రా...రమ్మని | Inviting tourist spots in Manyam | Sakshi
Sakshi News home page

రా...రమ్మని

Nov 13 2025 5:58 AM | Updated on Nov 13 2025 5:59 AM

Inviting tourist spots in Manyam

మన్యంలో ఆహ్వానిస్తున్న టూరిస్ట్‌ స్పాట్‌లు 

ఇప్పటికే ఆరంభమైన సందర్శకుల రాక

చుట్టూ ఎత్తైన కొండలు... ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉండే భారీ వృక్షాలు...పరమశివుని జటాజూటం నుంచి జాలువారుతున్నట్టు  జలపాతాల హొయలు... పాల సంద్రం భువిలో వెలిసిందా అనేలా శ్వేతవర్ణ మేఘాల సోయగాలు... పచ్చి గాలి మధురాను భూతి...మట్టి గంధం సువాసన...  పక్షుల కిలకిలా రావాలు, ఆకుల సవ్వడులు... ఇలా పంచేంద్రియాలను ప్రకృతితో మమేకం చేసే మరెన్నో ప్రత్యేకతల స్వర్గధామం... అల్లూరి మన్యం. పర్యాటక సీజన్‌లో ఈ అందాలు  ద్విగుణీకృతమవుతాయి. కొద్ది రోజులు సాధారణ జీవితం గురించి మరిచిపోయి ఎంచక్కా ప్రకృతితో మమేకమవ్వాలను కుంటున్న వారికి ఇది సరైన సమయం.

సాక్షి,పాడేరు: మన్యంలో పర్యాటక సీజన్‌ ప్రారంభమైంది. నవంబర్‌ మొదటి వారం నుంచి జనవరి నెలాఖరు వరకూ నెలకు రెండు లక్షల మంది  పర్యాటకులు అల్లూరి జిల్లాలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. దీంతో సుమారు నెలకు రూ.5 కోట్లపైనే   బిజినెస్‌ జరుగుతుంది.   సహజ ప్రకృతి అందాలకు నిలయమైన ఏజెన్సీలో ఈ సీజన్‌లో అప్పుడే  పర్యాటకుల సందడి ఆరంభమైంది. 

జిల్లాలో బొర్రాగుహలు, వంజంగి హిల్స్, లంబసింగి, చాపరాయి జలపాతం తదితర ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తున్నారు.   పర్యాటకుల కోసం ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా వంజంగి హిల్స్‌ వద్ద అటవీశాఖ రూ.35 లక్షల వ్యయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.   

నలుచెరగులా... 
జిల్లాలోని 22 మండలాలున్నాయి. పర్యాటకంలో ప్రతీ మండలానికి ఓ ప్రత్యేకస్థానం ఉంది. అనంతగిరి నుంచి ఎటపాక వరకు అన్ని మండలాల్లోను పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి ఏడాది దేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తారు. ఇక్కడి ప్రకృతి అందాలకు పర్యాటకులంతా ఫిదా అవుతారు. 

» పాడేరు మండలంలోని వంజంగి హిల్స్‌ విశ్వవ్యాప్తంగా గుర్తింపుపొందాయి. ఈకొండలపై సూర్యోదయం, మేఘాల అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. 

» అరకులోయ మండలంలోని మాడగడ,చింతపల్లి మండలంలోని చెరువులవెనం, హుకుంపేట మండలంలోని సీతమ్మకొండ ప్రాంతాలు మంచి వ్యూపాయింట్‌లుగా పర్యాటకులను అలరిస్తున్నాయి. ఇక్కడ పొగమంచు,సూర్యోదయం అందాలు అబ్బుర పరుస్తున్నాయి. అనంతగిరి మండలంలోని బొర్రాగుహలతో పాటు అరకులోయలోని పద్మాపురం గార్డెన్,గిరిజన మ్యూజియం,లంబసింగి,సిలేరు,మారేడుమిల్లి.మోతుగూడెం పర్యాటక ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి నెలకొంది. 

జలపాతాల హోరు 
జిల్లా వ్యాప్తంగా ఉన్న జలపాతాలను సందర్శించేందుకు  పర్యాటకులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. పెదబయలు మండలంలోని పిట్టల»ొర్ర, అనంతగిరిలోని కటికి, తాడిగుడ, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి, సీలేరు ప్రాంతంలోని ఐస్‌గెడ్డ, మోతుగూడెంలోని పొల్లూరు, మారేడుమిల్లి ప్రాంతాలలో జలపాతాలకు పర్యాటకుల తాకిడి నెలకొంది. దేవీపట్నం, వి.ఆర్‌.పురం ప్రాంతాలలో పాపికొండల విహార యాత్రకు లాంచీలపై పర్యాటకులు తరలివెళుతున్నారు. 

వలిసె పూల అందాలు అదుర్స్‌ 
ఈసీజన్‌లో వలిసెపూలు పర్యాటకుల మదిని దోచుకుంటున్నాయి.భూమికి పసుపు రంగేసినట్టు ఉండే వలిసెపూల తోటల్లో ఫొటోలు తీసుకునేందుకు  సందర్శకులు ఎంతో ఇష్టపడుతున్నారు.   

