పనుల కోసం జనసేన అభిమానులు టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు
నియోజకవర్గాల్లో జనసేనను బలోపేతం చేసే పరిస్థితి కనిపించడం లేదంటూ వాపోయిన ఎమ్మెల్యేలు
మీరు మాత్రం టీడీపీ నేతలతో సఖ్యతగా ఉండండి
ఎమ్మెల్యేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన
సాక్షి, అమరావతి: ‘‘మనం గెలిచిన నియోజకవర్గాల్లో సైతం టీడీపీ నేతలే పెత్తనం చేస్తున్నారు.. ఇలాగే కొనసాగితే క్షేత్రస్థాయిలో జనసేన బలోపేతానికి అవసరమయ్యే కమిటీ నిర్మాణం సమర్థవంతంగా చేపట్టే పరిస్థితి లేదు’’ అంటూ జనసేన ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఎదుట వాపోయారు.
శుక్రవారం ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్రం కార్యాలయంలో జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ), దేవ వరప్రసాద్ (రాజోలు), లోకం నాగమాధవి (నెలిమర్ల), గిడ్డి సత్యనారాయణ(పి.గన్నవరం), పంతం నానాజీ(కాకినాడ రూరల్), సీహెచ్ వంశీకృష్ణ (విశాఖ సౌత్), నిమ్మక జయకృష్ణ(పాలకొండ), పంచకర్ల రమేష్ బాబు(పెందుర్తి), సుందరపు విజయ్ కుమార్ (యలమంచిలి)తో వేర్వేరుగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో జనసేనపార్టీ పరిస్థితి గురించి పవన్ కళ్యాణ్ ప్రశి్నంచినప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జనసేన ఉనికి సైతం ప్రమాదంలో పడేలా ఉందని వాపోయినట్లు భోగట్టా. టీడీపీ నేతలు పెత్తనం చేస్తుండడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో జనసేన నాయకులు పనులు చేయించేకునేందుకు టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారని అధినేతకు వివరించినట్టు సమాచారం.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో కనీసం సగం సీట్లు అయినా జనసేనకు ఇచ్చే పరిస్థితి ఉండడంతో పాటు ఆ మేరకు స్పష్టమైన హామీ ఉంటే గానీ గ్రామస్థాయిలో బలమైన పార్టీ కమిటీలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదని అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వివరించినట్టు సమాచారం.
ఈ సందర్భంగా అధినేత పవన్‌కళ్యాణ్ స్పందిస్తూ, అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని, అయితే జనసేన ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గాల్లో కూటమి నేతలతో సఖ్యతతో ఉండాలని సూచించినట్టు సమాచారం. నియోజకవర్గాల్లో టీడీపీ నేతలతో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించుకుంటూ మిగిలిన రెండు కూటమి పార్టీల నేతలతో నిబద్ధతతో కలిసి పని చేయాలని పవన్‌కళ్యాణ్ సూచించినట్టు సమాచారం.
ఆ ప్రతిపాదనలు నాకివ్వండి..
మరోవైపు అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిస్థితిపై వాకబు చేశారు. దీనిపై ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు అధికారులు నిధులు లేవంటున్నారని తెలిపారు.
అలాంటి వాటికి అవసరమైన ప్రతిపాదనలు తనకు నేరుగా అందజేస్తే వాటిని తానే సీఎం చంద్రబాబుకు అందజేసి, ప్రత్యేక నిధులు కోరతానని పవన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అవినీతి కార్యక్రమాల ద్వారా పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించవద్దంటూ అధినేత స్పష్టం చేసినట్లు సమాచారం.


