జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష విజయవంతం

Jakkampudi Raja Protest Against Paper Mill Management - Sakshi

దిగివచ్చిన పేపరుమిల్లు యాజమాన్యం  

8 డిమాండ్లకు 7 అంగీకారం 

24 గంటలపాటు ఆమరణ దీక్ష  

ఉదయం నుంచి మిల్లు వద్ద మోహరించిన పోలీసులు, పార్టీ శ్రేణులు

సాక్షి, రాజమహేంద్రవరం సిటీ: కార్మికుల సంక్షేమం, వారి న్యాయమైన కోర్కెల సాధన కోసం కాపు కార్పొరేషన్‌ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష విజయవంతమైంది. రాజా దీక్షకు యాజమాన్యం దిగివచ్చింది. కార్మికుల రెగ్యులరైజేషన్‌ డిమాండ్‌ నిరాహార దీక్షతో నెరవేరింది. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరాయంగా  పోరాటం సాగిస్తామని జక్కంపూడి రాజా అన్నారు. శనివారం రాజమహేంద్రవరం పేపరుమిల్లు వద్ద కార్మికులు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలంటూ మిల్లు ఎదుట పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. రాజమహేంద్రవరం ఏపీ పేపరుమిల్లులో కాంట్రాక్ట్‌ పద్ధతిపై పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్‌ చేయాల్సి ఉండగా యాజమాన్యం నిర్లక్ష్యం, నిరంతృత్వధోరణి అవలంబిస్తూ వచ్చింది. కార్మికుల తరఫున ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్సార్‌ సీపీ సిటీ కో ఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఏడాది కాలంగా పలు దఫాలు చర్చలు నిర్వహించారు. పేపరుమిల్లు యాజమాన్యం సమయం కావాలంటూ కాలయాపన చేస్తూ వచ్చింది.

చివరగా జరిపిన చర్చల్లో 15వ తేదీ గురువారం తమ నిర్ణయం ప్రకటిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో శుక్రవారం మరోమారు మిల్లు ఆవరణలో చర్చలు ప్రారంభించారు. పలు దఫాలు మిల్లు యాజమాన్యం తరుఫున జీఎమ్‌ సూరారెడ్డి, అక్కిన జయకృష్ణ చర్చలు నిర్వహించినా విఫలయ్యాయి. దీంతో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సాయంత్రం ఐదు గంటలలోపు న్యాయమైన కోర్కెలు అంగీకరించకపోతే శాంతియుతంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. సమయం పూర్తయినా ప్రకటన వెలువడకపోవడంతో దీక్ష దిగిన విషయం తెలిసిందే. రాజాతో పాటు సీఐటీయూ నాయకుడు సంఘీభావంగా దీక్ష చేపట్టారు. 

చర్చలు సఫలం  
మిల్లు యాజమాన్యం తరఫున జీఎం సూరారెడ్డి, జయకృష్ణ, కార్మిక శాఖ తరఫున ఎం.రామారావు, శ్రీనివాస్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, టి.అరుణ్‌తో నిర్వహించిన చర్చలు విజయవంతమయ్యాయి. ప్రధానంగా 50 ఏళ్లు దాటిన వారిని రెగ్యులరైజ్‌ చేయడం, మహిళలను విధుల్లోకి తీసుకోవడానికి అంగీకరించారు. యాజమాన్యం వద్ద రాజా పెట్టిన ఎనిమిది డిమాండ్లలో ఏడు డిమాండ్లను అంగీకరించి బదిలీల విషయాన్ని రెండు రోజుల్లో లేబర్‌ కమిషనర్‌ వద్ద మాట్లాడనున్నట్లు యాజమాన్యం తెలిపింది.
 
దీక్ష విరమణ 
మిల్లు కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడానికి యాజమాన్యం ఒప్పుకోవడంతో దీక్ష విరమణకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సీఐటీయూ నాయకుడు టి.అరుణ్‌ అంగీకరించారు. దీంతో జక్కంపూడి రాజాకు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, టి.అరుణ్‌కు పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. 

వైద్య పరీక్షలు 
రెండో రోజుకు చేరడంతో వైద్యులు బీపీ, సుగర్‌ పరీక్షలు నిర్వహించారు. అనంతరం కరోనా పరీక్షలు జరిపారు. డీసీసీబీ చైర్మన్‌ అనంత ఉదయ భాస్కర్, అనపర్తి ఎమ్మెల్యేలు డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి, కొండేటి చిట్టిబాబు,  ధనలక్ష్మి, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ రాష్ట్ర నాయకులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, వైఎస్సార్‌ సీపీ సిటీ కో ఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల సత్యనారాయణ, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, యువజన నేత పోలు కిరణ్‌ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top