హైకోర్టు జడ్జిగా జిస్టిస్‌ దేవానంద్‌ ప్రమాణం | Justice Battu Devanand takes oath as Andhra Pradesh High Court Judge | Sakshi
Sakshi News home page

హైకోర్టు జడ్జిగా జిస్టిస్‌ దేవానంద్‌ ప్రమాణం

Jul 29 2025 2:41 AM | Updated on Jul 29 2025 2:42 AM

Justice Battu Devanand takes oath as Andhra Pradesh High Court Judge

హైకోర్టు జడ్జిగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌తో ప్రమాణం చేయిస్తున్న సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌

ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఠాకూర్‌ 

కార్యక్రమానికి హైకోర్టు జడ్జీలతో పాటు జస్టిస్‌ బట్టు దేవానంద్‌ కుటుంబ సభ్యులు తదితరుల హాజరు.. 29కి చేరిన హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య  

సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో సోమవారం జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ దేవానంద్‌తో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు. అంతకుముందు.. జస్టిస్‌ దేవానంద్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీచేస్తూ రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులను, తదనుగుణంగా కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రిజి్రస్టార్‌ జనరల్‌ (ఆర్‌జీ) వైవీఎస్‌బీజీ పార్థసారథి చదివి వినిపించారు. అనంతరం.. జస్టిస్‌ దేవానంద్‌తో సీజే ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ దేవానంద్‌కు సీజే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు జస్టిస్‌ దేవానంద్‌ కుటుంబ సభ్యులు, అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివప్రతాప్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నల్లారి ద్వారకనాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, మద్రాసు హైకోర్టు న్యాయవాదులు.. తమిళనాడు, పుదు­చ్చేరి న్యాయవాద మండళ్ల ప్రతినిధులు, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.

అనంతరం.. హైకోర్టు న్యాయవాదుల సంఘం నిర్వహించిన తేనీటి విందులో జస్టిస్‌ దేవానంద్‌ పాల్గొన్నారు. హైకోర్టు న్యాయ­మూర్తిగా ప్రమాణం చేసిన సందర్భంగా ఆయన్ను పలువురు న్యాయవాదులు, శ్రేయోభిలాషులు, బంధువులు పుష్పగుచ్ఛాలతో అభినందించారు. ప్రమాణం అనంతరం మరో న్యాయమూర్తితో కలిసి ఆయన ధర్మాసనంలో కేసులను విచారించారు. ఇక జస్టిస్‌ బట్టు దేవానంద్‌ హైకోర్టులో నాల్గవ స్థానంలో కొనసాగుతారు. ఆయన నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. 

అడ్వొకేట్స్‌ ప్రొటెక్షన్‌ బిల్లుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి.. 
ఇదిలా ఉంటే.. జస్టిస్‌ దేవానంద్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అమల్‌రాజ్, వైస్‌ చైర్మన్‌ వి. కార్తికేయన్, మద్రాసు రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హసన్‌ మహ్మద్‌ జిన్నా, తమిళనాడు హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి కృష్ణకుమార్, కార్యనిర్వాహక సభ్యుడు రమేష్‌ తదితరులు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ను సందర్శించారు. వారిని రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నల్లారి ద్వారకనాథరెడ్డి, వైస్‌ చైర్మన్‌ కృష్ణమోహన్, సభ్యులు చిదంబరం, యర్రంరెడ్డి నాగిరెడ్డి తదితరులు ఘనంగా సన్మానించారు.

శాలువా కప్పి వారికి బుద్ధుని జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా వారందరూ కూడా దక్షిణాది రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్ల సమావేశాన్ని చెన్నైలో నిర్వహించాలని నిర్ణయించారు. న్యాయవాదుల వృత్తిపరమైన ఇబ్బందులపై చర్చించారు. న్యాయవాదుల రక్షణ కోసం ఉద్దేశించిన అడ్వొకేట్స్‌ ప్రొటెక్షన్‌ బిల్లును త్వరగా తీసుకొచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. 

శాశ్వత న్యాయమూర్తులుగా నలుగురు
జస్టిస్‌ హరినాథ్, జస్టిస్‌ కిరణ్మయి, జస్టిస్‌ సుమతి, జస్టిస్‌ విజయ్‌ పేర్లను సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్, జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ జగడం సుమతి, జస్టిస్‌ న్యాపతి విజయ్‌ను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌ నేతృత్వంలో జరిగిన కొలీజియం సమావేశంలో తీర్మానం చేశారు.

సుప్రీం­కోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి నియామక ఉత్తర్వులు జారీచేసిన తరువాత ఈ నలుగురు న్యాయమూర్తులు కూడా శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తారు. ప్రస్తుతం హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తులు 20 మంది ఉన్నారు. ఈ నలుగురితో ఆ సంఖ్య 24కి చేరుతుంది. మరో ఐదుగురు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. వీరు కూడా 2026–27లో శాశ్వత న్యాయమూర్తులు అవుతారు. జస్టిస్‌ హరినాథ్, జస్టిస్‌ కిరణ్మయి, జస్టిస్‌ సుమతి, జస్టిస్‌ విజయ్‌లు 2023 అక్టోబరు 21న హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన విషయం తెలిసిందే.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement