
మహిళ హత్య కేసులో
పోలీసుల అదుపులో నిందితుడు?
విశాఖపట్నం: భీమిలి కృష్ణా కాలనీకి చెందిన బంగారు కవిత మృతి కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. భీమిలి బీచ్‌రోడ్డు సమీపంలోని జీడి తోటలో బంగారు కవిత మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. ఆమె ప్రియుడే కవితను కిరాతకంగా హత్య చేసి.. నెల రోజులుగా ఏమీ ఎరుగనట్టు నాటకమాడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. క్రైమ్ సినిమా కథను తలపించేలా సాగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలివి..
కృష్ణా కాలనీకి చెందిన బంగారు కవితకు, భీమిలికి చెందిన పారిశుధ్య కార్మికుడు బొడ్డు రాజుతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత కొంతకాలంగా వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి, తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కవితను అడ్డు తొలగించుకోవాలని రాజు నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మాట్లాడదామనే నెపంతో గత నెలలో ఆమెను బీచ్‌రోడ్డు సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల వద్దకు పిలిపించాడు.
అక్కడికి వచ్చిన ఆమెపై రాయితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పక్కనే ఉన్న జీడి తోటలోకి తీసుకెళ్లి, ఒక చెట్టు కొమ్మకు వేలాడదీసి వచ్చేశాడు. ఆ తర్వాత రాజు ఏమీ తెలియనట్టు అందరితో కలిసి తిరుగుతూ, పోలీసులను సైతం తప్పుదోవ పట్టించాడు. కవిత కనబడటం లేదని ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానంతో రాజును పలుమార్లు విచారించారు.
అయినప్పటికీ తనకు ఏమీ తెలియదని నమ్మబలుకుతూ దర్యాప్తును పక్కదారి పట్టించాడు. అయితే కవిత మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. పక్కా ఆధారాలతో బొడ్డు రాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అతడు చేసిన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఒక వైపు దారుణ హత్యకు పాల్పడి, మరో వైపు నెలరోజుల పాటు అందరినీ నమ్మించిన రాజు తీరుపై పోలీసులు, స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.