
పెట్రోలియం, వజ్రాల ఎగుమతుల కంటే అధికం
యూఎస్, జపాన్‌కు నాలుగైదింతలు పెరుగుదల
2024–25 ఆర్థిక సంవత్సరంలో నమోదు
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు మంచి జోరు చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాకు ఐదు రెట్లు, జపాన్‌కు నాలుగు రెట్లకు మించి స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు గత మూడేళ్లలో పెరిగినట్టు ప్రభుత్వ డేటా తెలియజేస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలను వెనక్కి నెట్టేసి ఎగుమతుల్లో టాప్ స్థానానికి స్మార్ట్‌ఫోన్లు చేసుకున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 24.14 బిలియన్ డాలర్ల విలువైన (రూ.2.05 లక్షల కోట్లు) స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు నమోదయ్యాయి. 2023–24లో 15.57 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోల్చి చూస్తే 55 శాతం పెరిగాయి.
2022–23లో స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 10.96 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో ప్రధానంగా యూఎస్, నెదర్లాండ్స్, ఇటలీ, జపాన్, చెక్ రిపబ్లిక్ దేశాలకు భారత స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో అధిక వృద్ధి నమోదైంది. ఒక్క అమెరికాకే గత ఆర్థిక సంవత్సరంలో 10.6 బిలియన్ డాలర్ల స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు జరిగాయి. 2023–24లో 5.57 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2022–23లో అమెరికాకు స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 2.16 బిలియన్ డాలర్ల చొప్పున ఉన్నాయి. జపాన్ విషయంలోనూ గణనీయమైన వృద్ధి నమోదైంది. 2022–23లో జపాన్‌కు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు 120 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2024–25లో 520 మిలియన్ డాలర్లకు పెరిగాయి.
తయారీ, ఎగుమతులకు కేంద్రం
దేశ అగ్రగామి ఎగుమతుల్లో స్మార్ట్‌ఫోన్లు కూడా చేరినట్టు, పెట్రెలియం ఉత్పత్తులు, వజ్రాల ఎగుమతులను మొదటిసారి అధిగమించినట్టు వాణిజ్య శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముఖ్యంగా గత మూడేళ్లలో బలమైన వృద్ధి నమోదైనట్టు.. దీంతో అంతర్జాతీయంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ, ఎగుమతులకు భారత్ ప్రధాన కేంద్రంగా అవతరించినట్టు చెప్పారు. పీఎల్‌ఐ కింద స్మార్ట్‌ఫోన్ల తయారీకి కేంద్రం రాయితీలు ఇస్తుండడం తెలిసిందే.
ఇక నెదర్లాండ్స్‌కు గత ఆర్థిక సంవత్సరంలో 2.2 బిలియన్ డాలర్ల స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు జరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 1.07 బిలియన్ డాలర్లతో పోలి్చతే రెట్టింపయ్యాయి. ఇటలీకి సైతం 720 మిలియన్ డాలర్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 1.26 బిలియన్ డాలర్లకు పెరిగాయి. చెక్ రిపబ్లిక్‌కు 650 మిలియన్ డాలర్ల నుంచి 1.17 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో పెరిగినట్టు వాణిజ్య శాఖ డేటా తెలియజేస్తోంది.