కలెక్టర్‌ను నెట్టేస్తున్న మేయర్ పీలా శ్రీనివాసరావు
విశాఖ ఉత్సవ్‌లో కలెక్టర్‌పై రెచ్చిపోయిన టీడీపీ మేయర్
హరేందిరప్రసాద్ చేతుల్ని నెట్టేసి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన పీలా శ్రీనివాసరావు
మంత్రుల సమక్షంలోనే వీరంగం
సాక్షి, విశాఖపట్నం: ‘నేను నగర ప్రథమ పౌరుడిని. నన్ను కూర్చున్నచోట నుంచి లేపి పక్కకెళ్లమంటావా.. ఏమనుకుంటున్నావ్.. అసలేం మాట్లాడుతున్నావ్.. ప్రొటోకాల్ గురించి తెలీదా.. నేను ఈ విషయాన్ని వదలను..’ అంటూ విశాఖ నగర టీడీపీ మేయర్ పీలా శ్రీనివాసరావు జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్ హరేందిరప్రసాద్‌తో రెచ్చిపోయి మాట్లాడారు. విశాఖ ఉత్సవ్ ప్రారంబోత్సవంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి మధ్య ప్రొటోకాల్ వివాదం తలెత్తినట్లు సమాచారం. విశాఖ ఉత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్.. మేయర్ శ్రీనివాసరావును కాస్త పక్కన కూర్చోగలరు.. అని అన్నట్లు తెలిసింది. అంతే.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ శివాలెత్తిపోయారు.
హోంమంత్రి అనిత సమక్షంలోనే వాదులాటకు దిగారు. అక్కడ నుంచి విసురుగా లేచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. కలెక్టర్ జోక్యం చేసుకుని.. తాను వేరే ఉద్దేశంతో అనలేదని, వచ్చి కూర్చోవాలని సర్ది చెప్పేందుకు యత్నించినా ఆయన శాంతించలేదు. తమాషాగా ఉందా అంటూ కలెక్టర్‌పై రెచ్చిపోయారు. మంత్రులు దుర్గేష్, వీరాంజనేయస్వామి, అనిత కలెక్టర్‌ని వారించసాగారే తప్ప మేయర్‌ని నిలువరించే ప్రయత్నం చేయలేదు. దీంతో పీలా శ్రీనివాసరావు మరింత రెచ్చిపోయి హడావుడి చేశారు. కూర్చోండి.. రండి.. అంటూ కలెక్టర్ మేయర్‌పై చేతులు వేసి బతిమిలాడారు.
మేయర్ ఒక్కసారిగా కలెక్టర్ చేతుల్ని బలంగా నెట్టేసి.. వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. వెళ్లిపోతానులెండి.. ఏం మాట్లాడుతున్నావయ్యా.. అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయారు. ఈ పరిణామంతో కలెక్టర్ నిశ్చేష్టుడయ్యారు. ముగ్గురు మంత్రులున్నా కనీసం ఈ వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నించకపోవడంతో మనస్తాపానికి గురైన కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లి కొద్దిసేపు కారులో కూర్చున్నారు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్‌తోనే మేయర్ ఈ విధంగా వ్యవహరించటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.


