ల్యాబ్‌ వజ్రం.. జిగేల్‌! | Lab-grown diamonds 85 billion dollers in india | Sakshi
Sakshi News home page

ల్యాబ్‌ వజ్రం.. జిగేల్‌!

Jul 8 2025 4:53 AM | Updated on Jul 8 2025 9:43 AM

Lab-grown diamonds 85 billion dollers in india

అంతర్జాతీయంగా ఎల్‌జీడీ మార్కెట్‌ @ 26 బిలియన్‌ డాలర్లు 

దేశీయంగా సుమారు 700 మిలియన్‌ డాలర్లు 

వినియోగం ఏటా 15–20 శాతం వృద్ధి 

అమెరికా తర్వాత కీలక మార్కెట్‌గా మారనున్న భారత్‌ 

ట్రెంట్, సెన్కో తదితర పెద్ద కంపెనీలు కూడా బరిలోకి 

సహజ వజ్రాలతో పోలిస్తే 70–90 శాతం వరకు రేటు తక్కువ 

తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా అమ్మకాలు

కోట్ల కొద్దీ సంవత్సరాలుగా రసాయనిక చర్యలకు గురై, ఎక్కడో భూమి లోతుల్లో నిక్షిప్తమై అత్యంత అరుదుగా లభించే వజ్రాలు.. ఇప్పుడు ప్రయోగశాలల్లో కూడా తయారవుతున్నాయి. సహజమైన వజ్రాలకు చౌక ప్రత్యామ్నాయమైన ఈ వజ్రాలను ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్లుగా (ఎల్‌జీడీ) పిలుచుకుంటున్నారు. సహజ వజ్రాల ధరలు పెరుగుతుండటంతో, బడ్జెట్‌ గురించి ఆలోచించే వర్గాల్లోనూ, యువతలోనూ ఈ ఎల్‌జీడీలకు ఆదరణ పెరుగుతోంది. ల్యాబ్‌లలో తయారు చేసే ఈ వజ్రాల ధర, సహజ డైమండ్లతో పోలిస్తే దాదాపు 70–90 శాతం తక్కువగా ఉండటంతో పాటు పర్యావరణ అనుకూలమైన విధానంలో తయారు చేస్తుండటం కూడా ఇందుకు కారణాలు.
 
ఫార్చూన్‌ బిజినెస్‌ ఇన్‌సైట్స్‌ ప్రకారం అంతర్జాతీయంగా ఈ మార్కెట్‌ 2024లో సుమారు 26 బిలియన్‌ డాలర్లుగా ఉండగా 2032 నాటికి 75 బిలియన్‌ డాలర్లకు చేరనుంది.  ఈ నేపథ్యంలో డైమండ్‌ కటింగ్, పాలిషింగ్‌కి పేరొందిన భారత్‌ ఇప్పుడు ఎల్‌జీడీ  రంగంలో కూడా కీలకంగా మారుతోంది. దేశీయంగా ఏటా 8–10 శాతం పెరుగు తున్న రత్నాభరణాల మార్కెట్‌ దాదాపు 80–85 బిలియన్‌ డాలర్లుగా  ఉండగా ఇందులో సహజ వజ్రాభరణాల వాటా సుమారు  10 శాతంగా ఉంటోంది. గతేడాది ఎల్‌జీడీల మార్కెట్‌  600–700 మిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు అంచనా.  

ఇలా ఎల్‌జీడీల అమ్మకాలు గణనీయంగా పెరుగుతుండటంతో పలు దిగ్గజ సంస్థలు కూడా ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఉదాహరణకు ట్రెంట్‌ ఇటీవలే తమ ఎల్‌జీడీ బ్రాండ్‌ ‘పోమ్‌’తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచి్చంది. సెన్కో గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ కూడా ఎల్‌జీడీ మార్కెట్లోకి ప్రవేశించడంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

 సెనెస్‌ ఫ్యాషన్‌ అనే అనుబంధ సంస్థ ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్స్‌తో పాటు పర్ఫ్యూమ్‌లు, లెదర్‌ యాక్సెసరీల్లాంటి లగ్జరీ ఐటమ్స్‌పైనా దృష్టి పెడుతోంది. ఇలా ఎల్‌జీడీలకు ఆదరణ పెరగడం ఒక కోణం అయితే ఇవి మిగతా సెగ్మెంట్లకు పోటీ కావడం మరో కోణంగా మారుతోంది. ఎల్‌జీడీలతో వివాహ ఆభరణాల సెగ్మెంట్‌కి వచ్చే నష్టమేమీ పెద్దగా లేకపోయినా.. రోజువారీ ఉపయోగించుకునేందుకు కొనుగోలు చేసే ఆభరణాలకు ఇవి పోటీగా మారొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.  

తెలంగాణలో దాదాపు రూ. 150 కోట్లు 
తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌జీడీలకు గత కొన్నాళ్లు గా డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో లైమ్‌లైట్‌ ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్స్, లాదియా తదితర సంస్థలు కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం సుమారు రూ. 100–150 కోట్ల వరకు మార్కెట్‌ ఉంటుందని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా స్టోర్స్‌ ఉన్న లైమ్‌లైట్‌ ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్స్‌ సంస్థ ఇన్వెస్టర్‌ నిపుణ్‌ గోయల్‌ తెలిపారు. ఇది ఏటా 15–17 శాతం వరకు వృద్ధి చెందుతోందని చెప్పారు. 

ఎక్కువగా 18–30 ఏళ్లు, ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారు వీటిపై మక్కువ చూపిస్తున్నట్లు వివరించారు. సాధారణంగా రూ. 20–25 వేల వరకు సగటు ధర ఉండే రింగులు, పెండెంట్లు మొదలైన వాటికి డిమాండ్‌ ఉంటోందని పేర్కొన్నారు. తమ స్టోర్లు ఒక్కొక్కటి ప్రతి నెలా సుమారు రూ.  20–25 లక్షల వరకు సేల్స్‌ సాధిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌ కూడా గణనీయంగా వృద్ధి చెందుతోందని వివరించారు. 

అక్కడి వినియోగ ధోరణులను పరిశీలిస్తే పొరుగు రాష్ట్రాన్ని కూడా త్వరలోనే అధిగమించే అవకాశం ఉందన్నారు. సిసలైన డైమండ్‌తో పోలిస్తే ఎల్‌జీడీలు దాదాపు పదో వంతుకే లభిస్తున్నాయని గోయల్‌ తెలిపారు. ఉదాహరణకు సిసలైన డైమండ్‌ ఖరీదు రూ. 9 లక్షలుగా ఉంటే ఎల్‌జీడీ దాదాపు రూ. 1 లక్షకే లభిస్తుందని వివరించారు. ఎల్‌జీడీల కు ఎక్సే్చంజ్‌ ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు చెప్పా రు. ఇలా అందుబాటు ధరలో లభిస్తుండటం, పర్యావరణహితమైనవి కావడంలాంటివి ఎల్‌జీడీలకు సంబంధించి ఆకర్షణీయమైన అంశాలుగా ఉంటున్నాయి.  

ఆదరణ ఎందుకంటే .. 
→ గనుల్లో నుంచి తవ్వి తీసే సహజ వజ్రాల కన్నా పర్యావరణానికి అనుకూలమైన, నైతికంగా తయారు చేసే ప్రత్యామ్నాయాలుగా ఎల్‌జీడీలు ఆదరణ పొందుతున్నాయి.  

→ కొంత ఖర్చు చేయతగిన విధంగా ఆదాయాలు, విలువైన డైమండ్లపై పెట్టుబడి మీద అవగాహన పెరుగుతుండటం. 

→ వినియోగదారుల్లో, ముఖ్యంగా యువత అభిరుచి మారుతుండటం, ఎల్‌జీడీలతో మరింత కస్టమైజ్డ్‌ జ్యుయలరీ డిజైన్లను తయారు చేసేందుకు వీలుండటం. 

→ సహజమైన డైమండ్లతో పోలిస్తే అత్యంత తక్కువ వ్యయాలకే, చాలా తక్కువ సమయంలోనే ఉత్పత్తి చేయడం వల్ల నాణ్యమైన ప్రత్యామ్నాయ వజ్రాలు చౌకగా లభ్యమవుతుండటం 

→ ప్రభుత్వం కూడా వీటి తయారీని ప్రోత్సహించే దిశగా ఎల్‌జీడీ సీడ్స్‌పై కస్టమ్స్‌ సుంకాలను అయిదు శాతం నుంచి సున్నా స్థాయికి తగ్గించింది.  

ఏమిటీ ఎల్‌జీడీలు.. 
→ కార్బన్‌తో కూడుకున్న సహజసిద్ధమైన వజ్రాలను గనుల నుంచి వెలికితీస్తా రు. డైమండ్‌ సీడ్‌ను ఉపయోగించి ఎల్‌జీడీలను హై–ప్రెజర్, హై టెంపరేచర్‌ (హెచ్‌పీహెచ్‌టీ), కెమికల్‌ వేపర్‌ డిపాజిషన్‌ (సీవీడీ) అనే పద్ధతుల్లో ప్రయోగశాలల్లో తయారు చేస్తారు. ఇవి అచ్చంగా సహజమైన డైమండ్లలాగే ఉంటాయి. ఒరిజినల్‌ డైమండ్‌ని, వీటిని పక్కపక్కన పెడితే పలు సందర్భాల్లో నిపుణులు సైతం ప్రత్యేక పరికరాలు లేకుండా వ్యత్యాసాన్ని గుర్తించడం కష్టంగా ఉంటుంది.  

→ సహజమైన రఫ్‌ డైమండ్ల సరఫరా ప్రస్తుతం సుమా రు ఏటా 125 మిలియన్‌ క్యారట్లుగా ఉండగా 2050 నాటికి 14 మిలియన్‌ క్యారట్లకు పడిపోతుందని అంచనా. మరోవైపు డిమాండ్‌ మాత్రం 292 మిలియన్‌ క్యారట్లకు పెరుగుతుందని అంచనా.  

→ మన దగ్గర సూరత్, ముంబై ప్రధాన ఎల్‌జీడీ హబ్‌లుగా ఉంటున్నాయి. ఎల్‌జీడీ ఉత్పత్తిలో దాదాపు 98 శాతం వాటా వీటిదే ఉంటోంది.  

→ డైమండ్‌ విలువను నిర్దేశించేవి 4 ఇలు. కలర్‌ (రంగు), క్లారిటీ (స్వచ్ఛత), కట్, క్యారట్‌ బరువు. ఈ అన్ని ప్రమాణాల్లోనూ సహజ వజ్రాలకు ఎల్‌జీడీలు గట్టి పోటీనిస్తున్నాయి. మలినాలు లేని, అత్యంత స్వచ్ఛమైన ‘టైప్‌ 2ఏ’ రకం డైమండ్ల తరహా వజ్రాలను కూడా తయారు చేస్తున్నారు. 2023లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌కు 7.5 క్యారట్ల ఎల్‌జీడీని బహూకరించారు. ఇది అత్యంత స్వచ్ఛమైనదిగా భావించే టైప్‌ 2ఏ కోవకు చెందిన వజ్రం. ఇలాంటివి ఎంత అరుదైనవంటే.. గనుల్లో నుంచి వెలికి తీసే వజ్రాల్లో 1–2 శాతం మాత్రమే ఈ కోవకి చెందినవై ఉంటాయి.  

→ సహజమైన వజ్రాలు ఏర్పడటానికి 100 కోట్ల నుంచి 330 కోట్ల సంవత్సరాలు పట్టగా, ఎల్‌జీడీలను ల్యాబొరేటరీల్లో కేవలం 2 వారాల నుంచి 10 వారాల్లోనే తయారు చేయొచ్చు.  

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement