టీడీపీలో సకుటుంబ పాలన
రాష్ట్ర స్థాయిలో బాబు, లోకేశ్, భరత్, బాలకృష్ణ
జిల్లాల్లో స్థానిక నేతల కుటుంబాలదే హవా
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రి.. ఆయన కుమారుడు లోకేశ్ మంత్రి.. బావమరిది నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే.. ఆయన అల్లుడు, నారా లోకేశ్ తోడల్లుడు భరత్ ఎంపీ.. ఇవీ చంద్రబాబు కుటుంబం అనుభవిస్తున్న రాజకీయ పదవులు. మేమేం తక్కువ తిన్నామా అన్నట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా సకుటుంబంగా స్థానిక ఎన్నికల పోటీలోకి దిగిపోయారు.
అధినేత ఇంట్లోనే పదవులన్నీ ఉన్నప్పుడు తాము కూడా కుటుంబ సభ్యులకు పంచుకుంటే తప్పేంటన్న ధోరణిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక ఎన్నికల్లో తమ వారసులు, కుటుంబసభ్యులను రంగంలోకి దించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని భవిష్యత్ రాజకీయాలకు మెట్టుగా భావిస్తున్న నేతలు కొడుకులు, కుమార్తెలు, కోడళ్లు, భార్యలను జెడ్పీటీసీలుగా బరిలో నిలిపారు. ఏళ్ల తరబడి జెండా మోసిన కార్యకర్తలకు మాత్రం మొండిచేయే మిగిలింది. దీంతో పోటీ చేసేందుకు మాకు అర్హత లేదా? కేవలం జెండాలు మోయడమేనా మా పని అంటూ టీడీపీ కేడర్ రగిలిపోతోంది. వెన్నుపోటు పార్టీ కుటుంబ పార్టీగా కూడా మారిందని మండిపడుతున్నారు.
మంత్రి మండిపల్లి ఇంట్లో పదవుల పందేరం
అన్నమయ్య జిల్లాకు చెందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కుటుంబం ఇందుకు పరాకాష్ట. మంత్రి సోదరుడు లక్ష్మీప్రసాద్‌రెడ్డి టీడీపీ తరపున చిన్నమండెం మండలం నుంచి జెడ్పీటీసీ బరిలో దిగారు. ఆయన జెడ్పీ పీఠాన్ని ఆశిస్తున్నారు. చిన్నమండెం మండలం పడమటికోన, మల్లూరు ఎంపీటీసీ స్థానాలకు మంత్రి తల్లి సుశీలమ్మ, సతీమణి హరితమ్మ నామినేషన్లు వేశారు. ఎంపీపీ పీఠం కోసమే ఈ తాపత్రయం. ఇలా జిల్లా మొత్తాన్ని చేతిలో పెట్టుకోవాలన్నది వ్యూహం.
స్పీకర్ ఇంట్లో మూడు పదవులు
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్‌కు ఇటీవలే రాజ్యసభ సభ్యుడి పదవి దక్కింది. ఇప్పుడు నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా అయ్యన్న సతీమణి పద్మావతిని టీడీపీ బరిలోకి దించింది. ఒకే ఇంట్లో స్పీకర్, రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి.
జెడ్పీ కోసం పరిటాల కుటుంబం
సత్యసాయి జిల్లా జెడ్పీ పీఠం జనరల్‌కు కేటాయించడంతో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తన కుమారుడు శ్రీరామ్‌ను చైర్మన్ బరిలోకి దింపారు. రాప్తాడు జెడ్పీటీసీ ఎస్సీకి రిజర్వ్ కావడంతో కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు మండలం నుంచి శ్రీరామ్‌తో నామినేషన్ వేయించారు. అక్కడ ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న స్థానిక నేతలను కాదని బయటి నుంచి వచ్చిన వారసుడికి సీటివ్వడంపై కదిరి టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. తిరుపతి జెడ్పీ పీఠం బరిలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి చిన్న కుమార్తె డాక్టర్ చేతన బరిలోకి దిగారు. అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే హేమలత నాగలాపురం, సత్యవేడు రెండు మండలాల నుంచి నామినేషన్లు వేశారు.
బీసీ పీఠం రేసులోనూ నేతల కుటుంబాలే...
