ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయండి

ISRO Chairman Somnath Suggestion to students - Sakshi

విద్యార్థులకు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ సూచన

యువికా–2022లో భాగంగా విద్యార్థులతో ముఖాముఖి

సూళ్లూరుపేట: భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతోందని, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఒక్కో మిస్సైల్‌లా తయారై దేశానికి సేవ చేయాలని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ సూచించారు. ఇస్రోలో చేరి.. మన దేశానికి మరింత గుర్తింపు తీసుకురావాలన్నారు. పదో తరగతిలోకి అడుగుపెడుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 153 మంది విద్యార్థులతో శనివారం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ముచ్చటించారు.

విద్యార్థులకు స్పేస్‌ సైన్స్‌పై ఆసక్తి కలిగించేదుకు నిర్వహిస్తున్న యువికా–2022లో భాగంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. ఈ తరం విద్యార్థులు ఎంతో తెలివైనవారని.. వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీస్తే మంచి స్థాయికి వెళతారని చెప్పారు. రాకెట్లు, ఉపగ్రహాలు, ఆర్బిట్లు అనేవి మ్యాథమెటిక్స్‌తో ఎక్కువగా ముడిపడి ఉంటాయని.. అందులో మంచి ప్రావీణ్యం సాధిస్తే శాస్త్రవేత్తలుగా ఎదగడానికి అవకాశముంటుందన్నారు.

2023 నాటికి గగన్‌యాన్‌ ప్రయోగం చేయాలనే సంకల్పంతో ఉన్నామని.. కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలుపుతూ రూ.10 వేల కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఈ ఏడాది చంద్రయాన్‌–2 ప్రయోగం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్, శాస్త్రవేత్తలు అలెక్స్, ఎన్‌.సుధీర్‌కుమార్, సెంథిల్‌కుమార్, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top