అడ్డదారిలో గెలుపు కోసం అష్ట కుట్రలకు మరో రెండు జోడించిన టీడీపీ
నకరికల్లు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హనుమాయమ్మ భర్త కిడ్నాప్
ఈమె పోటీలో ఉంటే గెలవలేమని పచ్చ మూకల కుతంత్రం
నారా లోకేశ్ అనుచరుడి స్కెచ్ మేరకు మఫ్టీలో వచ్చి ఎత్తుకెళ్లిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డదారిలో గెలుపు కోసం ఇప్పటి దాకా అష్ట కుట్రలు పన్నిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మరో రెండు కుట్రలను జోడించింది. నామినేషన్ల ఉపసంహరణ కోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను తీవ్ర బెదిరింపులకు గురిచేయడం.. అది ఫలించకపోతే అభ్యర్థినో, అభ్యర్థి కుటుంబ సభ్యులనో ఏకంగా కిడ్నాప్ చేయడానికి బరితెగించింది. ఇందు కోసం ఏకంగా పోలీసులనే వాడుకోవడం కలకలం రేపుతోంది. టీడీపీ గూండాల దౌర్జన్యం, పోలీసుల అరాచక పర్వాన్ని ఎదిరించి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండల జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కందుల హనుమాయమ్మ ధైర్యంగా నామినేషన్ దాఖలు చేసింది.
రెండు రోజులుగా ఆమెతో నామినేషన్ విత్‌డ్రా చేయించేందుకు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినా ఫలించలేదు. ఈ స్థానం నుంచి టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మంత్రి నారా లోకేశ్ అనుచరుడు బాజీ చౌదరి.. నాగోతు శౌరయ్య అనే టీడీపీ నేత భార్య నాగోతు వెంకట లక్ష్మీసరోజను పోటీలో నిలిపారు. పోటీ జరిగితే ఇక్కడ ఈమె ఓడిపోతారనే భయంతో దుర్మార్గపు ఆలోచనకు తెరతీశారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో పోలీసులను అడ్డుపెట్టి కుతంత్రం నడిపించారు.
ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హనుమాయమ్మ ఇంటికి నకరికల్లు ఎస్‌ఐ సతీష్ నేతృత్వంలోని పోలీసు బృందం మఫ్టీలో వెళ్లింది. దౌర్జన్యంగా హనుమాయమ్మ భర్త లక్ష్మారెడ్డిని నిర్బంధించి, కారులో ఎత్తుకెళ్లారు. లక్ష్మారెడ్డి తల్లి, భార్య ఏడుస్తూ వారిని వేడుకున్నా కనికరించలేదు. వారు రోదిస్తున్నా పట్టించుకోకుండా బలవంతంగా లాక్కెళ్లారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే టీడీపీ రౌడీ మూకలను మించి దౌర్జన్యం చేయడం విస్తుగొలుపుతోంది.