కర్నూలు జెడ్పీ పీఠం బీసీకి రిజర్వ్ అయింది. జిల్లాలో బీసీ వర్గాల్లో దశాబ్దాలుగా పని చేస్తున్న నేతలు ఎంతో మంది ఉన్నా, ఈ పీఠం కోసం టీడీపీ నుంచి మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కుమారుడు రుద్రఫణి గౌడ్, కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు కుమార్తె బొజ్జమ్మ పోటీ పడుతున్నారు. డోన్ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి తన సతీమణి కోట్ల సుజాతమ్మను బరిలోకి దించారు. ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తన మేనకోడలు నాగమణిని బరిలోకి దించారు.
ఏలూరులో ఎమ్మెల్యే కుమార్తె వర్సెస్ మాజీ ఎంపీ భార్య
ఏలూరు జెడ్పీ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన కుమార్తె సాయి నవ్యశ్రీని పెదవేగి జెడ్పీటీసీగా బరిలోకి దించారు. మాజీ ఎంపీ మాగంటి బాబు సతీమణి పద్మవల్లీదేవి చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట నుంచి జెడ్పీటీసీగా నామినేషన్ దాఖలు చేశారు.
కళా కుటుంబానికే...
విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ పదవిని టీడీపీలో ఎంతో మంది సీనియర్ బీసీ మహిళా నేతలు ఆశించారు. కానీ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తన కోడలు కిమిడి సంధ్యతో గరివిడి జెడ్పీటీసీకి నామినేషన్ వేయించారు. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన తమను కాదని ఇంటి మనిషికే జెడ్పీ పీఠం కట్టబెట్టే ప్రయత్నంపై జిల్లాలో సీనియర్ నేతలు, కార్యకర్తలు కళాపై గుర్రుగా ఉన్నారు.
సందట్లో సడేమియాలా ఇటీవలే పార్టీలో చేరిన మాజీ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తన కుమార్తె సిరిసహస్రతో తెర్లాం, కొత్తవలస రెండు మండలాల నుంచి నామినేషన్లు వేయించారు. పార్టీలో చేరి నెలలు కాకముందే వలస నేత కుమార్తెకు రెండు స్థానాలా అని పాత కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వీరితో పాటు మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు కుమార్తె చంద్రకళ భోగాపురం నుంచి జెడ్పీటీసీగా బరిలో దిగారు. ఒక్క బీసీ మహిళా పీఠం కోసం ముగ్గురు నేతల కుటుంబాలు పోటీ పడుతుంటే, పార్టీ కోసం పనిచేసిన బీసీ మహిళా కార్యకర్తలకు ఎప్పటికి న్యాయం జరుగుతుందని శ్రేణులు నిలదీస్తున్నాయి.
మేయర్ పీఠమూ ఇంటికే...
గుంటూరు మేయర్ అభ్యర్థిగా మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) సతీమణి కోవెలమూడి లక్ష్మీ అపర్ణను టీడీపీ బరిలోకి దించింది.
సోషల్ ఇంజినీరింగ్ మాటలకే పరిమితం
స్థానిక ఎన్నికల్లో సోషల్ రీ ఇంజినీరింగ్‌కు పెద్దపీట వేస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు నీటిమూటలేనని ఈ పదవుల పందేరంతో స్పష్టమైంది. చంద్రబాబు ఇంట్లోనే కుటుంబ పాలన నడుస్తున్నప్పుడు కింది నేతలకు నీతులు చెప్పే నైతిక హక్కు ఎక్కడిదని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి పదవి రాలేదని కొందరు, మంత్రి పదవి ఉన్నా జిల్లాపై పట్టు వదులుకోవద్దని మరికొందరు వారసులను బరిలోకి దించుతున్నారు. జెడ్పీ పీఠం ఇవ్వకపోతే భవిష్యత్ మంత్రివర్గ విస్తరణలోనైనా అవకాశం ఇవ్వాలంటూ ఒత్తిడి పెంచేందుకే కుటుంబ సభ్యులను పోటీకి దించారని పార్టీలో చర్చ సాగుతోంది. జిల్లాలు పెరిగి కొత్త పదవులు వస్తాయని ఆశపడితే, ఆ పదవులకూ నేతల వారసులే గండి కొడుతున్నారని కార్యకర్తలు వాపోతున్నారు.