ఏటా భారీగా వ్యాపారం 
పర్యాటకులు అధికంగా తరలివస్తుండడంతో  జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సీజన్‌లో  వ్యాపారలావాదేవీలు  భారీగా జరుగుతాయి. నెలకు రూ.5 కోట్లపైనే వ్యాపారం జరుగుతుంది. పాడేరు, అనంతగిరి, అరకులోయ, జి.మాడుగుల, చింతపల్లి, రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో  హోటళ్లు, ఇతర వ్యాపారులకు అధిక ఆదాయం సమకూరుతుంది. పర్యాటక ప్రాంతాల్లో స్థానిక గిరిజనులు కూడా పలు రకాల ఫుడ్‌ కోర్టులు,చికెన్‌ వంటకాలు,అటవీ,వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలతో జీవనోపాధి పొందుతున్నారు.  

ప్రకృతి అందాలు కొలువైన ‘గుడి’సె
రంపచోడవరం:  దట్టమైన అడవి.. మధ్యలో ఎత్తైన కొండపై మెలికలు తిరిగే ఎర్రమట్టి దారి.. మార్గమధ్యంలో ఆకట్టకునే జలపాతం ఇవన్నీ కలిపి  ప్రకృతి అందాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారేడుమిల్లి కొండలు మారాయి. మారేడుమిల్లికి సుమారు 36 కిలోమీటర్లు దూరంలో తూర్పు కనుమల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని గడ్డి కొండలు(గ్రాస్‌ ల్యాండ్స్‌)లో  ఉన్న గుడిసె అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.  ఎౖత్తైన కొండల మధ్య సూర్యోదయాన్ని, ప్రకృతి అందాలను తనివి తీరా చూసేందుకు రాష్ట్రాలు దాటి మరీ పర్యాటకులు  వస్తున్నారు.   

మారేడుమిల్లికి  36 కిలోమీటర్ల దూరం  
మారేడుమిల్లికి 36 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుడిసె పర్యాటక ప్రాంతాన్ని తిలకించేందుకు సందర్శకులు  అధిక సంఖ్యలో వస్తున్నారు. మారేడుమిల్లి నుంచి 22 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తరువాత ఆకుమామిడి కోట గ్రామం వస్తుంది. అక్కడ నుంచి మరో 14 కిలోమీటర్లు ప్రయాణిస్తే గుడిసె కొండలను చేరుకోవచ్చు. ఆకుమామిడి కోట వద్ద  ఉన్న ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద వాహనాలకు రూ. 300, మనిషికి రూ. 100 చెల్లించిన తరువాత ఆ రోడ్డులో ప్రయాణిస్తే పుల్లంగి గ్రామం వస్తుంది. 

అక్కడ నుంచి గుడిసె వెళ్లేందుకు ఎత్తైన కొండల మధ్య ఘాట్‌ రోడ్డులో ప్రయాణించాలి. కొండ పై భాగానికి చేరుకున్న తరువాత అక్కడ విశాలమైన గడ్డితో కూడిన మైదానం కనిపిస్తుంది. ఇక్కడి అందాలు, సూర్యోదయం దృశ్యాలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.  గతంలో రాత్రి సమయంలో అక్కడే పర్యాటకులు ఉండేందుకు అటవీ శాఖ వారు అనుమతించారు. పర్యాటకుల సంఖ్య పెరిగిపోవడంతో అక్కడ విపరీతంగా ప్లాసిక్ట్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో  రాత్రి బసను రద్దు చేశారు.

ఆకుమామిడి కోట పరిసర ప్రాంతాల్లో రాత్రి బస చేసి, తెల్లవారుజాము 4 గంటల సమయంలో గుడిసెలో సూర్యోదయాన్ని చూసేందుకు పర్యాటకులు వెళతారు. గుడిసె ప్రాంతంలో పర్యాటకులు గడిపేందుకు నవంబర్‌ నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకూ అనుకూలంగా ఉంటుంది. ఆకుమామిడి కోట నుంచి గుడిసె కొండమీదకు ప్రైవేట్‌ వాహనాల్లో పర్యాటకులను తీసుకువెళ్లేందుకు రూ. 3వేల వరకు చార్జి చేస్తున్నారు.   

క్యాంపెయిన్‌ టెంట్లకు గిరాకీ  
సీజన్‌లో రోజుకు కనీసం వెయ్యి మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. దీంతో ఇక్కడ క్యాంపెయిన్‌ టెంట్లకు గిరాకీ పెరిగింది. రంపచోడవరం, మారేడుమిల్లిలో ఈ టెంట్లను అద్దెకు ఇస్తారు. టెంట్‌ సైజును బట్టి రూ.500 నుంచి రూ.750 వరకూ వసూలు చేస్తున్నారు. పర్యాటకుల్లో కొందరు మారేడుమిల్లిలో గల ప్రైవేట్, ఎకో టూరిజం గదుల్లో బస చేసి, తెల్లవారుజామున కొండమీదకు వెళతారు. 

దుంపవలస జలపాతం 
ఆకుమామిడి కోట నుంచి బోడ్లంక వెళ్లే రహదారిలో గల దారగెడ్డ గ్రామం నుంచి  దుంపవలస వెళ్లాలి. అక్కడి జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తోంది. గుడిసె వెళ్లేందుకు వచ్చిన పర్యాటకులు దుంపవలస జలపాతంలో స్నానాలు చేస్తూ ప్రకృతి అందాలను తిలకిస్తూ మైమరిచిపోతారు. ఆకుమామిడి కోట నుంచి సుమారు 25 కిలోమీటర్లు దూరంలో ఈ జలపాతం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement