
అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారిపై కీలక నేత ఆగ్రహం
మామూళ్లు వసూలు చేయడంలేదని మండిపాటు
మామూళ్ల కోసం కిందిస్థాయి అధికారులను నిలదీసిన నేత
ఆయన మమ్మల్నే తీసుకోనివ్వడంలేదన్న అధికారులు
సంస్కరణలు నిలిపివేయమన్న నేత.. కుదరదన్న అధికారి
రూ. 252 కోట్ల కాంట్రాక్టులు చెప్పిన సంస్థలకు ఇవ్వాలన్న నేత
ఆధునిక సాంకేతికత తప్పనిసరి అన్న అధికారి
సీనియర్ ఐపీఎస్ బదిలీకి రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: ‘ఆయన పరిశ్రమలు, వ్యాపార సంస్థలను బెదిరించరు.. తనిఖీల పేరుతో వేధించరు.. మూటలు తేరు.. కింది అధికారులను వసూలు చేయనివ్వరు.. మాకు కమీషన్లు ఇవ్వరు.. మేము చెప్పినవారికి కాంట్రాక్టులు ఇవ్వరు.. ఇంకెందుకు నాకీ పదవి?.. ఆయన ఉంటే మేము ఏ పనులూ చేసుకోలేం’.. ఇదీ అగ్నిమాపక శాఖలో ఉన్నతాధికారిపై ప్రభుత్వంలోని ఓ కీలక నేత ఆగ్రహం.
ఆయన్ని వెంటనే బదిలీ చేసి, తాను సూచించిన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ఆ నేత కోరగానే ప్రభుత్వం ఓకే అనేసింది. అంటే మరో సీనియర్ ఐపీఎస్ అధికారిపై అవమానకరంగా వేటు వేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం ఇదిగో ఇలా ఉంది..
సంస్కరణలకే ఉన్నతాధికారి మొగ్గు.. కీలక నేత కినుక
రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపార, విద్య, ఇతర సంస్థలకు అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరి. కొత్తగా సంస్థలను ప్రారంభించేటప్పుడు అనుమతులు ఇవ్వడంతోపాటు నిర్ణీత వ్యవధిలో లైసెన్సులను రెన్యువల్ చేయాలి. ఈ అనుమతుల పేరిట భారీగా జరుగుతున్న అవినీతిని అడ్డుకునేందుకు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి ఇటీవల సంస్కరణలు తీసుకువచ్చారు. లైసెన్సులు, రెన్యువల్స్ జారీ విధానంలో సమూల మార్పులు చేశారు. దాంతో పరిశ్రమలు, వ్యాపార సంస్థలను తనిఖీల పేరిట వేధింపులు, వారి నుంచి భారీ వసూళ్లు తగ్గాయి.
ఈ పరిణామం ప్రభుత్వంలో ఓ కీలక నేతకు ఏమాత్రం నచ్చలేదు. వెంటనే కిందిస్థాయి అధికారులను పిలిపించి మాట్లాడారు. నూతన సంస్కరణలతో తాము వసూళ్లకు పాల్పడటం సాధ్యం కావడంలేదని వారు ఆ నేతకు వివరించారు. మాకే రాకపోతే మీకు వాటాలు ఎలా ఇవ్వగలమని వారు కుండబద్దలు కొట్టారు. దాంతో అగ్ని మాపక శాఖ సమీక్ష సమావేశం నిర్వహించి నూతన సంస్కరణలను ఆ నేత వ్యతిరేకించారు. కానీ ఉన్నతాధికారి మాత్రం తాను ప్రవేశపెట్టిన సంస్కరణల అమలుకే కట్టుబడ్డారు. దాంతో కీలక నేత భంగపాటుకు గురయ్యారు. ఇదే పరిస్థితి కొనసాగితే తమకు ఇక ఏం కమీషన్లు వస్తాయని మండిపడ్డారు.
అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ససేమిరా
అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.252 కోట్లు కేటాయించింది. ఆ నిధులతో 17 అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు, 125 వాహనాలు, రక్షణ పరికరాలు కొనాలి. ఆ కాంట్రాక్టును తమ అస్మదీయ సంస్థలకు ఇవ్వాలని ఆ నేత భావించారు. అందుకోసం త్వరగా టెండర్ల ప్రక్రియ చేపట్టి తాను సూచించిన సంస్థలకే కేటాయించాలని ఒత్తిడి చేశారు.
కాగా, కాలంచెల్లిన సాంకేతికతతో కూడిన అగ్నిమాపక వాహనాలు ఇప్పుడు ఉపయోగపడవని ఆ ఉన్నతాధికారి భావించారు. జర్మనీ, బ్రిటన్ తదితర దేశాల్లో అనుసరిస్తున్న ఆధునికమైన వాటి కోసం ప్రణాళిక రూపొందించారు. కేవలం నీళ్ల ట్యాంకర్లు కాకుండా కార్బన్ డైఆక్సైడ్ నిల్వ చేసే ట్యాంకర్లు కొనాలని ప్రతిపాదించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వెదజల్లడం ద్వారా మంటలను త్వరగా అదుపు చేసే ఆధునిక సాంకేతికతను రాష్ట్రంలో తొలిసారి ప్రవేశపెట్టాలని ఆయన భావించారు. అందుకు అనుగుణంగానే 17 కొత్త అగ్ని మాపక కేంద్రాలను నిర్మించాలని ప్రతిపాదించారు.
ఈ ఆధునిక యంత్రాల ప్రతిపాదనలు కీలక నేతకు ఆగ్రహం కలిగించాయి. ఎందుకంటే ఆ నేత అస్మదీయ సంస్థలకు కార్బన్ డైఆక్సైడ్ నిల్వ చేసే ట్యాంకర్లు సరఫరా చేసే సామర్థ్యం లేదు. అందుకు అనుగుణంగా ఆధునిక రీతిలో అగ్ని మాపక కేంద్రాలు నిర్మించే నైపుణ్యం లేదు. ఉన్నతాధికారి ప్రతిపాదనలను ఆమోదిస్తే తమ అస్మదీయ సంస్థలకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టడం సాధ్యం కాదు. దాంతో ఆ ఉన్నతాధికారి ఉంటే తమ అవినీతి వ్యవహారాలు సాగవనే నిర్ణయానికి వచ్చారు.
అస్మదీయ అధికారి నియామకానికి పట్టు.. సరేనన్న ప్రభుత్వం
ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారిని వెంటనే బదిలీ చేయాలని కీలక నేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అత్యంత ప్రముఖ స్థానంలో ఉన్నప్పటికీ, తన మాట ఎందులోనూ చెల్లుబాటు కావడం లేదని ఆ నేత అసంతృప్తితో ఉన్నారు. పైగా, తన పరిధిలోని అన్ని విభాగాలు చిన బాబు గుప్పిట్లోనే ఉన్నాయి. కనీసం అగ్ని మాపక శాఖ వంటి చిన్న విభాగంలో అయినా తన మాట చెల్లుబాటు కావాలని పట్టుబట్టారు. దీంతో అగ్ని మాపక శాఖ ఉన్నతాధికారిని బదిలీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
ఆయన స్థానంలో తన మాట వినే జూనియర్ స్థాయి అధికారిని నియమించాలని కూడా కీలక నేత సిఫార్సు చేశారు. ఆ ఐజీ స్థాయి అధికారి ద్వారా అడ్డగోలుగా పనులు చేయించుకోవాలన్నది అసలు లక్ష్యం. ఆ నేత సిఫార్సు మేరకు ఐజీ స్థాయి అధికారిని నియమించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయని పోలీసు శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఐపీఎస్ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసింది. చంద్రబాబు ప్రభుత్వంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారిపై అవమానకరంగా వేటు వేయడానికి సర్వం సిద్ధమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.