చికెన్‌ వ్యర్థాలతో కాసులు | Making Huge Money From Chicken Waste in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

చికెన్‌ వ్యర్థాలతో కాసులు

Oct 1 2025 5:35 AM | Updated on Oct 1 2025 5:35 AM

Making Huge Money From Chicken Waste in Andhra Pradesh

చేపల గుంతల్లో చికెన్‌ వ్యర్థాలను వేస్తూ..

చేపల గుంతల్లో విచ్చలవిడిగా వినియోగం 

శ్రీపోట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో యథేచ్ఛగా.. 

అడపాదడపా పట్టుబడుతున్న వాహనాలు 

కట్టడి చేయలేకపోతున్న అధికార యంత్రాంగం 

మాఫియా ఆడిందే ఆట

ప్రమాదంలో ప్రజారోగ్యం

ప్రజారోగ్యం ఏమైతేనేం.. తమ జేబులు నిండితే చాలన్నట్లుగా మారింది టీడీపీ నేతలు, పోలీసులు, మత్స్యశాఖ అధికారుల వైఖరి. చేపల గుంతల్లో చికెన్‌ వ్యర్థాలను డంప్‌ చేస్తూ.. భారీగా కాసులు గడిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని కోవూరు, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో ఈ తంతు అడ్డూ అదుపులేకుండా సాగుతోంది. వీటిని తరలించే వాహనాలు అడపాదడపా పట్టుబడుతున్నా, కంటపడకుండా తరలుతోంది భారీగానే ఉంటుందని అంచనా. ఇంత జరుగుతున్నా, అధికారులు పట్టించుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో చికెన్‌ మాఫియా ఆగడాలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. సమీప రాష్ట్రాల నుంచి చికెన్‌ వ్యర్థాలను జిల్లాకు యథేచ్ఛగా తీసుకొచ్చి.. చేపల చెరువుల్లో డంప్‌ చేస్తున్నారు. జిల్లాలోని ఆత్మకూరు, సంగం, కోవూరు, ఇందుకూరుపేట, విడవలూరు, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగం మండలల్లో దాదాపు రెండు వేల ఎకరాల్లో చేపలను పెంచుతున్నారు.  

తక్కువ ధరకే వస్తుండటంతో.. 
సాధారణంగా చేపలు కిలోపైగా పెరిగేందుకు దాదాపు ఆర్నెల్ల నుంచి ఎనిమిది నెలలు పడుతుంది. రైతుల నుంచి కిలోను రూ.80 నుంచి రూ.90కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి. అదే మేతగా బ్రాండెడ్‌ ఫీడ్‌కు ప్రత్యామ్నాయంగా అతి తక్కువ ఖర్చుతో కూడిన కోళ్ల వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్నారు. వీటితో నాలుగు నెలలకే కిలో.. అంతకుమించి బరువు పెరుగుతున్నాయి. దీంతో జిల్లాలో దాదాపు 80 శాతం మంది చేపల రైతులు వీటినే వినియోగిస్తున్నారు. ఫలితంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి చికెన్‌ వ్యర్థాలను జిల్లాకు తీసుకొచ్చి విక్రయించే మాఫియా తయారైంది. అక్కడ కిలోను ఐదారు రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడ రూ.15కు విక్రయిస్తున్నారు.    

టీడీపీ నేతల కనుసన్నల్లో.. 
కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, ముత్తుకూరు, పొదలకూరు, తోటపల్లిగూడూరు, సంగం ప్రాంతాలకు చెందిన కొందరు టీడీపీ నేతలు, పోలీస్‌ అధికారుల కనుసన్నల్లో మాఫియా బరితెగిస్తోంది. పదుల సంఖ్యలో వర్కర్లు వీరికి అండగా ఉన్నారు. ముందుగా బెంగళూరు, చెన్నై, కేరళ ప్రాంతాల్లో చికెన్‌ వ్యర్థాల సేకరణ కోసం డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేసుకున్నారు. దీని కోసమే రూ.కోట్లను వెచ్చించారు. అక్కడే కొందర్ని చేరదీసి వారి ద్వారా నిత్యం సేకరిస్తున్నారు. ఆపై రాత్రివేళ లోడ్‌ చేసి నెల్లూరుకు చేరుస్తున్నారు.  

నెలకు రూ.లక్షల్లో మామూళ్లు 
ఈ వాహనాలు టో-ల్‌గేట్లు దాటి జిల్లాలోకి ప్రవేశిస్తున్న సమయంలో కట్టడి చేసే అవకాశం ఉంది. అయినా పోలీసులు, మత్స్యశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక్కో వాహనానికి రూ.పది వేల చొప్పున పోలీస్‌ శాఖకు నెలవారీ మామూళ్లను ముట్టజెప్తున్నారని తెలుస్తోంది. ఈ రకంగా నెలకు వంద వాహనాలు తిరిగితే స్టేషన్‌కు రూ.పది లక్షల మేర అందుతోందని సమాచారం. సర్కిల్, డీఎస్పీ స్థాయి అధికారులకు సైతం ఇదే పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వీటిని ఆపేందుకు ఎవరూ ఉత్సాహం చూపడంలేదు. మత్స్యశాఖ అధికారులకు సైతం నెలకు రూ.లక్షల్లో అందుతోందని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాలు జరిగితేనో.. వాహనం పాడైన సందర్భాల్లోనో ఈ ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. 

రూ.కోట్లల్లో ఆదాయం 
కిలోకు రూ.పది మేర వెచ్చించి.. చేపల చెరువు యజమానులకు రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. ఈ రకంగా చూస్తే జిల్లాలో నెలకు రూ.పది కోట్ల వ్యాపారం జరుగుతోందని సమాచారం. మాఫియాకు భారీగా ఆదాయం వస్తుండటంతో దీనిపై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు మాఫియా భారీగా సమర్పి స్తోందనే టాక్‌ ఉంది. 

ఆరోగ్యానికి చేటే.. 
చికెన్‌ వ్యర్థాలను ఆహారంగా తీసుకునే చేపలను భుజిస్తే ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 80 శాతం మంది మాంసాహార ప్రియులు చెరువుల్లో పెంచే చేపలనే తింటున్నారు. ఈ – కోలి బ్యాక్టీరియా చేరి కేన్సర్, జీర్ణకోశ వ్యాధులొచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

అంతా ఆర్భాటమే..
చికెన్‌ వ్యర్థాల విషయమై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్‌ శాఖకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలిచ్చారు. నాలుగు నెలల్లో కట్టడి చేయాలని పేర్కొన్నా, అవేవీ అమలుకు నోచుకోవడంలేదు. ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం, ఆత్మకూరు రూరల్‌ ప్రాంతాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు.. మాఫియాలో చేరారు. కొందరు పోలీస్‌ అధికారులు సహకారం అందిస్తుండటంతో వ్యాపారం సజావుగా సాగుతోంది. అడపాదడపా వాహనాలను పట్టుకున్నట్లు చూపుతున్నారు. ఆత్మకూరు మండంలోని వాసిలిలో చికెన్‌ వ్యర్థాల డంపింగ్‌ కేంద్రాన్ని జనసేన నేతలు చూపి పోలీసులకు పట్టించారు. ఇంత జరుగుతున్నా, పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement