వజ్రాల వేట.. అత్యంత ఖరీదైన కోహినూర్‌ వజ్రం కూడా ఆ చెరువులోనే దొరికిందా?

Hunt For Diamonds In Krishna District - Sakshi

కోహినూర్‌ వజ్రం కూడా పరిటాల చెరువులోనే

కృష్ణా: అనాది కాలం నుంచి కృష్ణా నది పరీవాహక ప్రాంతం వజ్రాల వేటకు పెట్టింది పేరు. ముఖ్యంగా కంచికచర్ల మండల పరిధిలోని పరిటాల, చందర్లపాడు మండల పరిధిలోని గుడిమెట్ల (రామన్నపేట), కృష్ణా తీరం వజ్రాల గనిగా వాసికెక్కింది. మనసు పెట్టి అన్వేషణ సాగిస్తే, ఏదో ఒకటి దొరుకుతుందన్న నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. సాధారణ రకం మొదలుకొని లక్షల విలువ చేసే వజ్రాలు లభ్యమైన సందర్భాలు అనేకం ఉండటమే ఇందుకు నిదర్శనం. అత్యంత ఖరీదైన కోహినూర్‌ వజ్రం కూడా పరిటాల చెరువులోనే లభించిందనే కథనం కూడా ప్రచారంలో ఉండటం గమనార్హం. ఒకప్పుడు చందర్లపాడు మండలంలో ఏకంగా వజ్రాల కోత పరిశ్రమ ఉండేదంటే.. ఈ ప్రాంతంలో వజ్రాల వేట ఏ స్థాయిలో జరిగేదో.. ఎంతలా వజ్రాలు దొరికేవో అర్థం చేసుకోవచ్చు.  

నాటి నుంచి నేటి వరకు.. 
గుడిమెట్ల ప్రాంతంలో వజ్రాల వేట ఈనాటిది కాదు.. దశాబ్దాల కాలంగా జరుగుతున్నదే.. ఇప్పటికీ వర్షాకాలం వచ్చిందంటే.. ఎక్కడెక్కడి నుంచో వజ్రాల వేటగాళ్లు ఇదే పనిలో ఉంటారు. కొందరు ఉదయమే భోజనాలు కట్టుకొని రామన్నపేట ప్రాంతంలోని కొండ ప్రాంతంలో తవ్వకాలు మొదలు పెడతారు. సాయంత్రం చీకట్లు కమ్ముకునే వరకు వీరి వెదుకులాట కొనసాగుతూనే ఉంటుంది. గతంతో పోల్చుకుంటే.. ప్రస్తుతం వజ్రాల లభ్యత గణనీయంగా తగ్గిపోయినప్పటికీ, వెదుకులాడే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కనీసం రంగు రాళ్లు లభించినా, కూలి అంత సొమ్మైనా దొరుకుతుందన్న భావనలో చాలా మంది ఉంటారు. అదృష్టం కలసి వస్తే, ఒకేసారి లక్షాధికారులయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.

 ఆశావహులు తొలకరి జల్లులు కురిస్తే చాలు వజ్రాల వేటకు బయలుదేరుతారు. ఇందుకోసం వీరు ప్రధానంగా చందర్లపాడు మండల పరిధిలోని గుడిమెట్ల శివార్లలో కృష్ణా నది ఒడ్డును ఎంచుకుంటారు. ఇక్కడే తవ్వకాలు అధికంగా సాగిస్తారు. ఏటా తొలకరి జల్లులు మొదలుకొని వర్షా కాలం పూర్తయ్యే వరకు ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతుండటం ఆనవాయితీ. పొరుగు జిల్లాల నుంచి కూడా జనం అధిక సంఖ్యలో తరలివచ్చి వజ్రాల వేట సాగిస్తుంటారు. నిత్యం 200 మంది వరకు ఇక్కడ అన్వేషణ సాగిస్తుండటం గమనార్హం. ఇక్కడ వజ్రాలతోపాటు రంగు రాళ్లు కూడా అధిక సంఖ్యలో లభ్యమవుతాయి. దీంతో కూలి ఖర్చుకు ఢోకా ఉండదని చెబుతారు. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం వజ్రాల వేట నిషేధమని.. నిబంధనలు మీరి వెళితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top