జోరుగా సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌లు, కార్ల అమ్మకాలు.. కారణాలు ఇవే!

Kurnool District: Second hand Bikes and Cars Sales Rise - Sakshi

ధర తక్కువ కావడంతో కొనుగోలుపై సామాన్యుల దృష్టి

మూడేళ్ల నుంచి మెరుగవుతున్న ప్రజల జీవన ప్రమాణాలు

కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలంటున్న మెకానిక్‌లు

కర్నూలు(సెంట్రల్‌): అవసరాలకు అనుగుణంగా ప్రజలు సెకండ్‌ హ్యాండ్‌ కార్లు, బైక్‌ల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో గతేడాది సెకండ్‌ హ్యాండ్‌ షోరూముల్లో దాదాపు 5 వేల కార్లు, 10 వేల బైక్‌ల వరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో బీఎస్‌ 6 వాహనాలు వచ్చాయి. ఏ కంపెనీ బైక్‌ తీసుకున్నా దాదాపు రూ.లక్షకు అటు ఇటుగా ధరలు ఉన్నాయి. ఈఎంఐల రూపంలో తీసుకుంటే వడ్డీ, ఇతర చార్జీలు కలుపుకొని రెండేళ్ల వ్యవధిలో రూ. 1.40 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సగం ధరకే సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌లు లభిస్తుండడంతో చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, రైతులు, కూలీలు, చిన్నచిన్న పనులు చేసుకొని బతికేవారు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సెకండ్స్‌లో రూ.50 వేల నుంచి రూ. 70 వేల మధ్య రెండు, మూడేళ్ల సర్వీసు ఉన్న బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. 


విలాసవంతమైన జీవితం 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల జీవన విధానంలో భారీ మార్పులు వచ్చాయి. ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో అన్ని వర్గాల ప్రజల జీవన గమనంలో వృద్ధి కనిపిస్తోంది. ఇదే క్రమంలో సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో మంచి పంటలు పండుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటికి గిట్టుబాటు ధరలు ఇస్తుండడంతో రైతన్నల ఇంటా ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు విలాసవంతమైన జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. అందులో అవసరాలకు తగ్గట్లుగా కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. 


వెలుస్తున్న షోరూంలు.. 

సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల కొనుగోలుపై ప్రజలు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుండడంతో వ్యాపారులు అందుకు తగ్గట్లుగా షోరూంలను తెరుస్తున్నారు. కర్నూలులో 15 కారు, 20 బైక్‌ షోరూంలు ఉన్నాయి.  ఆదోనిలో 5 కారు, 10 బైక్, నంద్యాలలో 5 కారు, 13 బైక్‌ షోరూంలు వెలిశాయి. వీటిని ఆయా పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంత  ప్రజలు ఆదరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సెకండ్‌ హ్యాండ్‌ షోరూముల్లో గతేడాది 5 వేల వరకు కార్లు, 10 వేల వరకు బైక్‌లు అమ్మకాలు జరిగాయి. 


ఈఎంఐ సదుపాయం
 
సెకండ్‌ హ్యాండ్‌ కార్లు, బైక్‌లకు కూడా కొన్ని ఫైనాన్స్‌ కంపెనీలు లోన్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. తక్కువ వడ్డీ, తక్కువ డౌన్‌పేమెంట్స్‌తో ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌ వసతి కూడా ఉంది. కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే మొదటికే మోసం వస్తుంది. కొనుగోలు చేసే వాహనాన్ని మొదట మెకానిక్‌కు చూపించి,  దాని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే రేటును నిర్ణయించుకోవాలి. తక్కువ దూరం తిరిగినవి మేలైన మన్నిక ఇస్తాయి. షోరూంలకు చిన్నపాటి మరమ్మతులకు గురైనవి అధికంగా వస్తుంటాయి. కొందరు అచ్చుబాటుకాక, మరికొందరు తక్షణ రుణావసరాల కోసం అమ్మి ఉంటారు. రికార్డులను పరిశీలించి, కొనుగోలు చేయడం ఉత్తమం.  


కార్లపై పెరిగిన ఆసక్తి... 

మార్కెట్‌లో పలు కంపెనీల కార్లు వివిధ మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంది. సెకండ్స్‌లో రూ.లక్ష నుంచి సరసమైన ధరకు కార్లు లభిస్తున్నాయి. నాలుగైదు లక్షలు వెచ్చిస్తే మంచి కంపెనీ..రెండు, మూడేళ్ల సర్వీసు ఉన్న కార్లను కొనుగోలు చేయవచ్చు. దీంతో సామాన్యులు సైతం కార్ల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నారు. సెకండ్స్‌లో కార్లు కొనుగోలు చేస్తున్న వారిలో ఉద్యోగులు, రైతులు, ప్రైవేట్‌ కంపెనీల్లో పనిచేసే వారు ఎక్కువగా ఉంటున్నారు.


కార్లు ఎక్కువగా కొంటున్నారు 

కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో మా  షోరూం ఉంది. ఇటీవల కాలంలో ప్రజలు ఎక్కువగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. మా దగ్గర అన్ని రికార్డులు సక్రమంగా ఉంటాయి.  కొనుగోలుదారులకు భవిష్యత్‌లో ఏమీ ఇబ్బందులు ఉండవు. నెలలో కనీసం 10 కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి.           
– శ్రీనివాసులు   


సౌకర్యవంతంగా ఉంది
 
మేం ఇటీవల సెకండ్‌ హ్యాండ్‌లో కారును కొనుగోలు చేశాం. దాని స్థితిగతి చాలా బాగుంది. మేము కొనుగోలు చేసిన వాహనం కొత్తదైతే రూ.10 లక్షల విలువ ఉంటుంది. సెకండ్స్‌లో దానిని రూ.4 లక్షలకే కొనుగోలు చేశాం. మా కుటుంబ అవసరాలకు చాలా సౌకర్యవంతంగా ఉంది.  
– రజనీకాంత్‌రెడ్డి, కర్నూలు 


సగం ధరకే  కొనుగోలు చేశా 

నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. స్కూలుకు సమయానికి వెళ్లేందుకు కారును కొనుగోలు చేయాలని నిర్ణయించాను. అయితే మార్కెట్‌లో ఫస్టు హ్యాండ్‌ వాహనాలకు రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయనిపించింది. సెకండ్స్‌లో చూస్తే మేము అనుకున్న ధరకే లభించింది. దాదాపు సగం ధరకే కారును కొనుగోలు చేశా.   
– శ్రీనివాసరెడ్డి, కర్నూలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top