భవిష్యత్‌ నానో యూరియాదే

Kakani Govardhan Reddy On Nano Urea - Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి

సాక్షి, అమరావతి: భవిష్యత్‌ అంతా నానో యూరియాదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. నానో టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన ఈ నానో యూరియా వినియోగంతో పర్యావరణానికి, పంటలకు అత్యంత మేలు జరుగుతుందని తెలిపారు. రవాణా, వాడకం, ధరలతో పాటు పంటల దిగుబడి విషయంలో సంప్రదాయ యూరియాతో పోలిస్తే ఎన్నోరెట్లు అదనపు ప్రయోజనం ఉంటుందని చెప్పారు.

నానో యూరియా వినియోగం, అవగాహనపై మంగళవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గే ఈ యూరియా వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఇఫ్కో డైరెక్టర్‌ ఎం.జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు. 

8 శాతం పెరిగిన దిగుబడి 
ఇఫ్కో ఏపీ మార్కెటింగ్‌ మేనేజర్‌ టి.శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ 500 ఎంఎల్‌ బాటిల్‌లో ద్రవరూపంలో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాతో సమానమని చెప్పారు. నానో యూరియా వినియోగించిన అనేక పంటల్లో ఎనిమిదిశాతం మేర దిగుబడి పెరిగిందని విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో వెల్లడైందని తెలిపారు.  నానో యూరియా వాడకంపై రూపొందించిన కరపత్రాలను మంత్రి కాకాణి విడుదల చేశారు.  

జాతీయ రహదారుల్లో మిల్లెట్‌ కేఫ్‌లు  
జాతీయ రహదారుల వెంబడి మిల్లెట్‌ కేఫ్‌ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయ్యాలని మంత్రి కాకాణి సూచించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మంగళవారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఉద్యానశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

జాతీయ రహదారుల వెంబడి మిల్లెట్‌ కేఫ్‌ల ఏర్పాటు వల్ల చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు ప్రోత్సాహకంగా ఉంటుందని పేర్కొన్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా ప్రాంతాల స్థానిక స్వయం సహాయక సంఘాలతో పాటు యువతకు అప్పగించాలని సూచించారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం అమలు చేయడం ద్వారా యూనివర్సల్‌ కవరేజ్‌ సాధించిన మొదటి రాష్ట్రం మనదేనని చెప్పారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, స్పెషల్‌ కమిషనర్‌ చేవూరు హరికిరణ్, ఏపీ సీడ్స్‌ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top