తలరాత మార్చేది చదువులే 

CM Jagan Says That Our students must compete and excel with the world - Sakshi

మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి రాణించాలి: సీఎం జగన్‌ 

పేదరికంతో ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదు 

కోవిడ్‌ కష్టాల్లోనూ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అమలు  

‘జగనన్న వసతి దీవెన’ తొలివిడత కింద రూ.1,048.94 కోట్లు జమ 

10,89,302 మంది తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్‌

ఓ మేనమామగా...చదువులకు చేసే ఖర్చంతా నా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి అని గట్టిగా నమ్ముతున్నా. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి చదువులే. విద్యా దీపాలు వెలిగిస్తే భావితరాల తలరాతలు కూడా మారతాయి. కోవిడ్‌తో ఆర్థిక సమస్యలున్నా తల్లిదండ్రుల ఇబ్బందులే ఎక్కువని భావించి ఓ మేనమామగా ముందడుగు వేస్తున్నా.
– ముఖ్యమంత్రి జగన్‌

సాక్షి, అమరావతి: ఉన్నత చదువుల్లో ప్రపంచంతో పోటీపడి మన విద్యార్థులు రాణించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. మంచి డిగ్రీ సంపాదిస్తేనే తలరాతలు మారతాయన్నారు. పేదరికంతో ఏ విద్యార్థీ చదువులకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే దుస్థితి రాకూడదనే కోవిడ్‌ కష్టాల్లోనూ ఇచ్చిన మాట ప్రకారం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికున్న ఇబ్బందుల కన్నా ప్రతీ తల్లిదండ్రి, పిల్లల ఇబ్బందులే ఎక్కువని భావించి అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. వరుసగా రెండో ఏడాది ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద ఈ విద్యా సంవత్సరం మొదటి విడతగా 10,89,302 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.1,048.94 కోట్లను సీఎం బుధవారం కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ వివరాలివీ..

తరతరాలకు చదువుల వెలుగులు..
ఉన్నత చదువులే మనం పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి. చదువుల దీపాలు వెలిగిస్తేనే ఈ తరంతో పాటు భావితరాల తలరాతలు మారతాయని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. ఇవాళ 10,89,302 మంది తల్లుల ఖాతాల్లో దాదాపు రూ.1,049 కోట్లు జమ చేస్తున్నాం. దేవుడి దయతో ఇంత మంచి కార్యక్రమం చేయగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది. పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యా దీవెనతో పాటు హాస్టల్, మెస్‌ ఖర్చుల కోసం ‘వసతి దీవెన’ పథకాన్ని అమలు చేస్తున్నాం. వసతి దీవెన ద్వారా ఏటా 2 వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన, ఖర్చుల కోసం కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికి వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం. ఇప్పటివరకు జగనన్న వసతి దీవెన ద్వారా రూ.2,269.93 కోట్లు లబ్ధి చేకూర్చామని ఆ పిల్లలకు మేనమామగా సగర్వంగా తెలియజేస్తున్నా.

అక్క చెల్లెమ్మల ఖాతాల్లోనే..
అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన కింద సహాయాన్ని అక్క చెల్లెమ్మల ఖాతాల్లోనే జమ చేస్తాం. విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తొలి త్రైమాసికానికి సంబంధించి గత వారమే తల్లుల ఖాతాల్లో రూ.671.45 కోట్లు జమ చేశాం. ప్రతి త్రైమాసికంలో ఆ తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం, వారే ఆ ఫీజులు కట్టడం వల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. వసతులు బాగా లేకపోతే కాలేజీ యాజమాన్యాలను నిలదీయవచ్చు. ఫిర్యాదులుంటే 1902కి ఫోన్‌ చేస్తే వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. 

డ్రాపవుట్లు తగ్గాయి..
జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాల వల్ల విద్యా రంగంలో డ్రాపవుట్లు గణనీయంగా తగ్గాయి. గతంలో 18 నుంచి 23 ఏళ్ల మధ్య, ఇంటర్‌ తర్వాత కళాశాలల్లో చేరుతున్న వారికి సంబంధించిన ‘గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో’ కేవలం 23 శాతమే ఉంది. 

1.60 కోట్ల మందికిపైగా ప్రయోజనం
జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు–నేడు ద్వారా ఇప్పటి వరకు 1,60,75,373 మంది పిల్లలకు ప్రయోజనం కల్పిస్తూ మనందరి ప్రభుత్వం దేవుడి దయతో ఈ 23 నెలల్లో విద్యా రంగంపై రూ.25,714.13 కోట్లు ఖర్చు చేసిందని అక్కచెల్లెమ్మలకు సగర్వంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నాడు–నేడు కింద ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారబోతున్న అంగన్‌వాడీల్లో పిల్లలు, తల్లుల పౌష్టికాహారానికి మరో రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
► జగనన్న అమ్మ ఒడి ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. వారి ఆప్షన్‌ మేరకు వచ్చే ఏడాది నుంచి ల్యాప్‌టాప్‌లిస్తాం. ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించాం.
► వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేస్తాం. అంగన్‌వాడీలు ఇక నుంచి వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారనున్నాయి. వైఎస్సార్‌ పీపీ 1, పీపీ 2, ఫ్రీ ఫస్ట్‌ క్లాసు తెస్తూ ఇంగ్లిష్‌మీడియంలో విద్యాబోధన నిర్వహిస్తాం. 
► మనబడి ‘నాడు–నేడు’ పథకం కింద 3 దశల్లో పాఠశాలలు, కాలేజీల ఆధునికీకరణ చేపట్టాం.  27,438 అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త భవనాలతో పాటు 28,169 కేంద్రాల రూపురేఖలు మారుస్తున్నాం. 
► జగనన్న విద్యాకానుక ద్వారా కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫారాలు, స్కూల్‌ బ్యాగ్, టెక్‌›్ట్స బుక్స్, నోట్‌ బుక్స్, వర్క్‌ బుక్స్, బెల్ట్, సాక్స్, షూస్‌ ఇస్తుండగా ఇకపై ఇంగ్లిష్‌–తెలుగు డిక్షనరీ కూడా అందచేస్తాం. జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతి రోజూ మెనూ మార్చి నాణ్యమైన పౌష్టికాహారం, రుచికరమైన మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నాం. గర్భిణులు, పిల్లల కోసం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేస్తున్నాం. 
► విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తూ ఇప్పటివరకు రూ.4,879.30 కోట్లిచ్చాం. వచ్చే జూలైలో రెండో త్రైమాసికం, డిసెంబర్‌లో మూడో త్రైమాసికం, 2022 ఫిబ్రవరిలో నాలుగో త్రైమాసికం ఫీజులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తాం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top