అయ్యో పాపం.. పరీక్ష రాస్తూ విద్యార్థి మృతి

Intermediate Student Dies While Writing Exam in Srikakulam District - Sakshi

విషాదంలో కుటుంబ సభ్యులు

పాతపట్నం/సారవకోట: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్‌ పరీక్ష రాస్తూ బూరాడ కార్తీక్‌ (16) అనే విద్యార్థి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  

సారవకోట మండలం ధర్మలక్ష్మిపురం పంచాయతీ దాసుపురం గ్రామానికి చెందిన కార్తీక్‌ పాతపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఉంటూ ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం వసతి గృహంలో అస్వస్థతకు గురై వాంతులు రావడంతో తోటి విద్యార్థులతో కలిసి హాస్టల్‌ వార్డెన్‌ బి.వైకుంఠరావు పాతపట్నం సీహెచ్‌సీకి తీసుకువచ్చారు. చికిత్స అందించాక విశ్రాంతి తీసుకోవాలని సూపరింటెండెంట్‌ బాలకృష్ణ విద్యార్థికి సూచించారు. 

అయితే పరీక్షకు సమయమవుతోందని చెప్పిన కార్తీక్‌ ఆస్పత్రి నుంచి నేరుగా పాతపట్నం బస్టాండ్‌ వద్ద ఉన్న పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత స్పృహ తప్పడంతో ఇన్విజిలేటర్లు, సిబ్బంది కలిసి పాతపట్నం సీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు సూపరింటెండెంట్‌ బాలకృష్ణ తెలిపారు. మెదడుకు సంబంధించిన సమస్యతో కార్తీక్‌ మృతి చెంది ఉండొచ్చని చెప్పారు. తల్లిదండ్రులు బూరాడ శ్యామ్‌సుందరావు, కుమారి, తమ్ముడు దినేష్‌లు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్‌ఐ మహమ్మద్‌ అమీర్‌ ఆలీ ఆస్పత్రికి చేరుకుని వైద్యుడు బాలకృష్ణతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామం దాసుపురం పంపించారు.  

స్పృహ తప్పిన మరో విద్యార్థిని 
పాతపట్నం కోర్టు కూడలిలో ఉన్న ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ పరీక్ష రాస్తున్న తూలుగు ధనలక్ష్మి అనే విద్యార్థి స్పృహ తప్పిపోయింది. వెంటనే ప్రిన్సిపాల్‌ ఎం.ఆంజనేయులు విద్యార్థినిని సీహెచ్‌సీకి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. కడుపు నొప్పి వస్తోందని వైద్యులకు చెప్పడంతో సూపరింటెండెంట్‌ కె.బాలకృష్ణ చికిత్స అందించారు. చికిత్స అందించిన అనంతరం విద్యార్థిని స్వగ్రామం హిరమండలంలోని ధనుపురం పంపించినట్లు వైద్యుడు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top