
పదవీ విరమణ సందర్భ్బంగా జస్టిస్ సోమయాజులు దంపతులను సత్కరిస్తున్న హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గం. చిత్రంలో సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
సాక్షి, అమరావతి: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు çపలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ సోమయాజుల కుటుంబ సభ్యులు, విశ్రాంత న్యాయమూర్తు లు, రిజి్రస్టార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. అడ్వొ కేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకిరామిరెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎన్. హరినాథ్ మాట్లాడారు.
అన్ని రకాల కేసులను పరిష్కరించారు : సీజే
తొలుత.. సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ మాట్లాడుతూ, న్యాయవ్యవస్థకు జస్టిస్ సోమయాజులు అందించిన సేవలను కొనియాడారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా విజయవంతంగా విధులు నిర్వర్తించారన్నారు. కుటుంబం నుంచి న్యాయ వారసత్వాన్ని కొనసాగించారని తెలిపారు. జిల్లా కో ర్టులో న్యాయవాదిగా ఉంటూ న్యాయమూర్తి అయి న తొలి వ్యక్తి రాష్ట్రంలో సోమయాజులేనన్నారు. ఆయన పదవీ విరమణతో న్యాయవ్యవస్థ ఓ మంచి న్యాయమూర్తి సేవలను కోల్పోయిందన్నారు. ఆయన విశ్రాంత జీవితం ప్రశాంతంగా, ఆయురారోగ్యాలతో కొనసాగాలని సీజే ఆకాక్షించారు.
మంచి వాదనలతోనే మంచి తీర్పులు : జస్టిస్ సోమయాజులు
అనంతరం.. జస్టిస్ సోమయాజులు మాట్లాడుతూ, ఓ న్యాయమూర్తిగా కక్షిదారులకు న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశానన్నారు. న్యాయమూర్తిగా తన ఇన్నేళ్ల ప్రస్తానంలో తనకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదులు వినిపించే మంచి వాదనలతోనే మంచి తీర్పులు ఇవ్వడం సాధ్యమైందన్నారు. జస్టిస్ సోమయాజులు దంపతులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. వారికి శాలువా కప్పి చిత్రపటం బహూకరించారు.