
ఇంద్రకీలాద్రి(విజయవాడ): దసరా ఉత్సవ వేళ ఇంద్రకీలాద్రిపై అపచారం చోటు చేసుకుంది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఆలయ, ఉపాలయాల పరిసరాల్లో ముగ్గురు వ్యక్తులు మంగళవారం కాళ్లకు చెప్పులు వేసుకుని తిరిగారు. అమ్మవారి దర్శనం తర్వాత బయటకు వచ్చే దారిలో నటరాజ స్వామి ఆలయం, గణపతి ఆలయం, పక్కనే శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లకు కుంకుమార్చన నిర్వహించే ప్రాంగణం, వెనుక వైపు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నాయి.
నటరాజస్వామి వారి ఆలయం నుంచి ముగ్గురు వ్యక్తులు నేరుగా కుంకుమార్చన ప్రాంగణం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాల మీదగా లక్ష్మీ గణపతి ప్రాంగణం వైపు చెప్పులతో పరుగులు తీశారు. అమ్మవారి ఆలయ పరిసరాల్లోకి చెప్పులతో రాకుండా ఘాట్‌రోడ్డులోని పలు చోట్ల దేవస్థానం స్టాండ్‌లను ఏర్పాటు చేసింది. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు ఆలయ పరిసరాల్లోకి చెప్పులు వేసుకొని రావడమే కాకుండా తాఫీగా పరిసరాల్లో తిరుగుతూ కనిపించారు. ఇటువంటి వారిపై దేవస్థాన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
