రూ.15వేల కోట్లతో అభివృద్ధి 

Kurnool Joint District Development With Rs 15000 Crores Buggana - Sakshi

వచ్చే రెండేళ్లలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పరుగులు పెట్టనున్న ప్రగతి

ప్రజలందరికీ ఆరోగ్య భరోసా

మారిన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు

కొత్త జిల్లాల ఏర్పాటుతో మరింత చేరువగా పాలన

జెడ్పీ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

కర్నూలు(అర్బన్‌): నంద్యాల, కర్నూలు జిల్లాల్లో వచ్చే రెండేళ్లలో రూ.15వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు  రాష్ట్ర ఆర్థిక శాఖ, కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే గురుతర బాధ్యత జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలపై ఎంతైనా ఉందన్నారు. జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మంత్రి బుగ్గనతో పాటు ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, పాణ్యం, బనగానపల్లె, పత్తికొండ, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కంగాటి శ్రీదేవి, సుధాకర్‌ కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు పీ కోటేశ్వరరావు, మనజీర్‌ జిలానీ శామూన్, కర్నూలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి హాజరయ్యారు. 

గ్రామీణ నీటి సరఫరా, గృహ నిర్మాణం, ప్రభుత్వ భవనాల నిర్మాణం, నాడు – నేడు (ఫేజ్‌ –2 విద్య), వైద్య ఆరోగ్య శాఖపై ఉమ్మడి జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారన్నారు. ఉమ్మడి జిల్లాలో నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా రూ.1,500 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు. అలాగే ఆరోగ్య కేంద్ర భవనాలను ఆధునీకరించి మెరుగైన వైద్య విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.

కోవిడ్‌ –19 పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య భరోసా ఇచ్చిందన్నారు. అనేక వ్యాధులను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకురావడంతో పేదలకు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉచితంగా ఖరీదైన వైద్యం లభిస్తోందన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి పథకాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులకు సూచించారు. సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు, అప్‌లోడ్‌ కాని బిల్లులకు సంబంధించిన నివేదికలను అందించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు.  సమావేశంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ దిల్షాద్‌ నాయక్, వీరశైవ లింగాయతీ కార్పొరేషన్‌ చైర్మన్‌ రుద్రగౌడ్, జెడ్పీటీసీ సభ్యులు  డీ మురళీధర్‌రెడ్డి, కేఈ సుభాషి ణి,  రాధా ప్రియదర్శిని, డీ పులికొండనాయక్, గిరిజోన్, సుధాకర్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి, సుంకన్న, ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. 

రెవెన్యూలో ఇష్టారాజ్యం  
మద్దికెర, తుగ్గలి మండలాల్లో రెవెన్యూ అధికా రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారు కార్యాలయాల్లో ఉండకపోవడంతో రైతులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారు. అధికారిక కార్యక్రమాలకు కూడా వారు హాజరు కావడం లేదు. కలెక్టర్, ఆర్‌డీఓ సమావేశాలకు వెళ్లామంటూ సాకులు చెబుతున్నారు. విద్యుత్, హౌసింగ్‌ శాఖలకు సంబంధించి తగినంత సిబ్బంది లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. 
–  పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి 

గడువు ఇవ్వాలి
జిల్లాలోని సీపీడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎస్‌ స్కీములకు సంబంధించి విద్యుత్‌ బిల్లుల చెల్లింపునకు విద్యుత్‌ శాఖ అధికారులు కొంత గడువు ఇవ్వాలి. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పవర్‌ కట్‌ చేయకుండా వెసులుబాటు కల్పించాలి. రక్షిత మంచినీటి సరఫరాకు సంబంధించి అవసరమైన ప్రాంతాల్లో పైప్‌లను మారుస్తాం. జగనన్న కాలనీల్లో అప్రోచ్‌ రోడ్లకు పీఆర్‌ ఇంజినీరింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలి. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోనే ఇంటి పట్టాలను మంజూరు చేస్తారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల వేగం పెంచేందుకు జెడ్పీటీసీ సభ్యులు చొరవ చూపాలి.  
 – జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి
 
అర్హులకు ఇళ్లు మంజూరు  చేయండి  
టీడీపీ హయాంలో అనేక మంది బినామీలకు గృహాలు మంజూరు చేశారు. అప్పట్లో జరిగిన తప్పిదాలతో నేడు అనేక మంది అర్హులకు గృహాలు మంజూరు కావడం లేదు. పక్కా గృహం మంజూరుకు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తే ఆన్‌లైన్‌లో వారి ఖాతాలో ఒక రూపాయి జమ అయినట్లు చూపిస్తోంది. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేదు. ఇప్పటికైనా రెండు జిల్లాల్లో ఒక్క రూపాయి జమ అయిన వారి జాబితాలను ఒక సారి క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయండి.  
– పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top