
కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్నూలులో నిరసన తెలుపుతున్న మహిళలు
నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు
ఆడబిడ్డ నిధి పథకానికి మంగళం పాడటం దుర్మార్గం
ఓట్లు వేయించుకుని మోసం చేసిన కూటమి సర్కారు
కర్నూలులో మహిళల నిరసన
కర్నూలు (టౌన్)/ కాకినాడ రూరల్: ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తామని టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని సమాధి చేశారని మహిళలు మండిపడ్డారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్ నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మహిళలు ర్యాలీ నిర్వహించారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్.. డౌన్.. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలను నమ్మించి మోసం చేశారని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి మాట్లాడుతూ.. ఓట్ల కోసం సూపర్ సిక్స్ హమీలు ఇచ్చి.. తీరా గద్దెనెక్కాక కూటమి పార్టీల పెద్దలు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు ఏటా రూ.18 వేలు ఇస్తామని చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటించారన్నారు. ఆ మేరకు కూటమి మేనిఫెస్టోలోనూ పెట్టారన్నారు. తీరా ఇప్పుడు సీఎం చంద్రబాబు తన కర్నూలు పర్యటనలో.. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించడం దుర్మార్గం అన్నారు.
2029 నాటికి కూడా పేదరికం తగ్గకపోతే అప్పుడు పీ–4 పథకానికి ఆడబిడ్డ నిధి పథకాన్ని అనుసంధానం చేస్తానని చెప్పడం మరోసారి మహిళలను దగా చేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి భారతి, కర్నూలు నగర మహిళ నాయకులు మంగమ్మ, 43వ వార్డు కార్పొరేటర్ మునెమ్మ, కర్నూలు నియోజకవర్గ ఆంగన్‌వాడీ మహిళ నాయకురాలు రాధికమ్మ తదితరులు పాల్గొన్నారు.
సూపర్ మోసం
కూటమి ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలు మహిళలకు శాపంగా మారాయని, ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తామని నమ్మించి.. ఇప్పుడు మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సూపర్ మోసాలు చేస్తోందని ధ్వజమెత్తారు. కాకినాడ 49వ డివిజన్‌లోని తన నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని సూపర్ సిక్స్ హామీల కింద పెట్టి.. ఇప్పుడు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారని.. ఆ పథకం అక్కర్లేదని సీఎం చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు మహిళల్లో కనిపించిన పేదరికం.. అధికారం చేపట్టగానే మాయమైందా.. అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెచ్చిన వేల కోట్ల రూపాయలతో ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.