
పయ్యావుల రవికుమార్‌తో అనంతపురం జిజీహెచ్ లో ఎంఓయు చేసుకున్న ధ్రువపత్రం
పారదర్శకతకు పాతరేసి అడ్డగోలు దోపిడీ
స్థానిక మందుల కొనుగోళ్లలో పారదర్శక విధానం ప్రవేశపెట్టిన గత ప్రభుత్వం
ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ ఎంపిక
ఎంఆర్‌పీపై 35.6 శాతం రాయితీతో మందుల సరఫరా
చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే పక్కా ప్రణాళికతో కేంద్రీకృత శ్రీవిధానంపై దు్రష్పచారం
అనంతరం దోపిడీకి జన్ ఔషధి విధానం అమలు
సాక్షి, అమరావతి: అధికారం చేపట్టిన నాటినుంచి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. పారదర్శక విధానాలకు పాతరేసి, నిధులు దండుకోవడమే పరమావధిగా పథకాలు రూపొందిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ప్రభుత్వ బోధనాస్పత్రులకు జన్ ఔషధి మందుల సరఫరాను కూడా ఇప్పుడు చెరబట్టారు. గద్దెనెక్కిన వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఆదాయ మార్గాలపై ‘ముఖ్య’నేత, యువనేత, మంత్రులు కన్నేశారు. ఈ క్రమంలో బోధనాస్పత్రుల్లో పేదరోగులకు సరఫరా చేసే మందులు వారి కళ్లబడ్డాయి. అందులోనూ అవినీతికి స్కెచ్ వేశారు. సీఎం సొంత జిల్లాకు చెందిన జన్ ఔషధి మందుల సరఫరాదారులతో డీల్ కుదుర్చుకున్నారు. అనంతరం గత ప్రభుత్వం స్థానిక మందుల కొనుగోళ్ల కోసం ప్రవేశపెట్టిన కేంద్రీకృత విధానాన్ని ఎత్తేశారు. మందుల సరఫరా బాధ్యతను టెండర్లు లేకుండానే పయ్యావుల రవి, రాజశేఖర్‌కు కట్టబెట్టారు.
నాడు పూర్తి పారదర్శకంగా
బోధనాస్పత్రులకు మందుల కొనుగోలు కోసం కేటాయించే బడ్జెట్‌లో 80 శాతం నిధులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) సరఫరా చేసేందుకు కేటాయిస్తుంది. మిగిలిన 20 శాతం బడ్జెట్‌ను అత్యవసర మందుల కొనుగోళ్ల కోసం వినియోగిస్తారు. 2022 జూలైలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అత్యవసర మందుల సరఫరాకు కేంద్రీకృత విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా టెండర్లు ఆహ్వానించి ఎక్కువ రాయితీపై మందులు సరఫరా చేసే సంస్థను ఎంపిక చేసింది.
ఎంఆర్‌పీపై 35.6 శాతం రాయితీతో ఎల్–1గా నిలిచిన సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది. అత్యవసర మందులతోపాటు కొన్ని సందర్భాల్లో 80 శాతం బడ్జెట్‌లోని ఎసెన్షియల్ డ్రగ్స్‌లో అందుబాటులో లేని మందులనూ సరఫరా చేసేలా అనుమతి ఇచ్చింది. తద్వారా లోకల్ టెండరింగ్‌లో నడిచే అవినీతి, అక్రమాలతో పాటు ఆస్పత్రుల్లో మందుల కొరతను అరికట్టేలా చర్యలు తీసుకుంది. ఈ విధానంలో ఆస్పత్రుల్లో మందులకు ఇండెంట్ పెట్టిన దగ్గర నుంచి సరఫరా సంస్థకు బిల్లుల చెల్లింపు వరకు ప్రతి దశలో ఉన్నతస్థాయి పర్యవేక్షణతో పాటు జవాబుదారీతనం ఉండేది.
అవినీతికి మార్గం సుగమం
జన్ ఔషధి మందుల సరఫరాలో దోపిడీకి స్కెచ్ వేసిన కూటమి ప్రభుత్వ పెద్దలు కేంద్రీకృత కాంట్రాక్ట్ విధానంపై దు్రష్పచారం చేశారు. అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ అమాత్యుడి కార్యాలయం నుంచి లీకులు ఇచ్చి ఎల్లో మీడియాలో కథనాలు రాయించారు. అనంతరం స్థానిక కొనుగోళ్ల విధానం పునరుద్ధరిస్తూనే జన్ ఔషధి కొనుగోళ్ల విధానం ప్రవేశపెట్టి అవినీతికి మార్గం సుగమం చేసుకున్నారు. అధికారులకూ లంచాలు ముట్టడంతో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు పయ్యావుల సోదరులకు మేలు చేసేలా మార్గదర్శకాలు ఇచ్చారు. నాణ్యత లేని మందులు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు.