సింథియా (విశాఖ): స్వదేశీ పరిజ్ఞానంతో భారత నౌకాదళం నిర్మించిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ సహ్యాద్రి రష్యాలోని వ్లాడివోస్టాక్ చేరుకుంది. అక్టోబర్ 13 నుంచి 18 వరకు జరగనున్న భారత్–రష్యా సంయుక్త నౌకాదళ విన్యాసం ఇంద్ర–2026లో ఈ యుద్ధనౌక పాల్గొననుంది.
ఇరుదేశాల నౌకాదళాలు నౌకాశ్రయంలోనూ, సముద్రంలోనూ పలు సంయుక్త శిక్షణ విన్యాసాలు, వృత్తిపరమైన పరస్పర కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. భారత్ ప్రతిపాదించిన మహాసాగర్ దార్శనికతకు అనుగుణంగా ఈ పర్యటన కొనసాగుతోంది. 2025 డిసెంబరులో జరిగిన 23వ భారత్–రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం అనంతరం ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, సముద్ర సహకారాన్ని మరింత విస్తరించే దిశగా ఇంద్ర–2026 విన్యాసం కీలకంగా నిలవనుంది.


