెడ్డిపై ఉన్న ఆరోపణ. 

అయితే, ఆయన మద్యం విధానం రూపకల్పన కమిటీలో సభ్యుడు కాదని, ఆయన పార్లమెంట్‌ సభ్యుడు మాత్రమేనని, రాష్ట్ర వ్యవహారాలు లేదా ఎక్సైజ్‌ పాలసీతో సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీ­సులు ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలేవీ మిథున్‌రెడ్డిపై ప్రాథమికంగా కేసు రుజువు చేసేందుకు సరిపోవు. ఏదేమైనప్పటికీ, నేరం తీవ్రతను మాత్రమే బెయిల్‌ తిరస్కరణకు ఏకైక కారణంగా పరిగణించబడకూడదు’ అని ఏసీబీ కోర్టు తేల్చి చెప్పింది.  

రాజకీయ కేసులు ఉండటం ఆశ్చర్యకరం కాదు  
‘మిథున్‌రెడ్డికి నేర చరిత్ర ఉందంటూ సిట్‌ తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఏడు కేసులను ప్రస్తావించారు. అయితే, వాటిలో ఐదు కేసులు ఇప్పటికే క్లోజ్‌ అయ్యాయి. మిగిలిన రెండు కేసులు కూడా రాజకీయ స్వభావం ఉన్నవి. మిథున్‌రెడ్డికి దీర్ఘకాల రాజకీయ ప్రస్థానం ఉంది. అలాంటప్పుడు రెండు రాజకీయ కేసులు పెండింగ్‌లో ఉండటం ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎల్లప్పుడూ ప్రత్యర్థులు ఉంటారు. అయితే, మిథున్‌రెడ్డి ఇప్పటి వరకు ఎటువంటి ఆర్థిక లేదా క్రూరమైన నేరాలకు పాల్పడలేదన్నది వాస్తవం. కాబట్టి, ఆయనను బెయిల్‌పై విడుదల చేయడం వల్ల సమాజానికి ఎలాంటి ముప్పు కలిగించదు’ అంటూ కోర్టు తీర్పు చెప్పింది. 
 
నేరపూరిత కుట్ర, డబ్బు మళ్లింపునకు ఆధారాలేవీ? 
‘ఇది బెయిల్‌ దశ మాత్రమే. కాబట్టి కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి లోతైన పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. కేసు పూర్వాపరాల ఆధారంగా ఈ దశలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినా కూడా అది విచారణ ఫలితాన్ని ముందే నిర్ణయించినట్లు అవుతుంది. నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను చూపలేకపోయారు. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు ఆధారాలేవీ చూపలేదు. సిట్‌ అధికారులు మిథున్‌రెడ్డి గూగుల్‌ టేకౌట్స్, సెల్‌ టవర్‌ లోకేషన్‌ డేటాను ఈ కోర్టు ముందుంచారు. అయితే, నెట్‌వర్క్‌ రద్దీ, భౌగోళిక అడ్డంకుల కారణంగా వాటిలో తేడాలున్నాయి. అందువల్ల అవి కచ్చితమైనవి గానీ, నిర్ణయాత్మకమైనవి గానీ కావు’ అని కోర్టు స్పష్టం చేసింది.   

ప్రాసిక్యూషన్‌ విఫలం 
‘డీకార్ట్‌ నుంచి పీఎల్‌ఆర్‌ కంపెనీకి వచ్చిన రూ.5 కోట్ల నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మిథున్‌రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఆయనకు ప్రమేయం ఉందని నమ్మేందుకు నగదు, బంగారం, విలాసవంతమైన కార్లు, ఆస్తులు వేటిని కూడా ఆయన నుంచి స్వాదీనం చేసుకోలేదు. ఈ విషయాలన్నింటినీ విచారణ సమయంలో పరిశీలించాల్సి ఉంటుంది. అందువల్ల కొంత మంది సాక్షులు ఇచ్చిన 161 స్టేట్‌మెంట్లు, సహ నిందితులు ఇచ్చిన 164 స్టేట్‌మెంట్లు బెయిల్‌ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు. ఆరోపణలు తీవ్రమైనవి అయినా కూడా, కేసును బట్టి బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. 

