ఆర్మీ కొలువు పిలుస్తోంది..

Indian Army Conducts Open Rally In Visakhapatnam - Sakshi

ఆగస్టు 16 నుంచి విశాఖలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ 

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం 

ఆగస్టు 9 నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌కు అవకాశం 

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం  

శ్రీకాకుళంనిరుద్యోగ యువతకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి ఇండియన్‌ ఆర్మీ విశాఖపట్నంలో ఓపెన్‌ ర్యాలీ నిర్వహించనుంది. సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌ టెక్నికల్, ఏవియేషన్, నర్సింగ్‌ అసిస్టెంట్, వెటర్నరీ, క్లర్క్, ట్రేడ్స్‌మేన్‌ పోస్టుల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం అభ్యర్థులు మాత్రమే ర్యాలీలో పాల్గొనేందుకు అర్హులు.

వేదిక ఎక్కడంటే.. 
విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆగస్టు 16 నుంచి 31వ తేదీ వరకూ నియామక ప్రక్రియ చేపట్టనుంది. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించింది. joinindianarmy.nic.in లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. జూన్‌ 20 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు మూడో తేదీతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగియనుంది. అదే నెల 9వ తేదీ నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ర్యాలీకి హాజరయ్యే సమయాన్ని అందులో నిర్దేశిస్తారు. ముందుగా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధిస్తే ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్, తరువాత మెడికల్‌ టెస్ట్‌ ఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి చివరిగా రాత పరీక్ష నిర్వహిస్తారు. వీటిన్నింటిలో మెరిట్‌ సాధించిన వారిని ఎంపిక చేసి శిక్షణకు పంపిస్తారు. గత రెండేళ్లుగా ఓపెన్‌ ర్యాలీ నిర్వహించలేదు. గత ఏడాది ర్యాలీని ప్రకటించినా కోవిడ్‌ ఉధృతితో రద్దు చేశారు. ఈ ఏడాది నిర్వహిస్తామన్నా సెకెండ్‌ వేవ్‌ ఉధృతితో ఓపెన్‌ ర్యాలీ జరుగుతుందా? లేదా? అన్న అనుమానం వెంటాడింది. కానీ అనుమానాలను తెరదించుతూ తేదీలు ప్రకటించడంతోపాటు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు.  
నాలుగు దశల్లో నియామక ప్రక్రియ 
నియామక ప్రక్రియను నాలుగు దశల్లో నిర్వహిస్తారు. ముందుగా ఫిజికల్‌ ఫిట్‌నెస్, ఫిజికల్‌ మెజర్‌మెంట్, మెడికల్, రాత పరీక్షలుంటాయి. అన్ని విభాగాల్లో లభించిన మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.  
చక్కటి అవకాశం 
నిరుద్యోగ యువతకు ఇదో చక్కటి అవకాశం. ఇంకా 40 రోజుల సమయం ఉంది. పరుగుతో పాటు ఇతర ఈవెంట్స్‌కు నిత్యం సాధన చేయాలి. రాత పరీక్షకు సన్నద్ధం కావాలి. పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలు అందుబాటులో తెచ్చుకుంటే చాలామంచిది. అవసరమైతే శిక్షణ తీసుకోవడం ఉత్తమం. ప్రణాళికాబద్ధంగా సాధన చేసి చదివితే కొలువు సొంతమవుతుంది.  

విద్యార్హతలివీ.. 
సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ: పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. 45 శాతం మార్కులు పొందాలి. ప్రతీ సబ్జెక్టులో 33 శాతం మార్కులు పొంది.. 17–21 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 2000 అక్టోబర్‌ 1, 2004 ఏప్రిల్‌ 31 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎత్తు 166 సెంటీమీటర్లు ఉండాలి.  

సోల్జర్‌ టెక్నికల్, ఏవియేషన్‌: అభ్యర్థులు 10+2, ఇంటర్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం, ఇంగ్లిష్‌తో కూడిన సైన్స్‌ గ్రూపులో చదివి.. 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందడంతోపాటు ప్రతీ సబ్జెక్టులో 40 శాతం మార్కులు సాధించాలి. 165 సెంటీమీటర్ల ఎత్తు, 23 సంవత్సరాల్లోపు వయసుండాలి. 1998–2004 మధ్య జన్మించి ఉండాలి.
 
సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌/వెటర్నరీ: అభ్యర్థులు 10+2, ఇంటర్‌ పాసై ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో కూడిన సైన్స్‌ గ్రూపు చదివి ఉండాలి. వెటర్నరీ పోస్టులకు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో పాటు బోటనీ, జువాలజీ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాలి. 50 శాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు.. ప్రతీ సబ్జెక్టులో 40 శాతం మార్కులు పొంది ఉండాలి. 165 సెంటీమీటర్లు ఎత్తు, 23 సంవత్సరాల్లోపు వయస్సుండాలి.1998–2004 మధ్య జన్మించినవారు అర్హులు.
 
సోల్జర్‌ క్లర్క్‌: అభ్యర్థులు 10+2, ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించాలి. ఆర్ట్స్, కామర్స్, సైన్స్‌ గ్రూపుల వారు అర్హులు. 60 శాతం మార్కులు పొంది ఉండాలి. 23 సంవత్సరాల్లోపు (1998–2004 మధ్య జన్మించి) వయస్సుండాలి.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top