సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో మోంథా తుపాను బాధిత రైతులను పరామర్శించి, వారి పంట పొలాల పరిశీలనకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యకమ్రం దిగ్విజయమైంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. పర్యటనకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసు పెట్టారు. అంతేకాకుండా డ్రోన్ వీడియోల ఆధారంగా మరికొందరిపైన కూడా కేసులు పెడతామని పోలీసులు చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇక, అంతకుముందు.. వైఎస్ జగన్ పర్యటనను విఫలం చేయడమే లక్ష్యంగా ముందుగానే వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల ఇంచార్జిలు, ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులను బెదిరించింది. తద్వారా జన సమీకరణ జరగకుండా అడ్డుకోవాలని ఎత్తు వేశారు. అయితే, ఇవేవీ ఫలించలేదు. పైగా ప్రజలు భారీగా, స్వచ్ఛందంగా తరలి వస్తుండడంతో ఇక ఓవర్ యాక్షన్‌కు దిగారు.
జగన్ వస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు గోపువానిపాలెం అడ్డ రోడ్డుకు చేరుకోగా పోలీసులు బారికేడ్లు, రోప్‌లతో అడ్డగించారు. రోడ్డు మార్జిన్‌లో నిల్చుని ఉన్నా చెదరగొట్టారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ సంగతి తెలిసిన పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ అక్కడకు వచ్చి ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అయితే, సమాధానం ఇవ్వకుండా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దీంతో కైలే అనిల్, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పమిడిముక్కల సీఐ తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు.

అడ్డుకున్న పోలీసులు..
తుపాను కారణంగా నీట మునిగిన పంట పొలాలకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జి వరికోటి అశోక్‌బాబును అదుపులోకి తీసుకుని, ఆయనవెంట వచ్చిన వాహనాలతో పాటు స్టేషన్‌కు తరలించారు. సీతారామపురంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట టీడీపీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు కవ్వించారు. అయినా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రతిఒక్కరూ అత్యంత సంయమనం పాటించారు.


