Kolleru Lake: ఎగువ నుంచి భారీగా కొల్లేరుకు వరద నీరు

Kolleru Lake Overflows After Continuous Rains, Penumakalanka Road Submerged - Sakshi

నీట మునిగిన పెనుమాకలంక రహదారి

పెద ఎడ్లగాడి వద్ద పెరుకుపోయిన గుర్రపుడెక్క  

కైకలూరు: కొల్లేరు సరస్సు ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలకు ఎగువ నుంచి కొల్లేరుకు వరద నీరు చేరుతోంది. కొల్లేరుకు చేరిన వరద నీరు సముద్రానికి చేరే మార్గమధ్యంలో అక్రమ చేపల చెరువులు అడ్డు వస్తున్నాయి. దీనికి తోడు గుర్రపుడెక్క తోడవడంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు పాకుతోంది. కొల్లేరు గ్రామాల్లో పలు అక్రమ చేపల చెరువులకు గండ్లు పడటంతో రహదారులు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో కొల్లేరు ప్రక్షాళన అంశం మరోసారి తెరపైకి వస్తోంది.  

మండవల్లి మండలం పెనుమాకలంక, ఇంగిలింపాకలంక గ్రామస్తుల ప్రధాన మార్గమైన పెదఎడ్లగాడి – పెనుమాలంక రహదారి కొల్లేరు వరద నీటికి మునిగింది. దశాబ్దాలుగా ఇదే సమస్య కొల్లేరు గ్రామాల ప్రజలను పట్టి వేధిస్తోంది. పెద ఎడ్లగాడి వంతెన దిగువన ఈ గ్రామాలు ఉండటంతో వరద నీరు వెనక్కి వచ్చి ముంచెత్తుతోంది. పెదఎడ్లగాడి వద్ద 8.6 అడుగుల నీటి మట్టం నమోదైంది. అదే విధంగా కైకలూరు–ఏలూరు రహదారిలో ఇరువైపులా కొల్లేరు నీరు గట్లను తాకుతోంది. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు వాపోతున్నారు.  


ప్రమాదకరంగా ఇనుప వంతెన...
 
సర్కారు కాల్వపై ఇనుప వంతెన ప్రమాదకరంగా మారింది. వరదల సమయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి 67 డ్రెయిన్ల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు కొల్లేరుకు చేరుతుంది. కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేయడానికి పందిరిపల్లిగూడెం వద్ద ఇనుప వంతెనను గ్రామస్తులు నిర్మించారు. ఇటీవల వంతెనపై రేకులు దెబ్బతిన్నాయి. దీనికి తోడు కింద నుంచి ప్రవాహ వేగం పెరిగింది. టోల్‌గేట్‌దారులు భారీ వాహనాలను సైతం వంతెనపై అనుమతిస్తున్నారు. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు.  

అడ్డు వస్తున్న చేపల చెరువులు 
కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి చేరవేసే క్రమంలో అక్రమ చేపల చెరువు గట్లు అడ్డు వస్తున్నాయి. తెలుగుదేశం పాలనలో కొల్లేరులో అక్రమ చేపల చెరువులను తవ్వేశారు. అడ్డుకున్న అటవీ సిబ్బందిపై టీడీపీ నేతల అండతో దాడులు సైతం చేశారు. కొల్లేరులో డ్రెయిన్లు సైతం అక్రమించారు. ఈ కారణంగా వరదల సమయంలో చేరుతున్న  నీరు కిందకు చేరడం లేదు. పెద ఎడ్లగాడి వంతెన వద్ద 8 అడుగులు నీటి మట్టం ఉంటే, దిగువన ఉన్న ఉప్పుటేరు వంతెన వద్ద కేవలం 4 అడుగుల నీటి మట్టం ఉంది. ఎగువ నుంచి నీరు కిందకు రావడానికి చేపల చెరువుల గట్లు అడ్డుపడుతున్నాయి.  


గుర్రపుడెక్కతో చిక్కులు 

ఎగువ నుంచి కొట్టుకువస్తున్న గుర్రపుడెక్కతో ప్రతీ ఏటా సమస్య ఉత్పన్నమవుతోంది. కొల్లేరుకు చేరుతున్న నీటిని సముద్రానికి చేరవేయడానికి పెద ఎడ్లగాడి వంతెన మార్గంగా ఉంది. ఈ వంతెనకు ఉన్న 56 ఖానాలలో ఇప్పుడు గుర్రపుడెక్క పేరుకుపోయింది. మేటలు వేసిన గుర్రపుడెక్క కారణంగా నీరు వెనక్కి మల్లుతుంది. ఈ కారణంగా పెదఎడ్లగాడి నుంచి పెనుమాకలంక చేరే రహదారి నీట మునిగింది. సాదరణంగా వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత పైనుంచి చేరుతున్న నీటితో కొల్లేరుకు వరద పోటు వస్తుంది.  


గుర్రపు డెక్క తొలగిస్తాం
 
పెదఎడ్లగాడి వద్ద గుర్రపుడెక్కను మనుషులతో తొలగిస్తాం. దీనికి రూ.8 లక్షలు నిధులు మంజూరయ్యాయి. పొక్లయిన్‌తో తొలిగిస్తుంటే వంతెన పాడవుతుందని ఆర్‌అండ్‌బీ అధికారులు అడ్డు చెబుతున్నారు. దీంతో మనుషులను పెడుతున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 8.6 అడుగులు నీటి మట్టం నమోదయ్యింది. 12 అడుగులకు చేరితే మరింత ప్రమాదం. పరిస్థితిని సమీక్షిస్తున్నాం.
– బి.ఇందిరా, డ్రెయినేజీ జేఈఈ, కైకలూరు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top