
నూర్ మహమ్మద్ ఉదంతం వెలుగు చూడటంతో ఉలిక్కిపడిన జనం
అదేరోజు ఆటో డ్రైవర్ రియాజ్ వ్యవహారం బట్టబయలు
ఉగ్రవాద ఉదంతంపై విచారణ వేగవంతం
నూర్ ప్రియురాలి కోసం గాలింపు
ఇతర లింకులపైనా దృష్టి
ధర్మవరం: పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచి ‘సిల్క్ సిటీ’గా పేరొందిన శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద కదలికలు బహిర్గతం కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది. ధర్మవరంలోని లోనికోటకు చెందిన నూర్ మహమ్మద్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) బృందాలు అప్రమత్తమయ్యాయి. నూర్ మహమ్మద్ ఇంట్లో జరిపిన సోదాల్లో పలు సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో పాటు పలు ఉగ్రవాద గ్రూపులలో సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించారు. సోదాల్లో ఉగ్ర సాహిత్యం పుస్తకాలు కూడా దర్యాప్తు సంస్థల అధికారులకు లభించాయి. అతడు జిహాద్ పేరుతో వాట్సాప్ ద్వారా నిరంతరం సందేశాలు దేశానికి వ్యతిరేకంగా పంపినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ముస్లిం యువతను ఉగ్రవాదంవైపు మళ్లించేందుకు నూర్ మహమ్మద్‌ను ఉగ్రవాదులు పావుగా వాడినట్టు తెలుస్తోంది.
డబ్బు ఆశ చూపి లొంగదీసుకున్నారా!
నూర్ మహమ్మద్ కాయగూరల మార్కెట్ వద్ద చిన్నపాటి హోటల్లో పని చేసేవాడు. అరకొర సంపాదనతో ఇబ్బందులు పడుతూ అప్పులు చేసేవాడు. రెండేళ్ల క్రితం వరకు కటిక పేదరికం అనుభవించిన అతడు తల్లి, చెల్లితో పాటు భార్య, నలుగురు పిల్లల్ని పోషించేందుకు చాలామంది వద్ద గతంలో చాలా అప్పులు చేశాడు. ఈ క్రమంలో భార్య సైతం అతనితో గొడవపడి వేరుగా ఉంటోంది.
ఈ ఆర్థిక ఇబ్బందుల వల్లే ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడయ్యాడన్న ప్రచారం ఉంది. ఏడాది క్రితం వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఇస్తెమాలకు వెళ్లినప్పటి నుంచి నూర్ మహమ్మద్‌లో మార్పు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి ముభావంగా ఉండటం, ఎవరితోనూ మాట్లాడకపోవడం వంటివి అతనిలో గమనించినట్టు చెబుతున్నారు.
రూ.లక్షలతో ఇల్లు ఆధునికీకరణ
పేదరికంలో మగ్గుతూ వచ్చిన నూర్ మహమ్మద్ ఉన్నట్టుండి పాత ఇంటిని రూ.50 లక్షలకు పైగా వెచ్చిoచి ఆధునికీకరించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇంటి పైపోర్షన్‌లోకి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పైన గది నుంచే అర్ధరాత్రి నుంచి సెల్‌ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడటం చేసేవాడని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. మరికొందరు అతని దగ్గర శాటిలైట్ ఫోన్ కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఇవన్నీ ఉగ్రవాదుల ఆర్థిక సహకారంతోనే సాకారమైనట్టు తెలుస్తోంది.
తాడిపత్రిలో ప్రియురాలు
నూర్ మహమ్మద్‌తో భార్య వేరుపడినప్పటి నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరిపినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఆమెకు సైతం ఉగ్ర సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. నూర్ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అతని ప్రియురాలు అదృశ్యమైనట్టు సమాచారం. నూర్ తరచూ వాట్సాప్‌లో ఆమెతో సంభాషించిన ఆధారాలను కుటుంబ సభ్యులు బహిర్గతం చేశారు. ఆమె పట్టుబడితే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.
ఇంకా ఎందరుఉన్నారో!
ధర్మవరంలోని లోనికోట, లింగశెట్టి పాళ్యం, ఎల్‌సీకే పురంలో ఉన్న కొన్ని ప్రాంతాలను ప్రజలు పాతబస్తీగా పిలుస్తుంటారు. ఇక్కడ అధిక సంఖ్యాకులు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారే నివసిస్తుంటారు. ఇక్కడ తక్కువ అద్దెకు ఇల్లు దొరకడం, మాస్ బెల్ట్ కావడంతో పేద, మధ్య తరగతి వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. దీంతో నూర్ మహమ్మద్‌తో పాటు ఉగ్ర సంబంధాలు ఉన్నవారు ఇంకా ఎందరు ఉన్నారని ఆరా తీసే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి.
స్థానికతతో పాటు ఎలాంటి ఆధారమూ లేకుండా ఉండేవారు ఎందరున్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఎల్‌సీకే పురానికి చెందిన ఆటో డ్రైవర్ రియాజ్ తన వాట్సాప్ స్టేటస్‌లో ‘నో ఇండియా.. ఐ లవ్ పాకిస్థాన్’ అనే సందేశాన్ని పెట్టడంతో అతన్ని కూడా దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. ఒకేరోజు నూర్ మహమ్మద్‌తో పాటు రియాజ్ వ్యవహారం బట్టబయలు కావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న ధర్మవరంలో ఉగ్ర మూకల్ని కూకటి వేళ్లతో పెకలించాలని ప్రజలు కోరుతున్నారు.
ఉగ్ర కార్యకలాపాల నివారణకు ప్రత్యేక బృందాలు
పుట్టపర్తి టౌన్: శ్రీసత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కార్యకలాపాలను నివారించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ రత్న తెలిపారు. ఆదివారం పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సమాచారం మేరకు ధర్మవరం పోలీసులు ఉగ్రవాద భావాజాలాన్ని అరికట్టే క్రమంలో అనుమానితులపై నిఘా ఉంచారన్నారు. ఈ క్రమంలోనే ఆరు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలులుండి.. వాట్సాప్ గ్రూపుల్లో చురుగ్గా ఉంటూ, జిహాదీ సిద్ధాంత పుస్తకాలు కలిగిన నూర్ మహమ్మద్‌ను అరెస్టు చేసినట్టు తెలిపారు.
పాకిస్తాన్‌లోని నిషేధిత ఉగ్రవాద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం ఉన్నట్టు నూర్ మహమ్మద్ అంగీకరించాడని తెలిపారు. ఈ గ్రూపుల ద్వారా ఉగ్రవాద భావజాల వ్యాప్తి, దేశ వ్యతిరేక ప్రచారం, జిహాదీ ప్రేరణ జరుగుతున్నాయన్నారు. ఉగ్రవాది నుంచి మొబైల్ ఫోన్, రెండు సిమ్‌కార్డులు, జిహాదీ భావజాలం, ఉగ్రవాద సంస్థల ప్రచారంతో కూడిన నిషేధిత సాహిత్యం గల పుస్తకాన్ని స్వాదీనం చేసుకున్నట్టు తెలిపారు.
నూర్ మహమ్మద్‌ను కదిరి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్టు చెప్పారు. అతడి నుంచి స్వా«దీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, నివేదిక ఇచి్చన వెంటనే ఇతరులతో సంబంధాలు, ఉగ్ర లింకులు తదితర వివరాలన్నీ వెల్లడిస్తామని తెలిపారు. ఎస్పీ వెంట ధర్మవరం ఇన్‌చార్జి డీఎస్పీ నరశింగప్ప, టూటౌన్ సీఐ రెడ్డెప్ప ఉన్నారు.