ప్రధానంగా నిందితుడికి ఆపాదించిన పాత్ర, ప్రాసిక్యూషన్‌ సేకరించిన ఆధారాలపై బెయిల్‌ మంజూరు ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుత కేసుతో పిటిషనర్‌కు సంబంధం ఉందని నిరూపించే ప్రాథమిక ఆధారాలను చూపడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైంది. ఈ కేసు ఆదాయపు పన్ను శాఖ లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)æ ఫిర్యాదు ఆధారంగా నమోదు కాలేదు. చిన్నారులపై వేధింపులు, పన్ను ఎగవేత, బ్యాంకు మోసం, కస్టమ్స్‌ ఉల్లంఘనలు వంటి ఆరోపణలేవీ పిటిషనర్‌పై లేవు. పిటిషనర్‌ మనీ లాండరింగ్, ఉపా, జాతీయ భద్రత కేసుల్లో అరెస్ట్‌ కాలేదు. కాబట్టి బలమైన ఆధారాలు లేకుండా ఆయన్ను నిరవధికంగా కస్టడీలో ఉంచడానికి వీల్లేదు’ అని ఏసీబీ కోర్టు తన తీర్పులో వివరించింది.  

ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల   
సాక్షి, రాజమహేంద్రవరం: మద్యం అక్రమ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్‌ ఇవ్వండంతో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రాజంపేట ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి సోమవారం సాయంత్రం విడుదలయ్యారు. విజయవాడ ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ పత్రాలు సెంట్రల్‌ జైలు అధికారులకు అందడంతో సాయంత్రం 5.55 గంటలకు ఆయన్ను విడుదల చేశారు. కాగా, బెయిల్‌పై విడుదలైన మిథున్‌రెడ్డికి వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బెయిల్‌ పత్రాలు సెంట్రల్‌ జైల్‌ అధికారులకు మధ్యాహ్నమే చేరినా, ఆలస్యంగా విడుదల చేయడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.  

బెయిల్‌పై విడుదలైన అనంతరం నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్న మిథున్‌రెడ్డి    

సాక్ష్యాలను తారుమారు చేసినట్లు ఆరోపణా లేదు 
‘మిథున్‌రెడ్డి బెయిల్‌పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేస్తారని ప్రాసిక్యూషన్‌ వాదిస్తోంది. వాస్తవానికి పిటిషనర్‌ మూడుసార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికై, ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. ఆయన తండ్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా ఉన్నారు. తద్వారా సమాజంలో వీరికి గట్టి సంబంధాలున్నాయి. ఈ కేసులో ముందు బెయిల్‌ నిరాకరించిన తర్వాత మిథున్‌రెడ్డి స్వచ్ఛందంగా దర్యాప్తు అధికారి ముందు లొంగిపోయారు. మధ్యంతర బెయిల్‌ మంజూరైనప్పుడు తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించారు. 72 రోజుల రిమాండ్‌ సమయంలో గానీ, మధ్యంతర బెయిల్‌ కాలంలో గానీ ఆయన సాక్ష్యాలను తారుమారు చేసినట్టు ఎలాంటి ఆరోపణా లేదు. 

ఈ కేసు ప్రధానంగా డాక్యుమెంటరీ ఆధారాలపైనే ఆధారపడి ఉంది. అవన్నీ ప్రాసిక్యూషన్‌ సురక్షిత కస్టడీలో ఉన్నాయి. అలాంటప్పుడు సాక్ష్యాలను తారుమారు చేస్తారని, విచారణలో ఆటంకం కలిగించే అవకాశం ఉందనే అనుమానాలతో బెయిల్‌ నిరాకరించడానికి వీల్లేదు. సాక్ష్యాలను తారుమారు చేసి ఉంటే అందుకు స్పష్టమైన ఆధారాలుంటాయి. సాక్ష్యాల తారుమారుపై అనుమానాలుంటే ఉంటే వాటిని కఠిన షరతుల ద్వారా నిరోధించవచ్చు. పిటిషనర్‌ సాక్షులను ప్రభావితం చేయడానికి, సాక్ష్యాలను తారుమారు చేయడానికి, విచారణకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తే.. ప్రాసిక్యూషన్‌ ఎప్పుడైనా కోర్టును ఆశ్రయించి బెయిల్‌ రద్దు కోరవచ్చు. 

ప్రజా ప్రయోజనం, నిందితుని వ్యక్తిగత స్వేచ్ఛ రెండింటినీ సమన్వయం చేయాలి. అందువల్ల పిటిషనర్‌కు కొన్ని షరతులతో బెయిల్‌ మంజూరు చేస్తున్నాం’ అని ఏసీబీ కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. రూ.2 లక్షలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని.. సోమ, శుక్రవారాల్లో దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని.. తదితర షరతులు విధించింది. కాగా, బెయిల్‌ పిటిషన్‌పై మిథున్‌రెడ్డి తరఫున తప్పెట నాగార్జునరెడ్డి, సిట్‌ తరఫున స్పెషల్‌ పీపీ వాదనలు వినిపించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement