స్పెషల్‌ టెట్‌ ఫలితాలపై సందిగ్ధం | Uncertainty surrounds the special TET results | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ టెట్‌ ఫలితాలపై సందిగ్ధం

Oct 26 2026 4:56 AM | Updated on Oct 26 2026 4:56 AM

Uncertainty surrounds the special TET results

80 వేల మందికి పైగా ఉపాధ్యాయుల్లో ఆందోళన 

సాక్షి, అమరావతి: ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు నిర్వహించిన స్పెషల్‌ టెట్‌ ఫలితాల ప్రకటనపై ప్రతిష్టంభన నెలకొంది. అసలు ఫలితాలు ప్రకటిస్తారా.. లేదా అన్న సందిగ్ధం నెలకొంది. పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 24న అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లు విడుదల చేయాలి. కానీ, ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో పరీక్ష రాసిన ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు రెండు సెషన్స్‌లో మొత్తం 74 సెంటర్లలో పరీక్షలు నిర్వహించగా.. దరఖాస్తు చేసుకున్న 83,015 మంది ఉపాధ్యాయుల్లో 80,907 (97.46%) మంది పరీక్ష రాశారు.  ఈనెల 24న రెస్పాన్స్‌ షీట్లు, ప్రాథమిక కీ విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  

యధాతథంగా వెబ్‌సైట్‌ ప్రశ్నావళి 
జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)–2020 నిబంధనల ప్రకారం దేశంలోని అన్ని మేనేజ్‌మెంట్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్‌ అర్హత పొందాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2028 ఆగస్టు చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తికావాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ టెట్‌–ఆగస్టు 2026 (స్పెషల్‌ టెట్‌) నోటిఫికేషన్‌ ఇచ్చి ఈనెల 11 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహించింది. 

ఈ పరీక్ష కోసం విద్యాశాఖ అధికారులు ఒక్కో పేపర్‌కు 700 చొప్పున ప్రశ్నలు ముందుగానే వెబ్‌సైట్‌లో పెట్టారు. పరీక్షలో అన్ని ప్రశ్నలు, జవాబులు (ఏబీసీడీ) కూడా అదే వరుసలో వచ్చే విధంగా ఇచ్చారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో గుప్పు­మంది. మరోపక్క టెట్‌ రద్దు కోరుతూ కొందరు టీచర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మరోపక్క ప్రభుత్వం కూడా టెట్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. రెండు భిన్న వైఖరుల నేపథ్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. 

ఫలితాలు ఎలా ఇస్తారు?
పరీక్ష నిర్వహణ నిబంధనల ప్రకారం.. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్, ప్రాథమిక ‘కీ’ విడుదల చేయాలి. తద్వారా అభ్యర్థి తాను రాసిన సమాధానాలను సరిచూసుకుని, తప్పు­లుంటే అభ్యంతరాలు తెలిపే వెసులుబాటు కలుగుతుంది. వాస్తవానికి పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్‌ కంటే ఆరు రోజులు ముందే టెట్‌ పరీక్షలు పూర్తయ్యాయి. 

ఆ మేరకు షెడ్యూల్‌ మార్చి ఈనెల 19 నాటికి రెస్పాన్స్‌ షీట్లు, ప్రాథమిక కీ విడుదల చేయాలి. అనంతరం అభ్యంతరాలు స్వీకరించి ఈ నెలాఖరు నాటికి ఫలితాలు ప్రకటించాలి. అయితే, జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయినా అధికారులు పక్కనపెట్టినట్టు తెలిసింది. మరోపక్క ఫలితాలు ప్రకటిస్తే కేవలం ‘క్వాలిఫై/నాట్‌ క్వాలిఫై’ మాత్రమే ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే జరిగితే పరీక్ష రాసిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవడం ఖాయం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement