ఏపీలో సంక్రాంతి సంబురాలను కూటమి నేతలు పూర్తి జూదంగా మార్చేశారు. ప్రత్యేకించి.. టీడీపీకి చెందిన నేతలు ప్రజల పండుగను విపరీతంగా క్యాష్ చేసుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోడిపందేలు ఆటలు నిర్వహిస్తున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో నడిపిస్తున్నారు. మరోవైపు.. అర్ధరాత్రి దాకా అశ్లీల నృత్యాలను టీడీపీ, జనసేన నేతలు దగ్గరుండి నిర్వహిస్తుండడం చర్చనీయాంశమైంది. కూటమి నేతల ఆ దోపిడీ ఎలా ఉందంటే..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూదంపై కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆ జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు కట్టడి చేయాలని.. అవసరమైతే సెక్షన్ 144 అమలు చేయాలని సూచించింది. తమ ఆదేశాలు ఉల్లంఘించి కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే దాడులు చేసి డబ్బును సీజ్ చేయాలని కూడా ఆదేశించింది. కానీ.. కూటమి నేతలకు భయపడుతున్న పోలీసులు ఆ పక్కకు కూడా పోవడం లేదు.
సీఎం సభ రేంజ్‌లో..
ఒక పక్క.. ఉమ్మడి.. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలు ఈ సంక్రాంతికి మునుపటిలాగే కోడిపందాలు, పేకాట, జూదానికి ప్రధాన అడ్డాలుగా మారాయి. సీఎం సభలకు వేసే జర్మన్ హ్యాంగర్స్ వేసి మరీ పందేల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మీడియాను బరుల చుట్టుపక్కలకూ కూడా రానివ్వడం లేదు. ఆఖరికి.. సెల్‌ఫోన్‌లతో వీడియోలు తీయకుండా ప్రైవేట్ సైన్యాన్ని ఏరపాటు చేస్తున్నారు. వీఐపీలు రిఫ్రెష్ కావడానికి కారవాన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాలతో పాటు పేకాట గుండాటతోపాటు మరికొన్ని ఆటలు నిర్వహిస్తున్నారు. గెలిచిన వారికి కార్లు, బైకులు బహుమతులుగా ఇస్తున్నారు. అలా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే రూ.2000 కోట్లకు దాకా జూద క్రీడలు నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు..
ఏరులై పారతున్న..
మరోవైపు.. కోడి పందేల బరుల దగ్గరే బెల్ట్ షాపులు వెలిశాయి. అవి వైన్ షాపులను తలపిస్తున్నాయి. కూటమి నేతలు, వాళ్ల అనుచరులే వాటిని నడిపిస్తున్నారు. మద్యం ప్రియుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటూ లిక్కర్‌ను ఏరులై పారిస్తున్నారు. లిక్కర్ క్వార్టర్ బాటిల్ మీద అదనంగా రూ.50 , బీర్ బాటిల్ పై రూ.100 వసూలు చేస్తున్నారు. తద్వారా కోట్ల రూపాయల్ని వెనకేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. ఎక్సైజ్ పోలీసులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు.
డాన్స్ బేబీ డాన్స్
ఇంకోవైపు.. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట యువతులతో రికార్డింగ్ డ్యాన్సులు చేయిస్తున్నారు. కూటమి నేతలైతే ఆ డ్యాన్సర్లతో కలిసి హుషారుగా గంతులేస్తున్నారు. కొందరైతే.. యువతులను దుస్తులు విప్పమంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో డాన్సర్లతో ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట, రాజోలు, అమలాపురం సహ పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాకా ఈ తంతు జరుగుతోంది. రాజోలులో ఎమ్మెల్యే వరప్రసాద్ అనుచరుడు దగ్గురుండి మరీ డ్యాన్సులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ అశ్లీల వ్యవహారాలను అడ్డుకోవాల్సిన పోలీసులు పత్తా లేకుండా పోయారు.

నెట్టింట చర్చ.. రచ్చ..
ఈ బాగోతాలపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. కోడి పందేలు, గుండాట.. ఆ ప్రాంగంలోనే మందు బాబుల వీరంగం తాలుకా వీడియోలు నెట్టింట కనిపిస్తున్నాయి. అశ్లీల నృత్యాలను ప్రస్తావిస్తూ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నెట్టింట పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. అదే సమయంలో.. వీటి కోసం తెలంగాణ నుంచి భారీగా తరలి వస్తున్నారనే విషయాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం సంబురాల పేరిట గబ్బు పట్టిస్తోందని పలువురు మండిపడుతున్నారు.


