కబ్జా కోరులు టీడీపీ నేతలే!

Land Grabs By TDP Leaders In Visakhapatnam  - Sakshi

పచ్చ పార్టీ నేతలే విశాఖలో భూ రాబందులు 

ఎంవీవీఎస్‌ మూర్తి గీతం కళాశాలలో కలిపేసుకున్నది 42.51 ఎకరాలు

టీడీపీ నేత పల్లా, ఆయన బంధుగణం నుంచి స్వాధీనం చేసుకున్నది 38.45 ఎకరాలు

కబ్జాకోరు గంటా అంటూ సిట్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న బండారు కంటబడ్డ ఏ భూమైనా కబ్జానే...

విశాఖ భూములను కబ్జాకోరుల చెర నుంచి విడిపిస్తున్న జగన్‌ సర్కారు

ఇలా గత నాలుగున్నరేళ్లలో 430.81 ఎకరాలు స్వాధీనం

ఈ భూముల రిజిస్ట్రేషన్‌ విలువ రూ.2,638 కోట్లు 

మార్కెట్‌ విలువ రూ.5 వేల కోట్ల పైమాటే!

టీడీపీ కబ్జాదారుల కోరలు పీకేస్తే ఓర్వలేకపోతున్న చంద్రబాబు, రామోజీ.. విషపు రాతలతో విశాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న ఈనాడు

(కేజీ రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం): కుక్కకి చెప్పు రుచి తెలుసు కానీ.. చెరకు తీపి తెలుస్తుందా? టీడీపీ నేతలూ అంతే. టీడీపీ నాయకులకు విశాఖ నగరంలో భూములను మేయడం తెలుసు కానీ, అదే విశాఖ నగరాన్ని రాజధానిగా ప్రపంచ పటంలో నిలిపితే రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలు తెలి­యవు. పైపెచ్చు.. విశాఖ భూముల్ని కొల్లగొట్టిన టీడీపీ నాయకులే... భూములు ఆక్రమించడానికే వైఎస్సార్‌సీపీ విశాఖను రాజధాని అంటోందంటూ గొంతు చించుకుంటున్నారు.

అచ్చం దొంగే.. దొంగా.. దొంగా.. అని అరిచినట్టుగా. ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా వేల కోట్ల రూపాయల  భూముల్ని చెరపట్టారు టీడీపీ నేతలు. గయాలు, పోరంబోకు, గోర్జి, వాగులు, కాలువలు, గెడ్డలు, ఇనాం, జిరాయితీ, గ్రామకంఠాలు, చెరువులు.. ఇలా ఏ భూమి కనిపిస్తే దానిని చెరబట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టీడీపీ రాబందుల ఆటలు సాగలేదు సరికదా... వారి చెర నుంచి వందలాది ఎకరాలను విడిపించింది. ఇలా టీడీపీ కబ్జాదారుల కోరలు పీకడమే రామోజీ కడుపు మంటకు కారణం.

టీడీపీలోని భూ కబ్జాదారులను వెనకేసుకొచ్చేందుకు ఈనాడు పత్రికలో ప్రభుత్వంపై నిందలు వేస్తూ ఓ పెద్ద కథే వేశారు. విషపు రాతలతో విశాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. వాస్తవానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాగానే విశాఖ నగరం, చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన విలువైన ప్రభుత్వ భూముల సంరక్షణపై దృష్టి సారించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాలతో క్షుణ్ణంగా పరిశీలన జరుపుతోంది. ఇప్పటివరకు 270 ప్రాంతాల్లో రూ.2,600 కోట్లు విలువైన 430.81 ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకుంది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.5 వేల కోట్లకు పైగానే ఉంటుందని అధికారుల అంచనా. 

మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ కబ్జా పర్వం
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి రుషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గీతం యూనివర్సిటీకి సమీపంలోని ఈ స్థలంలో 2 ఎకరాల్లో కళాశాల భవనం, మిగిలిన స్థలానికి కాంపౌండ్‌ వాల్‌ నిర్మించారు. రూ.500 కోట్లు విలువ చేసే ఈ ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినప్పటికీ, టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ కాంపౌండ్‌ వాల్‌ను తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకుంది.

అక్రమాల ‘పల్లా’.. ఆక్రమణల పర్వం
అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధుగణం దోచుకున్న భూముల బాగోతాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. నగర శివారు ప్రాంతాల్లోని ఆ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాల్ని తొలగించింది. రూ.669 కోట్ల విలువైన 38.45 ఎకరాల ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకుంది. జగ్గరాజుపేటలో 1.26 ఎకరాలు వాగు స్థలం, తుంగ్లాంలో 0.92 ఎకరాల పోరంబోకు రాస్తా, 6.15 ఎకరాల యూఎల్‌సీ ల్యాండ్, 1.85 ఎకరాల పోరంబోకు చెరువు, 21.67 ఎకరాల పోరంబోకు చెరువు, 0.70 ఎకరాల ఈనాం భూములు, 0.80 ఎకరాల పోరంబోకు బంద, 2.04 ఎకరాల గయాలు భూములు, 1.50 ఎకరాల పోరంబోకు రాస్తా, 0.24 ఎకరాల పోరంబోకు భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కూర్మన్నపాలెంలో 1.35 ఎకరాల పోరంబోకు భూమిలోని ఆక్రమణలను కూడా తొలగించారు.

‘భూ’చోడు గంటా అంటూ అయ్యన్న ఫిర్యాదు.!
టీడీపీ హయాంలో విశాఖలో భారీ భూకుంభకోణమే జరిగింది. దీనిని అధికారులే బహిర్గతం చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం ఉలిక్కిపడింది. సిట్‌ పేరుతో హడావుడి చేసింది. ఈ కుంభకోణంలో తమ పార్టీ నాయకులే ఉన్నారంటూ ఆధారాలతో సహా సిట్‌ బృందానికి టీడీపీ సీనియర్‌ నేత, అప్పట్లో మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూముల పత్రాల్ని ట్యాంపరింగ్‌ చేసి ఇండియన్‌ బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు అక్రమాలకు పాల్పడ్డారంటూ బహిరంగంగానే ఆరోపించారు. ఇదంతా గంటా శ్రీనివాసరావు నిర్వాకమేనంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గంటాపై స్వయంగా తమ మంత్రే అయిన అయ్యన్న ఫిర్యాదు చేసినా, టీడీపీ ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది.

దసపల్లాపై ఇదేమి దందా!
దసపల్లా భూములపై ఈనాడు సిగ్గూ ఎగ్గూ లేని రాతలు రాసింది. ఈ భూములపై సర్వోన్నత న్యాయ స్థానం కూడా తీర్పు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం చేయగలిగేది ఏముంటుంది? అసలు ఈ భూముల వ్యవహారం కోర్టులో ఉండగానే, సీఎంగా ఉండి, ఆ భూములను సొంత పార్టీకే కేటాయించేసుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మించేసుకున్నదే చంద్రబాబు. దిగువ కోర్టులు, హైకోర్టు కూడా ఆ భూములు ప్రైవేటు వ్యక్తులవేనని తీర్పునిచ్చాయి. మునుపటి ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో అప్పీలు చేశాయి. సుప్రీంకోర్టు కూడా ఆ అప్పీలును, ఆ తర్వాత వేసిన రివ్యూ పిటిషన్‌ను, చిట్ట చివరి అస్త్రం ‘క్యూరేటివ్‌’ పిటిషన్‌’ను కూడా కొట్టేసింది.

ఆ తీర్పు ప్రకారం నడవటం తప్ప ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని ఏజీ వేణుగోపాల్‌ కూడా చంద్రబాబు ప్రభుత్వానికే చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా తీర్పును అమలు చేయలేదు. అందుకు కోర్టు ధిక్కారం కింద ఇద్దరు అధికారులకు జైలు శిక్ష కూడా పడింది. సర్వోన్నత న్యాయస్థానం వరకు తీర్పులు అనుకూలంగా ఉన్నాయి కనకే భూ యజమానులు డెవలపర్లతో ఒప్పందం చేసుకున్నారు. ఎవరికెంత శాతమన్నది ఇరుపక్షాల ఇష్టం. డెవలపర్లతో ఒప్పందం చేసుకున్న భూ యజమానుల్లో రామోజీ కుమారుడి వియ్యంకుడూ ఉన్నారు. ఒకవేళ తక్కువ వాటా వచ్చిందని భావిస్తే మీ వియ్యంకుడైనా ఒప్పందం ఎలా చేసుకుంటారు?

రామోజీకి అలవాటైన అబద్ధం
కూర్మన్నపాలెంలో 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని నిర్మాణాల్లో భూ యజమానులకు 0.96 శాతం వాటా.. అంటే 14,400 చదరపు అడుగులే ఇస్తున్నారని మరో అబద్ధాన్ని ఈనాడు కుమ్మరించింది. ఇది కేవలం గొట్టిపల్లి శోభారాణి, ఇతరులకు ఇచ్చిన వాటానే. ఈ భూమిపై వివాదం ఉన్న డాక్‌ లేబర్‌ బోర్డు ఉద్యోగులకు 160 మందికి 1,000 చదరపు అడుగుల ఫ్లాట్‌ చొప్పున మొత్తం 1,60,000 చదరపు అడుగులు, కొప్పిశెట్టి శ్రీనివాస్‌కు మరో 30 వేల చదరపు అడుగులు ఇవ్వాలని ఒప్పందం ఉంది.

మొత్తం కలిపి 2,04,400 చదరపు అడుగులు. కూర్మన్నపాలెం భూమిని అభివృద్ధి చేసి పరిష్కరించాలని డాక్‌ లేబర్‌ బోర్డు ఉద్యోగులు 2012లో కోరారని, అప్పటి నుంచి మొదలై 2017లో అందరితో మాట్లాడి ఒప్పందం కుదిరిందని డెవలపర్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు. ఆ పార్టీలకు 2 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలతోపాటు దాదాపు రూ.10 కోట్ల నగదు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. ఇదంతా పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని, ఎక్కడాప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు.

ఏ ప్రతిఫలంతో జీవో ఇచ్చారు.?
రుషికొండ వద్ద రేడియంట్‌ భూముల విషయంలో గత టీడీపీ ప్రభుత్వమే జీవో జారీ చేసిందని ఈనాడే స్పష్టంగా పేర్కొంది. ఏ ప్రతిఫలంతో ఆ జారీ చేశారు? బాబు హయాంలో జరిగితే ప్రైవేటు వ్యవహారం, ఈ ప్రభుత్వంలో జరిగితే కబ్జాలా? ఇదేమి వాదన? 

టీడీపీ నేతల నుంచి స్వాధీనం చేసుకున్న కబ్జా భూములు
► ఆనందపురం–శొంఠ్యాం సమీపంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా బంధువు, జనసేన నాయకుడు పరుచూరి భాస్కరరావు సహా పలువురు టీడీపీ నేతలు టైటిల్‌ డీడ్‌ 
నం.1180లో ఆక్రమించుకున్న రూ.256 కోట్లు విలువ చేసే 64 ఎకరాల భూముల్ని 2020 నవంబర్‌లో స్వాధీనం చేసుకున్నారు.
​​​​​​​► టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆనందపురం మండలం భీమన్నదొరపాలెంలో సర్వే నం.156లో 60 ఎకరాల భూమిని ఆక్రమించుకోగా.. 2020 డిసెంబర్‌లో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల మార్కెట్‌ విలువ రూ.300 కోట్లు ఉంటుందని అంచనా.
​​​​​​​

► టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆక్రమించిన రుషికొండ బీచ్‌రోడ్డులో సర్వే నం.21లోని సుమారు రూ.3 కోట్లు విలువ చేసే 6 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
​​​​​​​► టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధువర్గం పేరుతో గాజువాక నియోజకవర్గంలోని మూడు గ్రామాల పరిధిలో ఆక్రమించుకున్న సుమారు రూ.669.26 కోట్లు విలువైన 38.45 ఎకరాల్ని 2021లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

