breaking news
Penumaka village
-
Kolleru Lake: ఎగువ నుంచి భారీగా కొల్లేరుకు వరద నీరు
కైకలూరు: కొల్లేరు సరస్సు ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలకు ఎగువ నుంచి కొల్లేరుకు వరద నీరు చేరుతోంది. కొల్లేరుకు చేరిన వరద నీరు సముద్రానికి చేరే మార్గమధ్యంలో అక్రమ చేపల చెరువులు అడ్డు వస్తున్నాయి. దీనికి తోడు గుర్రపుడెక్క తోడవడంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు పాకుతోంది. కొల్లేరు గ్రామాల్లో పలు అక్రమ చేపల చెరువులకు గండ్లు పడటంతో రహదారులు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో కొల్లేరు ప్రక్షాళన అంశం మరోసారి తెరపైకి వస్తోంది. మండవల్లి మండలం పెనుమాకలంక, ఇంగిలింపాకలంక గ్రామస్తుల ప్రధాన మార్గమైన పెదఎడ్లగాడి – పెనుమాలంక రహదారి కొల్లేరు వరద నీటికి మునిగింది. దశాబ్దాలుగా ఇదే సమస్య కొల్లేరు గ్రామాల ప్రజలను పట్టి వేధిస్తోంది. పెద ఎడ్లగాడి వంతెన దిగువన ఈ గ్రామాలు ఉండటంతో వరద నీరు వెనక్కి వచ్చి ముంచెత్తుతోంది. పెదఎడ్లగాడి వద్ద 8.6 అడుగుల నీటి మట్టం నమోదైంది. అదే విధంగా కైకలూరు–ఏలూరు రహదారిలో ఇరువైపులా కొల్లేరు నీరు గట్లను తాకుతోంది. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదకరంగా ఇనుప వంతెన... సర్కారు కాల్వపై ఇనుప వంతెన ప్రమాదకరంగా మారింది. వరదల సమయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి 67 డ్రెయిన్ల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు కొల్లేరుకు చేరుతుంది. కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేయడానికి పందిరిపల్లిగూడెం వద్ద ఇనుప వంతెనను గ్రామస్తులు నిర్మించారు. ఇటీవల వంతెనపై రేకులు దెబ్బతిన్నాయి. దీనికి తోడు కింద నుంచి ప్రవాహ వేగం పెరిగింది. టోల్గేట్దారులు భారీ వాహనాలను సైతం వంతెనపై అనుమతిస్తున్నారు. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. అడ్డు వస్తున్న చేపల చెరువులు కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి చేరవేసే క్రమంలో అక్రమ చేపల చెరువు గట్లు అడ్డు వస్తున్నాయి. తెలుగుదేశం పాలనలో కొల్లేరులో అక్రమ చేపల చెరువులను తవ్వేశారు. అడ్డుకున్న అటవీ సిబ్బందిపై టీడీపీ నేతల అండతో దాడులు సైతం చేశారు. కొల్లేరులో డ్రెయిన్లు సైతం అక్రమించారు. ఈ కారణంగా వరదల సమయంలో చేరుతున్న నీరు కిందకు చేరడం లేదు. పెద ఎడ్లగాడి వంతెన వద్ద 8 అడుగులు నీటి మట్టం ఉంటే, దిగువన ఉన్న ఉప్పుటేరు వంతెన వద్ద కేవలం 4 అడుగుల నీటి మట్టం ఉంది. ఎగువ నుంచి నీరు కిందకు రావడానికి చేపల చెరువుల గట్లు అడ్డుపడుతున్నాయి. గుర్రపుడెక్కతో చిక్కులు ఎగువ నుంచి కొట్టుకువస్తున్న గుర్రపుడెక్కతో ప్రతీ ఏటా సమస్య ఉత్పన్నమవుతోంది. కొల్లేరుకు చేరుతున్న నీటిని సముద్రానికి చేరవేయడానికి పెద ఎడ్లగాడి వంతెన మార్గంగా ఉంది. ఈ వంతెనకు ఉన్న 56 ఖానాలలో ఇప్పుడు గుర్రపుడెక్క పేరుకుపోయింది. మేటలు వేసిన గుర్రపుడెక్క కారణంగా నీరు