ప్రతిసారీ దేబిరించాలా? జనసైనికుల ఆగ్రహం
అడుగుతున్నవే ఆరు.. అందులోనూ కోతలా?
అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగాలు.. స్థానిక ఎన్నికల్లోనూ అన్యాయమేనా?
జనసైనికుల్లో ముదురుతున్న అసంతృప్తి!
అధినాయకత్వం ఇప్పటికైనా స్పందించాలంటున్న జనసైనికులు.. సీట్ల పంపకంపై తేలని కూటమి చర్చలు.. బుధవారానికి వాయిదా
6 మేయర్లు, 38 మున్సిపాలిటీలు అడుగుతున్న జనసేన
మూడు మేయర్లే ఇస్తామంటున్న టీడీపీ.. బీజేపీకి ఒక్కటే
సీట్ల పంపకాల చర్చలకు ముందే రిజర్వేషన్లు ఖరారు..
తమను సంప్రదించలేదంటున్న జనసేన, బీజేపీ నేతలు
రిజర్వేషన్లు మార్చేది లేదని తేల్చిచెప్పిన సీఎం
సాక్షి, అమరావతి: ‘‘ముష్టి వేస్తున్నారా...? ప్రతిసారీ ఇదే నరకమా..? మాకు రావలసిన న్యాయమైన వాటా కోసం ఇంత దేబిరించాలా? ’’ ఇదీ జనసేన నేతల అంతర్మథనం. ‘‘అడుగుతున్నవే కొన్ని.. వాటిలోనూ కోతలు.. బలం ఉన్న స్థానాలనే అడుగుతుంటే వాటిని కూడా మార్చేస్తున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును కలుసుకుని తాము ఆశిస్తున్న స్థానాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇచ్చిన తర్వాత కూడా ఇంత పీకులాట అవసరమా’’ అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిసారీ మోసపోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తగ్గించుకున్నామని, ఇపుడు కూడా తగ్గించుకోవాలంటే ఎలా అని పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తాడో పేడో తేల్చుకుని అన్ని స్థానాల్లో రంగంలోకి దిగితే మేలని, అందుకు ఇదే సరైన సమయమని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పార్టీ కోసం కష్టపడి కొన్ని స్థానాల్లో పట్టు సాధిస్తే వాటిపై పట్టుబట్టాల్సింది పోయి పార్టీ అధినాయకత్వం కూడా పట్టించుకోకపోతే ఎలా.. టీడీపీ చెప్పినదానికల్లా తలాడిస్తే ఎలా? ఇప్పటికైనా గట్టిగా స్పందించవద్దా? అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.
కొలిక్కి రాని చర్చలు.. వాయిదా..
మరోవైపు సీట్ల పంపకంపై మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు బుధవారానికి వాయిదా పడ్డాయి. కూటమి పార్టీల మధ్య కసరత్తు కొలిక్కి రాలేదు. జనసేన అడుగుతున్న 6 మేయర్, 38 మున్సిపల్ చైర్మన్ స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా లేదని తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, పల్లా శ్రీనివాసరావు మంగళవారం పొద్దుపోయేవరకు చర్చలు జరిపారు. అలాగే రిజర్వేషన్లు ప్రకటించడంతో.. జనసేన తమకు బలమైన అభ్యర్థులు ఉన్నారని అనుకుంటున్న స్థానాల్లో పరిస్థితి తలకిందులయ్యేలా మారింది. ఇది మరింత గందరగోళానికి కారణమయ్యింది. చర్చలు జరుగుతుండగానే రిజర్వేషన్లు ఖరారు చేసేసి తమ ఆశలకు గండి కొట్టారని జనసేన నాయకులు మండిపడుతున్నారు.
అలిగినట్టు.. రాయబారం జరిగినట్టు..
మంగళవారంనాటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అలిగినట్లు ప్రచారం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం జనసేన కార్యాలయానికి వచ్చారు. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, లింగమనేనితో మాట్లాడుకోవాలని సూచించి పవన్ చర్చలకు దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది.
ఇప్పటికైనా అధినాయకత్వం స్పందించాలి..
బలం ఉన్న చోటేగా అడుగుతున్నాం.. పార్టీకోసం కష్టపడిన నాయకులను ఇలా గాలికి వదిలేస్తారా అని జనసేన నాయకులు మధనపడుతున్నారు. అడుగుతున్నవే కొన్ని కదా.. వాటినీ ఇవ్వకపోతే ఎలా.. పార్టీ అధినాయకత్వం దీనిపై గట్టిగా నిలబడాలి.. ఇప్పటికైనా గట్టిగా స్పందించాలి అని నాయకులు, శ్రేణులు కోరుతున్నారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కూడా పరిస్థితి ఇలా ఉండడమేమిటి అని నాయకులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఇదంతా పార్టీ అధినాయకత్వానికి తెలిసే జరుగుతోందా అన్న అనుమానాలు కూడా శ్రేణుల్లో రేకెత్తుతున్నాయి.
అడిగిన చోటే వేటు
మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాల కోసం జనసేన, బీజేపీ ముందుగానే జాబితాలు అందించాయి. కానీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు చంద్రబాబు రిజర్వేషన్లు ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేయించేశారు. దీంతో జనసేన, బీజేపీ ముందుగా అనుకున్న స్థానాలన్నీ రిజర్వేషన్లతో తారుమారైనట్లు తెలుస్తోంది. తాము కోరిన స్థానాలను రిజర్వు చేయడం సరికాదని, ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. సీట్లు ఇవ్వలేమని చెప్పకుండా, రిజర్వేషన్ల ముసుగులో తమ నాయకులను పోటీ నుంచి తప్పించారని మండిపడుతున్నాయి. సీటు ఇచ్చినట్టే ఇచ్చి, అక్కడ నిలబెట్టేందుకు అభ్యర్థే లేకుండా చేయడం నమ్మకద్రోహం కాక మరేమిటని నిలదీస్తున్నాయి.
పిఠాపురం ఎస్సీ రిజర్వుడు..
పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీ పరిధిలోని పిఠాపురం మున్సిపాలిటీని ఎస్సీ రిజర్వుడుగా ఖరారు చేయించారు. ఇదంతా పవన్‌కు తెలియకుండా జరిగిందా అని పార్టీ నాయకులు, శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి సొంత ఇలాకా విషయంలోనే ఈ పరిస్థితి ఉంటే సాధారణ జనసేన నేతల పరిస్థితి ఏంటని ఆ పార్టీ కార్యకర్తలు ఆక్రోశిస్తున్నారు. జనసేన కోరుతున్న పలు మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పీఠాల విషయంలో ఇలాగే ఏకపక్షంగా రిజర్వేషన్లు మార్చినట్లు సమాచారం. జనసేన ఆశిస్తున్న కాకినాడ, మచిలీపట్నం స్థానాలను బీసీ మహిళలకు కేటాయించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే జనసేన ఎమ్మెల్యేలున్న ప్రాంతాల్లో వారిని సంప్రదించకుండానే రిజర్వేషన్లు ఖరారు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజమండ్రిలో బీజేపీకి షాక్
బీజేపీ విషయంలోనూ అదే తంతు. రాజమండ్రి మేయర్ స్థానంపై బీజేపీ ఆశలు పెట్టుకోగా ఆ స్థానాన్ని కూడా ఎస్సీకి రిజర్వ్ చేశారు. దీంతో అక్కడ పోటీకి సిద్ధమైన బీజేపీ నేతల ఆశలు ఆవిరయ్యాయి. తమను సంప్రదించకుండానే రిజర్వేషన్లు ఖరారు చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
చేసిందంతా చేసి.. నీతులు
ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్లు మార్చాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ నేత మాధవ్ చంద్రబాబును కోరినట్లు తెలిసింది. ఆయన మాత్రం అందుకు అంగీకరించకుండా చట్టబద్ధమైన ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉండకూడదని సెలవిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చేసేదిలేక కొత్త స్థానాలు, కొత్త అభ్యర్థులను వెతుక్కునేందుకు కాస్త గడువు ఇవ్వాలంటూ జనసేన, బీజేపీలు అడుగుతున్నాయి.
విజయవాడపైనా మెలిక
జనసేనకు విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ ఇస్తామని ప్రాథమికంగా ఆశ చూపిన టీడీపీ, ఇప్పుడు అందులోనూ మెలిక పెడుతున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంతమైన ఉమ్మడి కృష్ణాలో రెండు కీలక కార్పొరేషన్లు జనసేనకు ఎలా ఇస్తామంటూ టీడీపీ నేతలు అడ్డం తిరుగుతున్నారు. విజయవాడ మేయర్ స్థానం అన్‌రిజర్వ్‌డ్ కావడం, జనసేన తరఫున వంగవీటి రాధా సతీమణి పోటీ చేస్తారన్న ప్రచారంతో అక్కడి టీడీపీ ఎమ్మెల్యేలు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. కాగా, బీజేపీ తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లు కావాలని కోరగా రెండింటికీ నో చెప్పినట్లు సమాచారం. వేరే ఏదైనా కార్పొరేషన్ చూసుకోవాలని సూచించినట్లు తెలిసింది.


