ఫార్మసీ విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పోరాడతాం | Margani Bharat Ram reacts on pharmacy student incident | Sakshi
Sakshi News home page

ఫార్మసీ విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పోరాడతాం

Mar 30 2025 2:43 AM | Updated on Mar 30 2025 2:43 AM

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనను తప్పుదారి పట్టించే యత్నం 

మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌

రాజమహేంద్రవరం సిటీ: ఫార్మసీ విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, ఆమె కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్‌ స్పష్టం చేశారు. శనివారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజమహేంద్రవరంలోని కిమ్స్‌ బొల్లినేని ఆస్పత్రిలో ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ ఘటనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచి్చనట్టు కనిపిస్తోందన్నారు. 

ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ముందు ఫార్మసీ విద్యార్థిని తన పూర్తి వివరాలు సూసైడ్‌ నోట్‌లో వెల్లడించిందని, నిందితుడిగా పేర్కొంటున్న కిమ్స్‌ ఏజీఎం దీపక్‌ ట్రాక్‌ రికార్డు కూడా చెడుగానే ఉందన్నారు. పోలీ­సులు చెప్పిన దానికి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తేదీకి మధ్య తేడాలుండటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. తాను మళ్లీ పుట్టాలనుకోవడం లేదంటూ బాధితురాలు సూసైడ్‌ నోట్‌లో రాసిందంటే, ఆమె మానసికంగా ఎంతగా నలిగిపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు.

సూసైడ్‌ నోట్‌ను తారుమారు చేసేందుకు దీపక్‌ ప్రయత్నించాడని ఆరోపించారు. సూసైడ్‌ నోట్‌ దొరికిన తర్వాతే దీపక్‌ పరారయ్యాడని, ఆస్పత్రిలో సీసీ ఫుటేజీ పూర్తిగా బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. కిమ్స్‌ ఏజీఎం దీపక్‌ టీడీపీకి చెందిన వ్యక్తి అని, అతడి మామ నగరంలో ఆ పార్టీలో క్రియాశీలక నాయకుడని, అధికార పార్టీకి చెందిన వారు కనుక ఈ అంశాన్ని తారుమారు చేసే ప్రయత్నం జరుగుతోందని భరత్‌రామ్‌ పేర్కొన్నారు. పోలీసుల విచారణలో దీపక్‌ ఏం చెప్పాడో బాధితురాలి తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. 

ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే కూడా అనేక అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. బాధిత విద్యార్థిని తండ్రి మాట్లాడు­తూ..­తన కుమార్తెను వికాస్‌ ఫార్మసీ కాలేజీలో చదివిస్తున్నామని, ఈ నెల 23న తమ బిడ్డ పడిపోయిందని ఫోన్‌ చేశారని చెప్పారు. 2 రోజుల తర్వాత కానీ ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలియలేదన్నారు. తమకు న్యాయం జరగాలని కన్నీటిపర్యంతమై వేడుకున్నారు. 

పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పగడాల మృతి వెనుక కారణాలేమిటో బయటకు రావా­లన్నారు. ఈ కేసు విషయమై మంత్రి లోకేశ్‌ బాధ్యతారహితంగా ట్వీట్‌ చేయటం దారుణమని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో భూకబ్జాలు, ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యయత్నం తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతికి భరత్‌రామ్‌ వినతిపత్రమిచ్చారు.

ఆమె పాలిట అభినవ కీచకుడు
» ఫార్మసీ విద్యార్థినిని కిరాతకంగా వేధించిన కిమ్స్‌ ఏజీఎం దీపక్‌! 
» ఓ లెక్చరర్, కొందరు డ్యూటీ డాక్టర్ల నుంచి స్టాఫ్‌ నర్సులూ అతడి బాధితులే 
» టీడీపీతో అనుబంధం ఉండటంతో అతడు ఆడింది ఆట.. పాడిందే పాట 
» ఒక్కొక్కటిగా వెలుగులోకి దీపక్‌  లైంగిక వేధింపులు 
సాక్షి, టాస్క్ ఫోర్స్: రాజమహేంద్రవరంలో కిమ్స్‌ బొల్లినేని ఏజీఎం దీపక్‌ వేధింపులు తాళలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘట­న రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రోజులు గడుస్తున్నకొద్దీ దీపక్‌ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలు­గులోకి వస్తున్నాయి. యువతులను లైంగిక వేధింపులకు గురి చేయడం అతడికి సర్వసాధారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీతో అనుబంధం ఉండటం, దీపక్‌ మామ టీడీపీ నేత కావడంతో అతడు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగి­పో­తోందని చెబుతున్నారు. 

ప్రేమ పేరిట వలపు వల విసురుతూ లైంగిక వాంఛలు తీర్చుకున్న అనం­తరం యువతులను వదిలించుకునేందుకు వేధింపులకు గురి చేయడం అతడికి పరిపాటేనని బలంగా వినిపిస్తోంది. దీపక్‌ రాజమహేంద్రవరంలోని హోమియో కళాశాలలో చదివాడు. ఆ సమయంలో లెక్చరర్‌ను వేధించినట్టు తెలిసింది. దీంతో అతడిని కళాశాల నుంచి డీబార్‌ చేసినట్టు తెలుస్తోంది. కాగా.. 2019లో అతడు కిమ్స్‌ ఆస్పత్రిలో చేరాడు.

ఆ తరువాత ఆస్పత్రిలో వివిధ హోదాల్లో పనిచేసే ముగ్గురు సిబ్బందిని వేధించినట్టు తెలిసింది. వీళ్లే కాకుండా అతడి వేధింపులు తట్టుకోలేక డ్యూటీ డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు.. ఇలా వివిధ హోదాల్లో పనిచేసే సిబ్బంది పదుల సంఖ్యలో ఆస్పత్రి వదిలి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఇతడి వేధింపులపై ఫిర్యాదు చేస్తే తమ పరువు­పోతుందనే ఉద్దేశంతో ఎవరూ ముందుకు రాలే­దు. గతంలో ఇద్దరు సిబ్బందిని బ్లాక్‌మెయిల్‌ చేసి­న వ్యవహారంలో ఆస్పత్రి యాజమాన్యం మందలించినా అత­డి వ్యవహార శైలిలో మార్పులేదు. 

టీడీపీతో అనుబంధం ఉండటంతో.. 
ప్రేమ పేరిట మాయమాటలు చెబుతూ.. లైంగిక వాంఛలు తీరాక సదరు యువతులు, మహిళలను వదిలించుకోవడం అతడి నైజమని, ఈ విషయంలో అతడు ఎంతకైనా తెగిస్తాడని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విద్యార్థినిపై సైతం వేధింపులకు ఒడిగట్టడంతో వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఆమె మెదడు దెబ్బతినే ఇంజెక్షన్‌ చేసుకున్నట్టు తెలిసింది. అతగాడి వేధింపులకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వెలుగు చూశా­యి. 

ఏజీఎం దీపక్‌ తనను కొట్టి, గాయపరిచిన ఫొటోలను బాధిత విద్యార్థిని ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్‌లో తీసుకుని భద్రపరుచుకున్నట్టు సమాచారం. తన శరీరంపై గాయాలైన భాగాలను ఆమె ఫొ­టోలు తీసింది. వాటిని పరిశీలిస్తే అతగాడి క్రూర­త్వం ఎలాంటిదో తెలుస్తోంది. అతని కర్కశత్వాన్ని చూసి ఆస్పత్రి సిబ్బంది సైతం అవాక్కవుతున్నా­రు.  ఘటన జరిగిన రోజు సీసీ ఫుటేజీని ఎందుకు బహిర్గతం చేయడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నా­యి. కేసును నీరుగార్చేందుకు ఆధారాలు లభించకుండా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఫార్మసీ విద్యార్థిని హెల్త్‌ బులెటిన్‌ విడుదల
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆత్మహ­త్యా­యత్నం చేసుకున్న ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య స్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన అన్నిర­కాల వైద్య సేవలు కిమ్స్‌–బొల్లినేని ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని అధికారుల కమిటీ తెలిపింది. విద్యార్థిని హెల్త్‌ బులెటిన్‌ను ఈ కమిటీ శనివారం రాజమహేంద్రవరంలో విడుదల చేసింది. 

ఆమె తక్షణ చికిత్సకు న్యూరాలజీ, జనరల్‌ మెడిసిన్, అనస్థీషియా విభాగాల వైద్యులు నిరంతర పరిశీలన కొనసాగిస్తున్నారని తెలిపింది. ఆమెకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని పేర్కొంది. డీఎంహెచ్‌వో, జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయాధికారి, ఎన్టీఆర్‌ వైద్యసేవ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఈ బులెటిన్‌ విడుదల చేశారు. 

విషమంగానే బాధితురాలి ఆరోగ్యం
కాగా.. అంతకుముందు కిమ్స్‌ బొల్లినేని ఆస్పత్రి వ­ర్గాలు విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్యం విషమంగా ఉందని పేర్కొ­న్నాయి. ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ విద్యాదీపక్, డాక్టర్‌ శశాంక్‌ మాట్లాడుతూ.. బాధిత విద్యార్థినికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. బీపీ ఇంకా తగ్గిపోవడంతో చికిత్సలో మరో రెండు ఇంజెక్షన్లు చేర్చామని తెలిపారు. గుండె, లివర్, కిడ్నీ పనితీరు బాగున్నాయని చెప్పారు. 

బాధితురాలు తీసుకున్న ఇంజెక్షన్‌ ప్రభావంతో ఆమె బ్రెయిన్‌ కోమాలోకి వెళ్లిందన్నారు. సీటీ స్కాన్‌ చేశామని, అందులో బ్రెయిన్‌ వాపు ఇంకా పెరుగుతోందని చెప్పారు. దీనిని నియంత్రించేందుకు చికిత్స అందిస్తున్నామన్నారు. బ్రెయిన్‌ ఎక్కువగా పాడ­యిపోవడంతో ఆమెలో ఎటువంటి మార్పూ రాలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement