
ప్రభుత్వాస్పత్రుల సెక్యూరిటీ సిబ్బంది వేతనాల్లో భారీగా కోత విధిస్తున్న కాంట్రాక్టర్లు
సెక్యూరిటీ గార్డుల వేతనాల్లో నెలకు రూ.1,860 కోత
టెండర్లకు ముందే కమీషన్ ఇచ్చేలా ప్రభుత్వ పెద్దలతో డీల్ కుదుర్చుకున్న సంస్థలు
నిబంధనలు అతిక్రమించినా వంద శాతం బిల్లులు మంజూరుకు పావులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దలు, వైద్య శాఖ బాధ్యతలు చూసే కీలక ప్రజాప్రతినిధి అండదండలతో ప్రభుత్వాస్పత్రుల సెక్యూరిటీ కాంట్రాక్టర్లు చిరుద్యోగుల పొట్టగొడుతున్నారు! కాంట్రాక్టు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన వేతనాల్లో భారీగా కోత విధిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టమైతే పనిచేయండి.. లేదంటే వెళ్లిపొమ్మంటున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సెకండరీ హెల్త్, డీఎంఈ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ నిర్వహణకు కూటమి సర్కారు కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది. ఈ సంస్థలు జూన్ నుంచి బాధ్యతలు చేపట్టాయి. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ కలిపి సెక్యూరిటీ గార్డులకు రూ.18,600, సూపర్వైజర్లకు రూ.21,506, సెక్యూరిటీ ఆఫీసర్‌కు రూ.40 వేలు చొప్పున వేతనాలు ఇవ్వాలని టెండర్ నిబంధనల్లో వైద్య శాఖ స్పష్టం చేసింది.
కటింగ్స్ పోనూ నికర వేతనంగా సెక్యూరిటీ గార్డులకు రూ.13,960, సూపర్ వైజర్‌కు రూ.16,141, సెక్యూరిటీ ఆఫీసర్‌కు రూ.30 వేల చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా గార్డులకు రూ.12,100, సూపర్వైజర్లకు రూ.13,900 మేర మాత్రమే వేతనాలు ఇస్తూ మిగిలింది ఎగ్గొడుతున్నారు.
జోన్–3 కాంట్రాక్టు సంస్థ ఈగల్ ఎంటర్‌ప్రైజర్స్ సెక్యూరిటీ గార్డులకు రూ.12,100 మాత్రమే వేతనం జమ చేసిందని ఏఐటీయూసీ ప్రతినిధులు కర్నూలులో ఆందోళన నిర్వహించారు. జోన్–1 ఉత్తరాంధ్ర, జోన్–2 కోస్తాంధ్రలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు కారి్మకుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. జూన్‌లో బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టర్లు ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించలేదని కారి్మకులు లబోదిబోమంటున్నారు.
నెలకు రూ.2,400 నష్టపోతున్న గార్డులు
రాష్ట్రంలోని మూడు జోన్‌లలో ఆస్పత్రులవారీగా ఎంత మంది సిబ్బందిని నియమించాలో టెండర్ మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. జోన్–1లో 2,066, జోన్–2లో 1,999, జోన్–3లో 2,107 మంది చొప్పున 6,172 మంది గార్డులు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బందిని నియమించాల్సి ఉంది. సిబ్బందిలో ఎవరికీ కాంట్రాక్టర్లు నిబంధనల మేరకు వేతనాలను చెల్లించడంలేదు. సెక్యూరిటీ గార్డులకు నెలకు రూ.1,860 మేర కోత పెడుతున్నారు.
దీనిమీద నాలుగు శాతం ఈఎస్‌ఐ రూ.74, ఈపీఎఫ్ 25 శాతం రూ.465 కలిపి నెలకు ఒక్కో గార్డు రూ.2,400 కోల్పోతున్నట్టు తెలుస్తోంది. మూడు జోన్‌లలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, సూపర్‌వైజర్‌లు, సెక్యూరిటీ ఆఫీసర్‌లు కలిపి మొత్తం 6,172 మంది ఉండగా సగటున రూ.2,500 చొప్పున లెక్కేసినా నెలకు రూ.1.54 కోట్ల మేర కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. కాంట్రాక్ట్ ముగిసే నాటికి మూడేళ్లలో రూ.55.54 కోట్లకు పైనే కారి్మకులు నష్టపోతున్నట్లు స్పష్టమవుతోంది.
ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు లేకుండా..
కాంట్రాక్ట్ సంస్థలు అగ్రిమెంట్ రోజే అందరు సిబ్బంది వివరాలను అందించి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరుకు మ్యాపింగ్ చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. సిబ్బంది హాజరు నెలలో 95 శాతం ఆపైన ఉంటేనే కాంట్రాక్టర్‌కు వంద శాతం బిల్లులు ఇవ్వాలి. హాజరు తగ్గితే ఆమేరకు బిల్లుల్లోనూ కోత విధించాలి. దీని ప్రకారం కాంట్రాక్టర్ పనులు ప్రారంభించిన మొదటి రోజునే ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు వేయాలి. అయితే కాంట్రాక్ట్ సంస్థలు ఇప్పటి వరకూ ఆస్పత్రుల్లో నిర్దేశించిన మేరకు సిబ్బందిని నియమించలేదు. ఉన్న కొంత మందికి ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు వేయడం లేదని తెలుస్తోంది. దీంతో పాటు వేతనాల్లోనూ భారీగా కోత పెడుతున్నారు.
చక్రం తిప్పుతున్న కీలక నేత..
చిరుద్యోగుల పొట్టగొట్టడంతో పాటు నిబంధనలను అతిక్రమించిన కాంట్రాక్టర్లకు వంద శాతం బిల్లులు చెల్లించేలా వైద్య శాఖకు చెందిన కీలక నేత పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. సదరు నేత తరపున ఓ వ్యక్తి హైదరాబాద్‌లో తిష్ట వేసి అవినీతి కార్యకలాపాలు చక్కబెడుతున్నారు. అతడిని కలిసి బిల్లులపై ఏడు శాతం కమీషన్ ఇచ్చేలా అడ్డదారుల్లో కాంట్రాక్టులు కట్టబెట్టారు. జోన్–1 కాంట్రాక్టు సంస్థ కార్తికేయ టెండర్ మార్గదర్శకాలకు విరుద్ధంగా బిడ్ వేసినా ఆమోదించి అందలం ఎక్కించారు. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో కేసులు సైతం దాఖలయ్యాయి.