జన సైనికులే 420లు.. చెక్కులు నిరాకరించిన పలువురు ఇప్పటం గ్రామస్తులు

Ippatam Village People Fires On Pawan Kalyan - Sakshi

పవన్‌ కళ్యాణ్‌పై ఇప్పటం ప్రజల మండిపాటు 

తాడేపల్లి రూరల్‌: ‘జనసైనికుల మాట వినలేదని రైతుల్ని, ఇప్పటం గ్రామస్తుల్ని 420 అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 420 లాగా వ్యవహరించి, కోర్టును పక్కదోవ పట్టించింది జనసేన పార్టీ వారు. అందుకే కోర్టుకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ రూ.లక్ష జరిమానా పడింది. కోర్టును సైతం తప్పుదోవ పట్టించిన వారు 420లా? లేక గ్రామస్తులా? అనేది పవన్‌ కళ్యాణే చెప్పాలి’ అని ఇప్పటం ప్రజలు ప్రశ్నించారు.

రోడ్డును ఆక్రమించిన వారి ప్రహరీలు మాత్రమే తొలగిస్తే, ఇళ్లు తొలగించారని పవన్‌ కళ్యాణ్‌ నానాయాగీ చేస్తూ వారికి ఆదివారం రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేయగా, పలువురు ఆ చెక్కులు తీసుకునేందుకు నిరాకరించారు. మున్నంగి వెంకటరెడ్డి, మున్నంగి జగన్‌మోహన్‌రెడ్డి, మున్నంగి శ్రీకాంత్‌రెడ్డి, లచ్చి వెంకటేశ్వర్లు, లచ్చి సాంబయ్య, మున్నంగి బాలకోటిరెడ్డి, మున్నంగి శివారెడ్డి, రెడ్డిబత్తుల సుబ్బారెడ్డి, మున్నంగి శివశంకరరెడ్డిలు తమకు ఆ సాయం అవసరం లేదని స్పష్టం చేశారు. 

ఇకనైనా విష ప్రచారం మానండి 
‘అసలు పోలీస్‌స్టేషన్‌ గుమ్మం ఎక్కని ఇప్పటం గ్రామాన్ని హైకోర్టు వరకు తీసుకువెళ్లి విష ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ ప్రచారాలు మానుకుని వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. పవన్‌ కళ్యాణ్‌ ఆ రోజు సభలో ఇప్పటం అభివృద్ధికి రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఆ డబ్బులు అడుగుతున్నందుకే పంటపొలాలు ఇచ్చిన రైతుల ఇళ్లను కూల్చారంటూ విషప్రచారం చేశారు.

ఇప్పటికే ప్రభుత్వం రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసింది. మరో రూ.6కోట్లు కేటాయించింది. మంగళగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ప్రహరీలు, షాపులను తొలగించారు. వారందరికీ కూడా పవన్‌కళ్యాణ్‌ లక్ష రూపాయల చొప్పున కేటాయిస్తే ఎంతో సంతోషిస్తాము. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 325 చిన్న చిన్న గుడిసెలను తొలగించారు. వారికి కూడా లక్ష రూపాయలు ఇస్తే ఆ కుటుంబాలు మీ పేరు చెప్పుకుంటాయి’ అని ఇప్పటం వాసులు వ్యాఖ్యానిస్తున్నారు.

మొదట తొలిగించింది నా ప్రహరీనే
ఇప్పటంలో మొట్టమొదటగా తొలగించింది నా ప్రహరీనే. గతంలో పంచాయతీగా ఉన్నప్పుడు రోడ్డును ఆక్రమించి ప్రహరీ గోడలను కట్టాం. ఇప్పుడు కార్పొరేషన్‌ అయ్యింది. కార్పొరేషన్‌కు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. గతంలో మా గ్రామానికి రూ.10 లక్షల నిధులు ఇస్తే ఎక్కువ. ఏకంగా ఈ మూడు సంవత్సరాల్లో రూ.3 కోట్లు ఖర్చుపెట్టారు. మరో రూ.6 కోట్లు కేటాయించారు. రహదారులు అభివృద్ధి చేస్తే ప్రజలందరికి ఎంతో మేలు జరుగుతుంది. 
– లచ్చి వెంకటేశ్వర్లు, ఇప్పటం 

మా కుటుంబాన్ని అవమానిస్తున్నారు
పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన చెక్కులను మేము నిరాకరించాం. మేము గ్రామ అభివృద్ధి కోరుకున్నాం. రోడ్డును ఆక్రమించి మేము ప్రహరీ నిర్మించిన మాట వాస్తవమే. అందువల్లే ప్రహరీని తొలగించారు. మాకేం బాధ లేదు. మా ఇంటి మీద ఒక్క ఇటుకను కూడా కదిలించలేదు. అదేమాట చెప్పినందుకు మా కుటుంబ సభ్యులపై 420లు, ప్యాకేజీ బాబులు అంటూ జనసేన పార్టీ సోషల్‌ మీడియా వారు మా కుటుంబాన్ని అవమానిస్తున్నారు.  
– మున్నంగి వెంకట రమణమ్మ, ఇప్పటం 

రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతోంది
ఎక్కడో మండలానికి చివరన ఉన్న ఇప్పటం గ్రామంలో గతంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పవన్‌ కళ్యాణ్‌ మూలంగా ఇప్పటాన్ని హైకోర్టుకు పరిచయం చేశారు. నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదంటూ కోర్టుకు వెళ్లారు. కోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా అసత్యాలు మాట్లాడుతున్నారంటే ఏమనాలి? గ్రామాల్లో పవన్‌ కళ్యాణ్‌ చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అర్థమవుతోంది. గోడలు తొలగిస్తే ఇళ్లు తొలగించారని టీడీపీ, జనసేన ప్రచారం చేయడం విడ్డూరం. 
– లచ్చి సాంబయ్య, ఇప్పటం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top