► సీతమ్మధారలోని రేసపువానిపాలెం సర్వే నంబర్‌ 7లో సుమారు రూ.3 కోట్లు విలువైన 212 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ సీనియర్‌ నేత సబ్బం హరి కబ్జా చేసి ప్రహరీ, రెస్ట్‌ రూమ్‌లు నిర్మించేసినట్లు గుర్తించిన జీవీఎంసీ అధికారులు వాటిని 2020 అక్టోబర్‌ 3న తొలగించారు.
​​​​​​​► టీడీపీ హయాంలో ఆనందపురంలో సర్వే నంబర్‌ 122, 123లోని రూ.15 కోట్లు విలువ చేసే 2.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లే గ్రౌండ్‌గా మార్చి దర్జాగా కబ్జా చేసిన విశ్వనాథ∙విద్యా సంస్థల నుంచి 2021 నవంబర్‌లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రామోజీ గ‘లీజు’లు
నీతులు చెప్పేటందుకే.. పాటించడానికి కాదన్నది రామోజీరావు ప్రధాన సిద్ధాంతం. కుటుంబ సభ్యుల్ని కూడా మోసం చేసే వ్యక్తిగా, వ్యవస్థల్ని మేనేజ్‌ చేసే పెద్దమనిషిగా, బంధువులను సైతం కోర్టుల చుట్టూ తిప్పించి వాళ్ల భూములను కారుచౌకగా కొట్టేసే వ్యాపారిగా ప్రసిద్ధుడు. విశాఖ స్థలాన్నీ అలానే కొట్టేయాలని చూసి భంగపడ్డారు. ఆ కథ ఇదీ..1974లో విశాఖ సీతమ్మధారలో 2.78 ఎకరాల భూమిని, 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 10 భవనాలను నెలకు రూ.3 వేలు అద్దె చొప్పున 33 ఏళ్లకు మంతెన ఆదిత్యవర్మ నుంచి రామోజీరావు లీజుకు తీసుకున్నారు.

లీజు గడువు ముగిసినా ఖాళీ చెయ్యకపోగా, కోర్టులో కేసు వేశారు. 1985లో ఈ స్థలానికి ఉత్తరం వైపున కొంత స్థలాన్ని రోడ్డు విస్తరణకు ప్రభుత్వానికి అప్పగించినందుకు ప్రతిగా వెనక ఉన్న స్థలాన్ని కేటాయించాలని రామోజీ లేఖ రాయగా, ప్రభుత్వం 1986లో ఆయన కోరిన స్థలాన్ని కేటాయించింది. దాన్ని రామోజీ తన కుమారుడి పేరిట రిజిస్టర్‌ చేయించుకున్నారు. స్థలం తనది కాకపోయినా, ప్రభుత్వానికి అప్పగించడం, దానికి ప్రతిగా మరో స్థలాన్ని పొందడం పక్కా మోసమే. ఇదే విషయాన్ని పేర్కొంటూ రామోజీపై స్థల యజమాని ఆదిత్యవర్మ క్రిమినల్‌ కేసు వేశారు.

దీని నుంచి తప్పించుకునేందుకు ఏకంగా విశాఖపట్నం జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ని రామోజీరావు ఫోర్జరీ చేశారు. మొత్తం వివరాల్ని పరిశీలించిన న్యాయస్థానం.. ఫోర్జరీకి ప్రాథమిక ఆధా­రా­లు­న్నాయని, రామోజీపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కుట్ర, ఫోర్జరీ, మోసపూరిత చర్యలకు గాను ఐపీసీ 120బి, 193, 196, 471, 465, 466 సెక్షన్ల కింద కేసు నమోదయింది. కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఖాళీ చేసేందుకు ఇష్టపడని రామోజీరావు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. మరోవైపు అద్దె సక్ర­మంగా చెల్లించకపోవడంతో వర్మ విశాఖలోని రెంట్‌ కంట్రో­ల్‌ కోర్టు (ఆర్‌సీసీ)ని ఆశ్రయించారు. నెలలో భవనాన్ని ఖాళీ చేయాలని కోర్టు రామోజీ­రావు­ను ఆదేశించింది.

ఈ వ్యవహా­రం హైకోర్టు వరకు నడిచింది. అప్పటి స్థలం విలువపై 5 శాతం అద్దెను ప్రతినెలా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. రామోజీరావు స్థల యజమాని వర్మకు రూ.17 లక్షల చొప్పు­న ప్రతినెలా 10వ తేదీ లోపు అద్దె చెల్లించా­లని, అద్దె బకాయిలు రూ. 2.57 కోట్లు ఇవ్వా­లని ఆదేశించింది. ఈ తీర్పుపై స్టే విధించాలన్న రామోజీరావు వినతిని సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. 2014 ఫిబ్రవరి 10లోగా అద్దెతోపాటు బకాయిలు రామోజీ­రావు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఎక్కడా తన పప్పులు ఉడకకపోవడంతో చివరికి ఆ స్థలాన్ని యజమాని వర్మకు  అప్పగించారు రామోజీ.

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top