Kodela Sivaram Son Of Kodela Sivaprasad Chit Chat With Sakshi, Details Inside - Sakshi
Sakshi News home page

కోడెలకు అన్యాయం చేస్తున్నారు

Published Sat, Jun 3 2023 5:24 AM

Kodela Sivaram son of Kodela Sivaprasad with Sakshi

సాక్షి, నరసరావుపేట: తెలుగు­దేశం పార్టీ స్థాపించిన రోజు నుంచి మరణించే వరకు ఆ పార్టీ కోసం పోరాడిన డాక్టర్‌ కోడెల శివప్రసాద్, ఆయన కుటుం­­బానికి చంద్రబాబు­నాయుడు అన్యాయం చేస్తున్నా­రని శాసన సభ మాజీ స్పీకర్‌ కోడెల శివ­ప్రసాద్‌ కుమారుడు కోడెల శివరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యే­కంగా మాట్లాడుతూ.. ‘వైద్య వృత్తిలో పల్నాడు గడ్డపైనే కాకుండా ప్రపంచంలోని తెలుగువారందరికీ ఆద­ర్శంగా నిలిచిన కోడెల శివప్రసాద్‌ ఎన్టీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్‌ కోరిక మేరకు కోడెల 11 ఏళ్లు కష్టపడి బసవతారకం ఆసుపత్రిని నిర్మించారు. చనిపోయేవరకు పార్టీ, కార్యకర్తలు, పేదలకు అండగా నిలిచారు. పల్నాడు ప్రాంతం, కోటప్పకొండ అభివృద్ధి అంటే గుర్తుకొచ్చే పేరు కోడెల. అటువంటి కోడెలను పార్టీ నేతలు తీవ్రంగా అవమానిస్తున్నారు. ఆయన పేరును చెరిపివేయాలని మా పార్టీలోని కొందరు కుట్ర పన్నుతున్నారు’ అని శివరాం ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ లాంఛనాలను వద్దన్నారు
‘గత నాలుగేళ్లుగా చంద్రబాబుతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. పల్నాడు టీడీపీ అధ్యక్షుడు ఆంజనేయులు, అచ్నెన్నాయుడు, చంద్రబాబు వ్యక్తిగత సహాయకుల ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేశా. మహానాడులో రూ. 5 లక్షలు విరాళం ఇచ్చిన వారితో చంద్రబాబు కలసి భోజనం చేశారు. మా తండ్రి, మా కుటుంబం పార్టీ కోసం ఆహార్నిశలు కష్టపడినా మాకు మాత్రం అవకాశం ఇవ్వలేదు.

పార్టీ కోసం ప్రాణాలర్పించిన నాయకుడి కుటుంబానికి చంద్రబాబు 5 నిమిషాలు సమయం ఇవ్వడంలేదు. డబ్బే ప్రామాణికమైతే ఆస్తులు అమ్మి అయినా ఇస్తాం. కోడెల త్యాగానికి వెల కడితే ఆమేరకు చెల్లిస్తాం. మా తండ్రి మరణం తర్వాత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని చెప్పింది. అయితే, టీడీపీ అధిష్టానం వద్దని చెప్పడంతో మేము ఆ లాంఛనాలను తిరస్కరించాం. కన్న కొడుకుగా నా తండ్రికి దక్కాల్సిన గౌరవాన్ని వదులుకున్నందుకు బాధ కలిగింది. అయినా టీడీపీ కోసం ఆ బాధనూ భరించాం. ఇన్ని చేసినా చంద్రబాబు, లోకేశ్‌ మా కుటుంబాన్ని కావాలనే దూరం చేస్తున్నారు’ అని చెప్పారు.

బసవతారకం ట్రస్ట్‌లో చోటు ఇవ్వలేదు...
‘ఎన్నో కష్టనష్టాలకోర్చి, ఎందరినో కలుపుకొని బసవతారకం ఆసుపత్రి నిర్మించిన  కోడెల చనిపోతే.. ఆయన స్థానంలో ట్రస్ట్‌ మెంబర్‌గా మా తల్లిని నియమించలేదు. ఆ స్థానంలో చంద్రబాబు కోడలు బ్రాహ్మణిని తెచ్చారు. ఇది అన్యాయం కాదా? ఇది ట్రస్ట్‌ నిబంధనలకు విరుద్ధం. రాష్ట్రంలో ఎన్నో స్థానాలలో నాయకులు చనిపోతే వారి వారసులకు సీట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అదే పాలసీ సత్తెనపల్లిలో ఎందుకు పాటించరు? కోడెల జయంతి, వర్ధంతులకు ట్వీట్లు చేయడంతో సరిపుచ్చుతున్నారు. మా అమ్మను కనీసం ఫోన్‌ చేసి ఓదార్చలేదు. కోడెల విగ్రహాల ఏర్పాటును కూడా సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారు. ఇదేమి పార్టీ’ అని అన్నారు.
పోటీ చేస్తా.. గెలుస్తా

‘టీడీపీ, చంద్రబాబు, కోడెల అంటేనే పడని వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ. అక్రమాస్తులు కలిగి ఉన్నారని చంద్రబాబుపై కన్నా కేసులు వేశారు. చంద్రబాబును బూతులు తిట్టారు. అవకాశాల కోసం పార్టీలు మారిన వ్యక్తి కన్నా. అటువంటి వ్యక్తిని సత్తెనపల్లి టీడీపీ ఇన్‌చార్జిగా నియమిస్తారా? ఇది చాలా బాధించింది. పార్టీ శ్రేణులు కూడా హర్షించడంలేదు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి తీరుతా. నేనే గెలుస్తా. కోడెల కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానులకు అండగా నిలుస్తా. నాకు పదవులు, అధికారం ముఖ్యం కాదు. కోడెల ఆశయాల సాధనే ప్రధానం. అందుకోసమే పోరాడుతా’ అని శివరాం చెప్పారు.

Advertisement
 
Advertisement