ఏపీ: షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు

Inter Examinations As Per Schedule In AP - Sakshi

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ పరీక్షల షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు లేవని, మే5 నుంచి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్‌ పరీక్షలు అనివార్యమని, కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. బుధవారం విజయవాడలో మంత్రి.. ఇంటర్‌ పరీక్షలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలోనూ ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయలేదని, కొన్ని రాష్ట్రాలు నిర్వహిస్తుంటే మరికొన్ని రాష్ట్రాలు వాయిదా వేశాయన్నారు.

కానీ కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని అనవసర రాద్ధాంతం చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రాక్టికల్‌ పరీక్షలు పూర్తి చేసిన అధికారులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. వచ్చే నెల 5 నుంచి 23 వరకు జరిగే పరీక్షల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

అన్ని పరీక్ష కేంద్రాల వద్ద నిఘా ఉంటుందని, ప్రతీ రోజు తాను కూడా పరీక్షల తీరును సమీక్షిస్తానని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ సూచించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్, కమిషనర్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: తలరాత మార్చేది చదువులే  
ప్రతి విద్యార్థి  భవిష్యత్తు కోసమే..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top