నగరి మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారులపై మాజీమంత్రి రోజా ఫిర్యాదు
చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి పోటీలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాలకృష్ణ వేసిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా.. ఆ పదవికి టీడీపీ అభ్యర్థి శ్రీనివాసన్ ఎన్నికైనట్లు ఎలా డిక్లరేషన్ ఇస్తారని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఆర్.కె.రోజా ప్రశ్నించారు. ఈ విషయమై చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ కమిషనర్ బాలాజీనాయక్, మున్సిపల్ ఎన్నికల అధికారి సంజీవ్‌కుమార్‌లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె ఆదివారం జెడ్పీ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి సుమిత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ను ఆమోదించినట్లు తెలిపిన అధికారులు అతడికి ఫారం–7 ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయమై బాలకృష్ణ హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఈ కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండగానే టీడీపీ అభ్యర్థి ఎన్నికైనట్లు ఆదివారం డిక్లరేషన్ ఇచ్చారని ఫిర్యాదులో తెలిపారు. ఈ డిక్లరేషన్ ఇవ్వడంలో అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ వ్యవహారంలో నిజానిజాలు తేలేవరకు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేవరకు ఎంత దూరమైనా వెళ్లి పోరాడతానని ఆమె స్పష్టం చేశారు. కాగా, విజయపురం మండలం కోసలనగరం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భవాని నామినేషన్ తిరస్కరణకు గురైన అంశంపైన కూడా రోజా జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.


