AP: అసెంబ్లీలో చివరి రోజూ అదే తీరు

Inappropriate comments by TDP members on Speaker in Legislative Assembly - Sakshi

శాసనసభలో స్పీకర్‌పై టీడీపీ సభ్యుల అనుచిత వ్యాఖ్యలు 

శాసనసభను సంతాప సభతో పోల్చిన అచ్చెన్నాయుడు 

సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్‌ సమావేశాల చివరిరోజూ తెలుగుదేశం పార్టీ తన అరాచక బుద్ధిని ప్రదర్శించింది. స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ లక్ష్యంగా ఆ పార్టీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ప్రశ్నోత్తరాలు మొదలవగానే వాయిదా తీర్మానానికి టీడీపీ పట్టుపట్టింది. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని స్పీకర్‌ వారించడంతో టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. తమను దగ్గరుండి కొట్టించడంతో పాటు.. ఎమ్మెల్యేపైనే స్పీకర్‌ దాడి చేశారంటూ ఆరోపించారు. చివరకు రెడ్‌లైన్‌ దాటి, సస్పెండై సభ నుంచి వెళ్లిపోయారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవగా, ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.

‘ఆయుష్మాన్‌ భారత్‌’పై టీడీపీ సభ్యులే అడిగిన ప్రశ్నలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని బదులిస్తుండగా వినకుండా తమ స్థానాల నుంచే రన్నింగ్‌ కామెంట్రీ మొదలుపెట్టారు. జీవో నంబర్‌1ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలను వినిపించేందుకు టీడీపీ సభ్యులకు స్పీకర్‌ మైక్‌ ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా తమ వాయిదా తీర్మానం తీసుకోవాలంటూ భీషి్మంచారు. 9.09గంటలకు వెల్‌­లోని రెడ్‌లైన్‌ వరకు వచ్చి స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తమను సంప్రదించకుండా రెడ్‌లైన్‌ ఎలా పెడతారని శాసనసభ కార్యదర్శిని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రెడ్‌లైన్‌ దాటి సభాపతి పోడియంపైకి దూసుకెళ్లారు. సభా సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తున్నారంటూ టీడీపీ సభ్యులపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

సభలో ఇచ్చిన రూలింగ్‌ ప్రకారం రెడ్‌ లైన్‌ దాటినందుకు టీడీపీ సభ్యులు కె.అచ్చెన్నాయుడు, డోలా బాలవీరాంజనేయస్వామి, గద్దె రామ్మోహన్‌రావు, గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు), గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంతెన రామరాజు, నిమ్మకాయల చినరాజప్ప ఒక రోజు సభ నుంచి ఆటోమేటిక్‌గా సస్పెండ్‌ అయినట్టు ప్రకటించారు. బయటకు వెళ్లేందుకు టీడీపీ సభ్యులు నిరాకరించడంతో మార్షల్స్‌ను రప్పించారు. అయితే 9.22 గంటలకు నవ్వుకుంటూ.. బయటకు వెళ్లిపోయారు. బయటకు వెళ్తూ అచ్చెన్నా­యుడు శాసనసభను సంతాప సభతో పోల్చారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top