సీ విజిల్‌ యాప్‌ వినియోగించాలని విజ్ఞప్తి

Lella Appireddy Objections on E watch App - Sakshi

విజయవాడ: ఎస్ఈసీ నిబద్ధతపైన ఈ-వాచ్ యాప్‌తో అనుమానం వస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఈ-వాచ్ యాప్ డేటా విషయంలో గోప్యత కనిపిస్తోందని ఆరోపించారు. ఇంత గోప్యంగా ఎందుకు అని ప్రశ్నించారు. జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలకు తయారుచేసిన నిఘా యాప్‌ను ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చిన సీ-విజిల్ యాప్‌ను ఎందుకు తేలేదని పేర్కొన్నారు. ప్రభుత్వాలతో, సీఈసీతో సంబంధం లేకుండా కొత్త యాప్ ఎలా తెచ్చారని అడిగారు. టీడీపీ నాయకులు ఈ-వాచ్ యాప్ తయారు చేయడానికి టైం పట్టిందని ఆరోపించారు. ఇప్పటికైనా సీఈసీ తీసుకొచ్చిన సీ-విజిల్ యాప్‌ను వాడాలని కోరినట్లు తెలిపారు.

ఈ వాచ్ యాప్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బుధవారం ఎన్నికల సంఘం కార్యాలయంలో కార్యదర్శి కన్నబాబుకు లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో సీ విజిల్‌ యాప్‌ వినియోగించాలని విజ్ఞప్తి చేసినట్లు లేళ్ల తెలిపారు. ఈ వాచ్ యాప్‌పై అనేక అభ్యంతరాలున్నాయని చెప్పారు. ఎస్ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ అని గుర్తుచేశారు. నిమ్మగడ్డ ఇంత రహాస్యంగా యాప్‌ని ఎందుకు తయారుచేయాల్సి వచ్చిందో చెప్పాలని, ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన నిఘా యాప్‌ను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. నిఘా యాప్ పక్కన పెడితే సీ విజిల్ యాప్ వినియోగిస్తారనుకుంటే ప్రైవేట్ వ్యక్తులు రూపొందించిన ఈ వాచ్ ఎలా ఉపయోగిస్తారని అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వాచ్ యాప్ టీడీపీ కార్యాలయంలో తయారైందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అరాచకాలు ఎస్ఈసీకి కనిపించవా అని ప్రశ్నించారు. ఈ వాచ్ ఎక్కడ తయారు చేశారో.. ఎలా తయారు చేశారో.. ఫిర్యాదులు చేరతాయో లేదో కూడా తెలియదని.. దీనిపై ఎన్నో అనుమానాలున్నాయని లేళ్ల అప్పిరెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top