లేనిది ఉన్నట్టు.. అంతా 'కనికట్టు'

Interesting facts coming out of the medical devices scam - Sakshi

వైద్య పరికరాల స్కామ్‌లో బయటకొస్తున్న ఆసక్తికర విషయాలు

తప్పుడు రికార్డులు.. పాత తేదీలతో సంతకాలు

పరికరాలకు సర్వీసింగ్‌ చేయకపోయినా చేసినట్టు చూపించి బిల్లులు

సీఐడీ సోదాల్లో వెలుగు చూస్తున్న నిజాలు

సాక్షి, అమరావతి: ఆస్పత్రుల్లో అసలు వైద్య పరికరాలే లేవు. అయినా రికార్డుల్లో మాత్రం ఉన్నట్టు చూపించారు. పాడవడంతో మూలన పడేసిన పరికరాలు పనిచేస్తున్నట్టు రికార్డుల్లో చూపించారు. పరికరాల వాస్తవ ధరకు.. రికార్డుల్లో చూపించిన ధరకు అసలు పొంతన లేదు. ప్రభుత్వాస్పత్రుల్లో కొన్ని రోజులుగా సీఐడీ ప్రత్యేక బృందాలు చేస్తున్న తనిఖీల్లో వెలుగు చూస్తున్న నిజాలివి. చంద్రబాబు హయాంలో వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్య పరికరాల నిర్వహణ కాంట్రాక్ట్‌లో అడ్డగోలుగా సాగిన కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోదాలు మొదలుపెట్టింది. మొత్తం 1,315 ఆస్పత్రులు ఉండగా.. ఇప్పటివరకు 40 శాతం ఆసుపత్రుల్లో సోదాలు పూర్తయినట్టు సమాచారం. 

పాత తేదీలతో సంతకాలు చేసి..
టెలీ బయోమాటిక్‌ సర్వీసెస్‌ (టీబీఎస్‌) సంస్థకు బిల్లులు చెల్లించేందుకు అప్పటి ఉన్నతాధికారులు, నాయకులు తొక్కని అడ్డదారి అంటూ లేదు.అప్పటి ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా పనిచేసిన సీహెచ్‌.గోపీనాథ్, బయో మెడికల్‌ ఇంజనీర్‌ రోహిణి చెప్పినట్టు నడుచుకున్నామని కొంతమంది వైద్య సిబ్బంది చెబుతుండగా.. మరికొందరు అప్పటి ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ మౌఖిక ఆదేశాల మేరకు ఆ తప్పులు చేశామని చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో పెద్ద చేపలు  కీలక పాత్ర పోషించాయనే విషయం తెలుస్తోంది. టీసీఎస్‌ సంస్థ వైద్య పరికరాల నిర్వహణను సక్రమంగా చేయలేదు. అయినా సరే మొత్తం పరికరాల విలువలో 7.5 శాతం బిల్లులు పెట్టారు. దీనికి తొలుత బిల్లు చెల్లించారు.

ఆ తర్వాత ఈ కేసు కోర్టుకు వెళ్లింది. ఆ వెంటనే బిల్లులపై వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్‌లతో పాత తేదీలతో బిల్లులపై సంతకాలు చేయించారు.  ఇప్పుడా సంతకాలే వారి మెడకు చుట్టుకున్నాయి. ఎందుకు సంతకాలు చేశారు,  వైద్య పరికరాలను మరమ్మతు చేసినట్టు ఆధారాలున్నాయా అని అడిగితే.. తమకు తెలియదని, ఈ తేదీలతో సంతకాలు చేయాలని స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదేశించారని చెబుతున్నారు. ఏఎంసీ (వార్షిక నిర్వహణ) పరిధిలో ఉన్న వాటికీ ఎందుకు సంతకాలు చేశారని అడుగుతుంటే.. తమకు తెలియదని సమాధానమిస్తున్నారు. ఈ కుంభకోణం ఉన్నతాధికారులతో పాటు పదుల సంఖ్యలో వైద్య సిబ్బంది మెడకు కూడా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి.

కొనసాగిన తనిఖీలు
విజయవాడలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రితోపాటు రాష్ట్రంలోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో సీఐడీ సోదాలు బుధవారం కూడా కొనసాగాయి. ఇప్పటికే సేకరించిన ఆధారాలను దృష్టిలో పెట్టుకుని సీఐడీ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తోంది. తొలుత ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రులు(జీజీహెచ్‌), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు (సీహెచ్‌సీ)లలో సోదాలు కొనసాగుతున్నాయి. 13 జిల్లాల్లోనూ 42 ప్రత్యేక బృందాలు సేకరించిన వివరాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అవినీతి, అక్రమాలకు సంబంధించిన అన్ని లెక్కల్ని తేల్చాకు మరింత దూకుడుగా దర్యాప్తు చేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top