వెనక్కి మల్లుతుంది. ఈ కారణంగా పెదఎడ్లగాడి నుంచి పెనుమాకలంక చేరే రహదారి నీట మునిగింది. సాదరణంగా వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత పైనుంచి చేరుతున్న నీటితో కొల్లేరుకు వరద పోటు వస్తుంది. గుర్రపు డెక్క తొలగిస్తాం పెదఎడ్లగాడి వద్ద గుర్రపుడెక్కను మనుషులతో తొలగిస్తాం. దీనికి రూ.8 లక్షలు నిధులు మంజూరయ్యాయి. పొక్లయిన్‌తో తొలిగిస్తుంటే వంతెన పాడవుతుందని ఆర్అండ్బీ అధికారులు అడ్డు చెబుతున్నారు. దీంతో మనుషులను పెడుతున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 8.6 అడుగులు నీటి మట్టం నమోదయ్యింది. 12 అడుగులకు చేరితే మరింత ప్రమాదం. పరిస్థితిని సమీక్షిస్తున్నాం. – బి.ఇందిరా, డ్రెయినేజీ జేఈఈ, కైకలూరు -
జనపథం - పెనుమాక గ్రామం
-
బావిలో పసికందు మృతదేహం
పుట్టిన రోజే చావురోజు కవరులో పెట్టి బావిలో వేసిన వైనం తాడేపల్లి రూరల్ : పెనుమాక గ్రామంలోని కొత్తూరు ప్రాంత తాగునీటి బావిలో గురువారం ఆడ పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సెల్‌ఫోన్ ప్యాకింగ్ కవర్లో ఆ పసికందు మృతదేహాన్ని చుట్టి బావిలో పడవేసినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహం ఉబ్బి ఉండడంతో రెండు కాళ్లూ కవరను చీల్చుకుంటూ బయటకు వచ్చాయి. ముందు స్థానికులు ఏదో జంతువు మృతదేహం అనుకున్నారు. స్థానికంగా నివసించే యువకులు బావిలోకి దిగి పరిశీలించగా ముక్కుపచ్చలారని పసికందు కనిపించింది. బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీయడంతో స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆడపిల్ల పుట్టిందనే నెపంతో ఎవరైనా తీసుకువచ్చి బావిలో పడేశారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వీఆర్వో ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. స్థానికులు మాత్రం ఈ పసికందు మృతదేహాన్ని మంగళగిరి నుంచి తీసుకువచ్చి స్థానికుల సహాయంతో బావిలో పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని తీసుకువచ్చిన కవర్‌పై విమలా మొబైల్స్, నవతా ట్రాన్స్‌పోర్టు ఆపోజిట్, మంగళగిరి అని ఉంది. దీంతో కవర్ ఆధారంగా స్థానికులు మంగళగిరికి చెందినవారే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పెనుమాకలోనే పంచాయతీ కార్యాలయం సమీపంలో ఆడపిల్లను తీసుకువచ్చి కవర్లో ప్యాకింగ్ చేసి బావిలో పడవేసిన ఘటన జరిగింది. బహుశా అక్రమ సంబంధాల నేపథ్యంలో ఏదైనా ప్రైవేటు ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించి, ఎవరికీ తెలియకుండా ఇలా చేశారేమోనని, దానికి స్థానికులు ఎవరైనా సహకరిస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి పోలీసులు మంగళగిరి, పెనుమాక తదితర ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ టీచర్ల ద్వారా ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. పలు ప్రైవేటు ఆసుపత్రిల్లో సీసీ కెమెరాల ఫుటేజిని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.