త్రోబాల్‌ క్రీడాకారుడికి ఏపీ ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థిక సాయం

Minister RK Roja Presents 25 Lakh Govt aid to Throwball Player - Sakshi

సీఎం ఆదేశాల మేరకు చావలి సునీల్‌కు అందజేసిన మంత్రి రోజా

సాక్షి, గుంటూరు(తాడికొండ): భారత త్రోబాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ చావలి సునీల్‌కు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఈ చెక్కును మంత్రి ఆర్కే రోజా, ఎంపీ నందిగం సురేష్‌ శుక్రవారం సునీల్‌కు అందజేశారు. గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన చావలి రాజు కుమారుడు సునీల్‌ 2012 నుంచి అనేక ఏళ్ల పాటు భారత త్రోబాల్‌ జట్టుకు కెప్టెన్‌గా సేవలందించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సునీల్‌ ఆయన వద్దకు పలుమార్లు వెళ్లి ఆర్థిక సాయం కోసం విజ్ఞప్తి చేశారు. కానీ చంద్రబాబు పట్టించుకోకపోవడంతో దళితుడైన సునీల్‌ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూనే ఆటను కొనసాగించారు.

అనంతరం పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌ను కలిసిన సునీల్‌.. తన గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పక న్యాయం చేస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ ఇటీవల సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించి సునీల్‌కు ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆర్కే రోజా, ఎంపీ సురేష్‌ శుక్రవారం సునీల్‌కు రూ.25 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. సునీల్‌ కెప్టెన్‌గా ఎన్నో మ్యాచ్‌లలో భారత్‌ను విజయాల బాటలో నడిపించారని ప్రశంసించారు. తన ప్రతిభను గుర్తించి.. ఆర్థిక సాయం అందించినందుకు సీఎం జగన్, మంత్రి రోజా, ఎంపీ సురేష్‌కు సునీల్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.  

చదవండి: (కిడాంబి శ్రీకాంత్‌, షేక్‌ జాఫ్రిన్‌లను అభినందించిన సీఎం జగన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top